సినీ నటి రేణు దేశాయ్ కేసులో పురోగతి.. ఇద్దరి అరెస్ట్
ABN , Publish Date - Mar 17 , 2026 | 06:20 PM
సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా.. రేణు దేశాయ్ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు.. ఇద్దరిని అరెస్ట్ చేశారు.
హైదరాబాద్, మార్చి17: సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఇచ్చిన ఫిర్యాదులపై స్పందించిన పోలీసులు తాజాగా సినీ నటి రేణు దేశాయ్(Renu Desai case) దాఖలు చేసిన ఫిర్యాదుపై కూడా స్పందించారు. ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే...
కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై , తన పిల్లలపై వస్తున్న అసభ్యకర కామెంట్లు, వ్యక్తిగత దూషణలపై రేణు దేశాయ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తూ.. అశ్లీల పదజాలంతో వేధిస్తున్న నాలుగు సోషల్ మీడియా అకౌంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారామె. మార్చి 2న ఆమె ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. సాంకేతిక ఆధారాల సాయంతో ఇద్దరు నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ఇద్దరి కోసం కూడా గాలింపు చర్యలు వేగవంతం చేశారు.
ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. సోషల్ మీడియా వేదికగా నకిలీ అకౌంట్లతో కామెంట్లు చేస్తే ఎవరూ పట్టుకోలేరనే ధైర్యంతో ఉన్నకేటుగాళ్ల ఆటకట్టిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే నటి అనసూయను సోషల్ మీడియాలో వేధించిన కేసులో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వరుసగా జరుగుతున్న ఈ అరెస్టులు వేధింపులకు పాల్పడే వారిలో వణుకు పుట్టిస్తున్నాయి. ప్రముఖులే కాకుండా సామాన్య మహిళలు కూడా ఈ తరహా వేధింపులకు గురైతే.. వెంటనే పోలీసులను ఆశ్రయించాలని, సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్ పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
సెలవు ఇవ్వలేదని.. బ్యాంక్ మేనేజర్‌ను కాల్చేసిన గార్డ్..
మీ కళ్లకు పరీక్ష.. ఈ గడ్డిలో పాము ఎక్కడుందో 15 సెకెన్లలో కనిపెట్టండి..