Share News

సింగరేణి సుస్థిర మైనింగ్‌లో మరో మైలురాయి

ABN , Publish Date - Jun 10 , 2026 | 05:06 PM

సింగరేణి కాలరీస్ కంపెనీ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. పర్యావరణ ప్రమాణాలను పూర్తిస్థాయిలో పాటించి కేంద్రం నుంచి ప్రశంసలు సహా ఎస్క్రో డిపాజిట్ సొమ్మునూ తిరిగి పొందింది.

సింగరేణి సుస్థిర మైనింగ్‌లో మరో మైలురాయి

ఇంటర్నెట్ డెస్క్: సుస్థిర మైనింగ్ విధానాలు, పర్యావరణ పరిరక్షణలో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(SCCL) మరో అరుదైన మైలురాయిని సాధించింది. మూసివేసిన డోర్లీ-2 భూగర్భ గనిని ఆదర్శవంతంగా పునరుద్ధరించి, పర్యావరణ ప్రమాణాలను పూర్తిస్థాయిలో పాటించినందుకు కేంద్రం.. ఆ సంస్థకు రూ.40 కోట్ల ఎస్క్రో డిపాజిట్‌ సొమ్మును వడ్డీతో సహా తిరిగి చెల్లించింది. పర్యావరణ ప్రమాణాల అమలుపై సింగరేణిని ప్రశంసిస్తూ.. కేంద్ర కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ నుంచి సదరు నిధులను విడుదల చేసింది.


గని మూసివేతలో పర్యావరణ నిబంధనలను పూర్తిగా అమలు చేసిన సింగరేణి.. బొగ్గు తవ్వకాలు పూర్తైన తర్వాత ఆ భూములను మళ్లీ పచ్చని అడవులుగా మార్చడంపై ప్రత్యేక దృష్టి సారించింది. డోర్లీ గని ప్రాంతంలో దాదాపు 162 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో దట్టమైన అడవులను పునరుద్ధరించింది. తవ్వకాలు ప్రారంభించే ముందు సేకరించిన దాదాపు 19.76 లక్షల క్యూబిక్ మీటర్ల సారవంతమైన మట్టిని భద్రపరిచి, తిరిగి మొక్కల పెంపకానికి వినియోగించింది. గనుల్లో డ్రిల్లింగ్ సమయంలో దుమ్ము, ధూళి చేరకుండా డస్ట్ కంట్రోలర్లు, తడి డ్రిల్లింగ్ పద్ధతులు అనుసరించేలా చర్యలు చేపట్టింది. రవాణా మార్గాల్లో వాటర్ స్ప్రింక్లర్ల ద్వారా నిరంతరం నీటిని చల్లుతూ కాలుష్యాన్ని అదుపులో ఉంచేందుకు యత్నించింది.


ఇలా సింగరేణి.. పర్యావరణ పరిరక్షణలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించినందుకు గానూ కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ డోర్లీ-2 ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ పరిరక్షణ డిపాజిట్‌ను విడుదల చేసింది. గతంలోనూ ఆర్కే-8 గనికి రూ.4 కోట్ల డిపాజిట్ కూడా తిరిగి పొందిన ఈ సంస్థ.. త్వరలో డోర్లీ-1 గనికి సంబంధించి మరో రూ.60 కోట్లకు పైగా నిధులను పొందే అవకాశముంది.


ఇవీ చదవండి:

పీఓకేలో ఉద్రిక్తత.. కశ్మీర్‌లో జోజిలా సంబరాలు

తమిళ రాజకీయాల్లోకి రాఘవ లారెన్స్.! కీలక ప్రకటన వాయిదా

Updated Date - Jun 10 , 2026 | 05:51 PM