నాపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై టైమ్ వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటా
ABN , Publish Date - Nov 20 , 2026 | 04:43 AM
తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై సమయం వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటానని సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ అన్నారు.
ఉనికి కోసమే నాపై తప్పుడు ప్రచారం
26 ఏళ్ల సర్వీసులో 20 బదిలీలు..
ఎక్కడున్నా తగ్గేదేలే
అగ్నిమాపక శాఖ డీజీ వీసీ సజ్జనార్
హైదరాబాద్, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై సమయం వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటానని సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ అన్నారు. ఉనికి చాటుకునేందుకే కొందరు తన ఫొటో, పేరు పెట్టుకుని దుష్ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. వారు చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. చట్టం తన పని చేయాల్సి వస్తుందన్నారు. గురువారం గచ్చిబౌలిలోని కార్యాలయంలో అగ్నిమాపక శాఖ డీజీగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి నాగేశ్వరరావు ఆరోపణలు చేయడాన్ని విలేకరులు ప్రస్తావించగా సజ్జనార్ స్పందిస్తూ టైమ్ వస్తుందని, టైమ్ వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటానని చెప్పారు.
రోడ్లపైకి వచ్చి గొడవ చేయాలనుకోవడం లేదని, అందరి చరిత్ర అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. తన 26 ఏళ్ల సర్వీసులో 20 బదిలీలు జరిగాయని, ఒక్క ఏడాదిలోనే రెండు, మూడు బదిలీలు జరిగిన సందర్భాలు ఉన్నాయన్నారు. కొన్నిసార్లు కొత్త పోస్టులో చేరకముందే బదిలీ అయ్యానన్నారు. బదిలీలు తనకు కొత్తేమీ కాదని, ఎక్కడ ఉన్నా తగ్గేదేలేదని చెప్పారు. ప్రభుత్వ పరిపాలనలో భాగంగానే బదిలీలు జరిగాయని, 21 మంది అధికారులు బదిలీ అయ్యారని, వారిలో తాను ఒకడినన్నారు. ప్రభుత్వం తనకు ఏ బాధ్యత అప్పగించినా అంకితభావంతో పనిచేస్తానని చెప్పారు. పాత భవనాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, హాస్టళ్లలో ఫైర్ సేఫ్టీ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని తెలిపారు. అగ్నిప్రమాదాల సమయంలో ప్రజలు కూడా బాధ్యతాయుతంగా, సమర్థవంతంగా స్పందించేలా ‘ఫస్ట్ రెస్పాండర్’ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఆర్టీసీలో అమలుచేసిన తరహాలోనే ఫైర్, ఎస్‌పీఎఫ్ విభాగాల్లోని సుమారు ఐదు వేల మంది సిబ్బందికి గ్రాండ్ హెల్త్ చాలెంజ్ అమలు చేయనున్నట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో డ్రగ్స్ కింగ్‌పిన్ అరెస్ట్.. 51 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏ స్వాధీనం
‘క్రమశిక్షణ ముందు అందరూ సమానమే’.. రాజ్‌గోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై మహేశ్ రియాక్షన్
Read latest Telangana News And Telugu NEws