అన్నదాత ఆగమాగం
ABN , Publish Date - Apr 01 , 2026 | 05:04 AM
అకాలవర్షం యాసంగి పంటలను దెబ్బతీసి రైతులను ఆగమాగం చేసింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు ఉమ్మడి కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది....
గాలివానతో వాలిన వరి, మొక్కజొన్న.. నేలరాలిన మామిడి
తడిసిన పసుపు, పొద్దుతిరుగుడు పంటలు
కన్నీటిపర్యంతమవుతున్న రైతులు
పలుచోట్ల తీగలపై విరిగిపడ్డ చెట్ల కొమ్మలు
విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం
జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో వేల ఎకరాల్లో పంట నష్టం
నష్టంపై జిల్లాలవారీ ప్రాథమిక అంచనాలు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్)
అకాలవర్షం యాసంగి పంటలను దెబ్బతీసి రైతులను ఆగమాగం చేసింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకు ఉమ్మడి కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. గింజ గట్టిపడే దశలో నవనవలాడుతున్న వరిపంట వాలిపోయింది. కంకుల దశకొచ్చి నిటారుగా ఉన్న మొక్కజొన్న పంట కూడా గాలివాన ఉధృతికి నేలపై తివాచీ పరిచినట్లుగా ఒడిగిపోయింది. టెంకదశలో ఉన్న మామిడి రాలిపోవడంతో భారీ మొత్తంతో తోటలను కొనుకున్న రైతులైతే లబోదిబోమంటున్నారు. విద్యుత్తు స్తంభాలు కూలిపోయాయి. చెట్లు, కొమ్మలు విరిగి తీగలపై పడ్డాయి. ఫలితంగా అనేకచోట్ల విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి తదితర మార్కెట్ యార్డుల్లో అమ్మకానికి తెచ్చిన మక్కలు, పసుపు పంటలు తడిసిపోయాయి. మిరప పంటకూ భారీగానే నష్టం జరిగింది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 6,155 ఎకరాల్లో మామిడి పంట దెబ్బతింది. 1,200 ఎకరాల్లో వరి, 1,400 ఎకరాల్లో మొక్కజొన్న, 550 ఎకరాల్లో నువ్వుల పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. జిల్లాలో 40చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడటంతో విద్యుత్తు లైన్లు దెబ్బతిన్నాయి. కథలాపూర్ మండలం తక్కలపల్లిలో 11 కేవీ విద్యుత్తు స్తంభాలు నేల కూలాయి. వెల్గటూరు మండలం బీరుసాని గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వంట గదిపై చెట్టు విరిగిపడింది. భీమారం, మేడిపల్లి, ఇబ్రహీంపట్నం తదితర మండలాల్లో చెట్టు కొమ్మలు రోడ్డుపై విరిగిపడ్డాయి.

సిరిసిల్ల జిల్లాలో మొక్కజొన్న, మామిడి పంటలతో పాటు కల్లాల వద్ద ఆరబోసిన పొద్దుతిరుగుడు గింజలు తడిసిపోయాయి. గంభీరావుపేట మండలం దమ్మన్నపేట, కుర్తిలింగంపల్లి గ్రామాల్లో మామిడి పంటకు నష్టం వాటిల్లింది. జిల్లాలోని పలు మండలాల్లో వరి గింజలు నేలరాలాయి. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని పారువెళ్ల, మాదాపూర్‌లో మొక్కజొన్న పంట నేలవాలింది. మామిడికాయలు రాలిపోయాయి. పెద్దపల్లి జిల్లాలో 2,231 ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అంతర్గాం, ధర్మారం, ఓదెల, పాలకుర్తి, పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్, సుల్తానాబాద్ మండలాల్లోని 55 గ్రామాల్లో 410 ఎకరాల్లో వరి పంట, 1,757 ఎకరాల్లో మొక్కజొన్న పంట దెబ్బతిన్నట్లు అంచనా వేశారు. మంచిర్యాల జిల్లాలో 2,143 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. 1,792 ఎకరాల్లో మొక్కజొన్న, 351 ఎకరాల్లో వరి పంటకు నష్టం కలిగింది. గాలులతో కొన్నిచోట్ల విద్యుత్తు స్థంభాలు కూలాయి. జైపూర్, నెన్నెల, భీమారం, చెన్నూర్‌లో మామిడి కాయలు నేలరాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలో చెట్లు విరిగి తీగల మీద పడటంతో విద్యుత్త సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 2,600 ఎకరాల్లో వరి సహా మొత్తంగా 2,800 ఎకరాల్లో పంటలకు నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డుకు తెచ్చిన పసుపు పంట పూర్తిగా తడిసిపోయింది. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలంలో వందల ఎకరాల్లో జొన్న, మక్క పంటలకు నష్టం వాటిల్లింది. ఉడికించి కల్లాల్లో ఆరబెట్టిన పసుపు తడిసిపోయింది. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దేవరాంపల్లి,, ఆదివారంపేట గ్రామాల్లో వరిపంట నేలకొరిగింది. తాడిచర్లలో 50 ఎకరాల్లోని మామిడితోటలో కాయలు రాలిపోయాయి. ములుగు జిల్లా తాడ్వాయి-ఏటూరునాగారం మధ్య హైవేపై ఎండిపోయిన చెట్టు కూలిపోవడంతో గంటపాటు రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో పలుచోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.
