ఐపీఎల్‌లో ఇంకా కలగానే ఆ ఆటగాళ్ల కోరిక!
ABN , Publish Date - Mar 17 , 2026 | 03:44 PM
ఐపీఎల్‌లో ప్రతి మ్యాచ్‌లో చక్కటి ప్రదర్శన చేసిన ఒకరికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది ప్లేయర్లు వివిధ మ్యాచుల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ను గెలుచుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే కొందరు ప్లేయర్లకు..
స్పోర్ట్స్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) అంటే క్రికెట్ ప్రియులకు పండగలాంటిది. ఈ లీగ్‌లో సెంచరీలు, హాఫ్ సెంచరీలు, వికెట్ల వేటలో ప్లేయర్లు దూసుకుపోతుంటారు. అలానే ప్రతి మ్యాచ్‌లో చక్కటి ప్రదర్శన చేసిన ఒకరికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది ప్లేయర్లు వివిధ మ్యాచుల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ను గెలుచుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే.. ఐపీఎల్ చరిత్రలో కొందరు స్టార్ ప్లేయర్లు ఒకే జట్టుపై దశాబ్ద కాలానికి పైగా ఆడుతున్నా.. నేటికీ ఆ జట్టుపై ఒక్కసారి కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలవలేకపోవడం గమనార్హం. ఐపీఎల్ 2026 సీజన్ ఈ నెల 28న ప్రారంభం కానున్న తరుణంలో ఈ అంశం తెరపైకి వచ్చింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...
రికార్డుల రారాజు, టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి ఒక జట్టుపై ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. రాజస్థాన్ రాయల్స్‌తో 33 మ్యాచ్‌ల్లో కోహ్లీ ఎన్నో పరుగులు చేసినప్పటికీ, ఆ జట్టుపై ఒక్కసారి కూడా ఈ అవార్డును అందుకోలేకపోయాడు. అలానే చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ముంబై ఇండియన్స్‌పై ఏకంగా 37 మ్యాచ్‌లు ఆడినప్పటికీ, ఇప్పటివరకు ఒక్కసారి కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకోలేదు. అలానే టీమిండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్.. ఇప్పటివరకు చెన్నైపై 33 మ్యాచ్‌లు ఆడినప్పటికీ ఒక్క అవార్డు కూడా సాధించలేకపోయాడు. అలానే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కూడా కార్తీక్ ఈ అవార్డును గెలవలేకపోయాడు.
కేకేఆర్ జట్టుపై భువనేశ్వర్ కుమార్ ఎన్నో కీలక వికెట్లు పడగొట్టాడు. కానీ, ఆ జట్టుతో తలపడిన 30 మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా అతణ్ని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించలేదు. మాజీ ప్లేయర్ రాబిన్ ఉతప్ప ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై తన కెరీర్‌లో 28 మ్యాచ్‌లు ఆడాడు. అయితే ఢిల్లీపై అతడు ఒక్కసారీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోలేదు. మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ ఎందరో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టినప్పటికీ, సన్ రైజర్స్ హైదరాబాద్‌పై ఆడిన 27 మ్యాచ్‌ల్లో ఈ అవార్డును అందుకోలేపోవడం విశేషం. అలానే ఇంకా చాలా మంది ప్లేయర్లు కొన్ని జట్లపై ఎన్నో మ్యాచులు ఆడినప్పటికీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‍ను గెలవలేకపోయారు. ఈ క్రమంలో ఐపీఎల్ నుంచి కొందరు ప్లేయర్లు రిటైర్ కాగా.. మరికొందరు కొనసాగుతున్నారు. ఐపీఎల్ 2026లోనైనా ఈ ఆటగాళ్లు ఈ రికార్డులను చెరిపివేస్తారో లేదో చూడాలి.
ఇవి కూడా చదవండి:
కాబూల్‌పై దాడిలో 400 మంది మృతి.. పాక్‌పై అఫ్గానిస్థాన్ క్రికెటర్ల ఆగ్రహం
అందుకే సీఎస్కేకి వచ్చా.. రాజస్థాన్ రాయల్స్‌ను వీడటంపై సంజు శాంసన్ రియాక్షన్