Share News

ఎల్‌ఆర్‌ఎస్‌కు ఊపిరి

ABN , Publish Date - May 02 , 2026 | 12:21 AM

ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ప్లాట్ల యజమానులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పెండింగ్‌లో ఉన్న లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తుల పరిష్కారానికి ఊతమిచ్చేలా ఫీజుల చెల్లింపుపై 25శాతం రాయితీ అందిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఎల్‌ఆర్‌ఎస్‌కు ఊపిరి
Land Regularisation

దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం నిర్ణయం

ప్లాట్ల యజమానులకు ఊరట

దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం నిర్ణయం

జమ్మికుంట, మే 1 (ఆంధ్రజ్యోతి): ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ప్లాట్ల యజమానులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పెండింగ్‌లో ఉన్న లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తుల పరిష్కారానికి ఊతమిచ్చేలా ఫీజుల చెల్లింపుపై 25శాతం రాయితీ అందిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020లో ఎల్‌ఆర్‌ఎస్‌ కింద దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి ఈ రాయితీ వర్తించనుంది. మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్సి జయేశ్‌ రంజన్‌ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు 2026 మే 01నుంచి జూలై 31వరకు మూడు నెలల పాటు ఫీజు చెల్లించిన వారికి మాత్రమే ఈ తగ్గింపు లభించనుంది. సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను వేగంగా పరిష్కరించడంతో పాటు మధ్య తరగతి ప్రజలపై ఆర్ధిక భారం తగ్గించమే లక్ష్యంగా ఈ రాయితీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.


అనధికార లేఅవుట్లకు చట్టబద్ధత

జమ్మికుంట మున్సిపల్‌ పరిధిలో అనధికార లేఅవుట్ల సమస్య ఎక్కువగా ఉంది. ఈ పథకం ద్వారా వాటిని చట్టబద్ధత చేసుకునే అవకాశం ఉంది. రాయితీ కాలాన్ని వినియోగించుకుంటే భవిష్యత్తులో ఆస్తుల విలువ పెరుగడమే కాకుండా, రిజిస్ట్రేషన్‌, బ్యాంకు రుణాలు తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తవని అధికారులు చెబుతున్నారు. జమ్మికుంట మన్సిపల్‌ పరిధిలో 2020 ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం కింద 62,660 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1140మంది ఎల్‌ఆర్‌ఎస్‌ అప్రూవల్‌ చేసి ప్రొసిడింగ్‌లు ఆందజేశారు. ఇంకా 5,400 మంది ఫీజు చెల్లించని వారు ఉన్నారు. వీరందరికీ 25శాతం రాయితీ అభించనుంది.


అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: మహమ్మద్‌ అయాజ్‌, మున్సిపల్‌ కమిషనర్‌

ఎల్‌ఆర్‌ఎస్‌ కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించేందుకు మంచి అవకాశం. మధ్యతరగతి ప్రజలకు 25శాతం రాయితీ ఆర్ధికంగా పెద్ద ఊరట కలిగిస్తుంది. ఈ అవకాశాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలి. భవిష్యత్తులో ఎలాంటి చట్టపరమైన సమస్యలు లేకుండా, ఆస్తులపై పూర్తి హక్కులు పొందవచ్చు.

Updated Date - May 02 , 2026 | 09:08 AM