Share News

NZ vs SA: సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం

ABN , Publish Date - Mar 17 , 2026 | 05:15 PM

తొలి టీ20లో దక్షిణాప్రికా చేతిలో ఎదురైన పరాభవానికి న్యూజిలాండ్‌ ప్రతీకారం తీర్చుకుంది. రెండో టీ20 మ్యాచ్‌లో ప్రొటీస్ జట్టుపై 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

NZ vs SA: సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం
NZ vs SA

స్పోర్ట్స్ డెస్క్: తొలి టీ20లో దక్షిణాప్రికా చేతిలో ఎదురైన ఓటమికి న్యూజిలాండ్‌ ప్రతీకారం తీర్చుకుంది. రెండో టీ20 మ్యాచ్‌లో ప్రొటీస్ జట్టుపై 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్‌-2026లో రన్నరప్‌గా నిలిచిన కివీస్.. ప్రస్తుతం స్వదేశంలో సౌతాఫ్రికాతో(NZ vs SA) ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడుతోంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే..


ఇవాళ(మంగళవారం) హామిల్టన్‌ వేదికగా కివీస్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్ జరిగింది. టాస్‌ ఓడిన కివీస్‌.. సౌతాఫ్రికా ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. టాపార్డర్‌లో ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌ (11), వన్‌డౌన్‌ బ్యాటర్‌ టిమ్‌ రాబిన్సన్‌ (1) నిరాశపర్చారు. అయితే మరో ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే అర్ధ శతకం (60)తో రాణించాడు. మిగిలిన వారిలో నిక్‌ కెలీ ( 21), కెప్టెన్‌ మిచెల్‌ శాంట్నర్‌ (21) పర్వాలేదనిపించారు. చివర్లో కోల్‌ మెకాంచి (12 బంతుల్లో 18), జోష్‌ క్లార్క్‌సన్‌ (9 బంతుల్లో 26) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడారు. ఇక సఫారీ బౌలర్లలో వియాన్‌ ముల్డర్‌ రెండు వికెట్లు సాధించగా.. గెరాల్డ్‌ కోయెట్జి, ఒట్నీల్‌ బార్ట్‌మాన్‌, కెప్టెన్‌ కేశవ్‌ మహరాజ్‌, జార్జ్‌ లిండే తలో వికెట్‌ తీశారు.


ఇక 176 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టుకు ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు కొన్నోర్‌ ఎస్తరూజెన్‌ (8), వియాన్‌ ముల్డర్‌ (16) స్వల్ప పరుగులకే పెవిలియన్ చేరారు. వన్‌డౌన్‌లో వచ్చిన టోనీ జార్జి (1) కూడా నిరాశపరిచాడు. మిగిలిన వారిలో జార్జ్‌ లిండే 12 బంతుల్లో 33 పరుగులు చేసి.. విజయం కోసం కాసేపు పోరాడాడు. రూబిన్‌ హెర్మాన్‌ (19) కూడా పర్వాలేదనిపించాడు. మిగిలిన వారంతా చేతులెత్తేయడంతో 15.3 ఓవర్లలో 107 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌటైంది. కివీస్‌ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్‌, బెన్‌ సియర్స్‌ చెరో మూడు వికెట్లతో సౌతాఫ్రికా ఓటమిని శాసించారు. అలానే శాంట్నర్‌ రెండు, మెకాంచి, జేమ్స్‌ నీషమ్‌ తలా ఒక వికెట్‌ పడగొట్టారు. ఈ విజయంతో న్యూజిలాండ్ సిరీస్‌ను ప్రస్తుతానికి 1-1తో సమం చేసింది. తొలి టీ20లో సౌతాఫ్రికా గెలిచిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా మూడో టీ20 జరగనుంది.


ఇవి కూడా చదవండి:

ఐపీఎల్‌లో ఇంకా కలగానే ఆ ఆటగాళ్ల కోరిక!

టీ20 ప్రపంచకప్ 2026 విజేతను సత్కరించిన సీఎం రేవంత్

Updated Date - Mar 17 , 2026 | 05:33 PM