కాబూల్‌పై దాడిలో 400 మంది మృతి.. పాక్‌పై అఫ్గానిస్థాన్ క్రికెటర్ల ఆగ్రహం
ABN , Publish Date - Mar 17 , 2026 | 11:27 AM
అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో దాదాపు 400 మంది ప్రాణాలు కోల్పోగా, 250 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. దీనిపై అఫ్గాన్ క్రికెటర్లు తీవ్రంగా స్పందించారు. పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్‌పై పాకిస్థాన్ జరిపిన భారీ వైమానిక దాడి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ దాడిలో దాదాపు 400 మంది ప్రాణాలు కోల్పోగా, 250 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారికి చికిత్స అందిస్తున్న ఆసుపత్రిపై ఈ దాడులు జరిగాయని అఫ్గాన్ ప్రభుత్వ డిప్యూటీ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రాట్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టించిన నేపథ్యంలో అఫ్గాన్ క్రికెటర్లు తీవ్రంగా స్పందించారు. పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనపై అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ స్పందించాడు. ‘కాబూల్‌లో పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడుల వల్ల అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్తలు నన్ను తీవ్రంగా కలిచివేస్తున్నాయి. ప్రజల ఇళ్లు, విద్య, వైద్య సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి వాటికి పాల్పడటం నేరం. ఇది హేయమైన చర్య. పవిత్ర రంజాన్ మాసంలో అమాయక ప్రజల ప్రాణాలు తీయడం అత్యంత బాధాకరం. ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి సహా మానవ హక్కుల సంస్థలు దర్యాప్తు చేయాలి’ అని రషీద్ ఖాన్ డిమాండ్ చేశాడు.
కాబూల్ ఘటనపై అఫ్గానిస్థాన్ మాజీ కెప్టెన్ మహ్మద్ నబీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన యువకులు బాంబు దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రి గేటు వద్ద తల్లిదండ్రులు తమ కుమారుల పేర్లు పిలుస్తూ అలాగే ఉండిపోయారు. రంజాన్ మాసంలో తమ పిల్లల జీవితాలు ముగిసిపోయాయని రోదిస్తున్నారు. ఇంతకంటే హృదయవిదారకం మరొకటి ఉంటుందా?’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇవి కూడా చదవండి:
అందుకే సీఎస్కేకి వచ్చా.. రాజస్థాన్ రాయల్స్‌ను వీడటంపై సంజు శాంసన్ రియాక్షన్
ఐపీఎల్ 2026: నడవలేని స్థితిలో హర్షిత్ రాణా.. చాలా మ్యాచ్‌లకు దూరం!