Share News

పదవీ విరమణ ప్రయోజనాలు ఇవ్వరూ?

ABN , Publish Date - Sep 18 , 2026 | 06:24 AM

తెలంగాణ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు తమకు రావాల్సిన గ్రాట్యుటీ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌, పీఆర్సీ, డీఏ బకాయిలను చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 2015 నుంచి పదవీ విరమణ చేసిన సుమారు 16 వేల మందికి రూ.700 కోట్లకుపైగా బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.

పదవీ విరమణ ప్రయోజనాలు ఇవ్వరూ?
TSRTC retired employees dues

  • రూ.700 కోట్ల బకాయిలు చెల్లించాలని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల డిమాండ్‌

  • ఏళ్లుగా పెండింగ్‌లో గ్రాట్యుటీ, లీవ్‌ ఎన్‌క్యా్‌షమెంట్‌, పీఆర్సీ బకాయిలు

  • ఆర్థిక ఇక్కట్లతో సతమతమవుతున్నామని ఆవేదన

హైదరాబాద్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో దశాబ్దాలపాటు సేవలందించి పదవీ విరమణ పొందిన ఉద్యోగులు తమ రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ కోసం పడిగాపులు పడుతున్నారు. పదవీ విరమణ అనంతరం తమకు రావాల్సిన సొమ్ము కోసం ఆర్టీసీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. వృద్ధాప్యంలో కుటుంబ, వైద్య అవసరాల కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు. గ్రాట్యుటీ, లీవ్‌ ఎన్‌క్యా్‌షమెంట్‌, వేతన సవరణ బకాయిలు తదితర ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందకపోవడంతో రాష్ట్రంలో వేలాది మంది ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


ఆర్టీసీలో ఏటా వేల మంది పదవీ విరమణ పొందుతున్నారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రెండు, మూడు నెలల్లో వారి పీఎఫ్‌ డబ్బులు అందుతున్నాయి. అయితే వాళ్లకు అందాల్సిన మొత్తంలో సుమారు 50 శాతం పీఎఫ్‌ నుంచే కాగా మిగిలినవి గ్రాట్యుటీ, లీవ్‌ ఎన్‌క్యా్‌షమెంట్‌, డీఏ ఏరియర్స్‌, 2017 వేతన సవరణ బకాయిలు ఉన్నాయి. ఆర్టీసీలో 2015 నుంచి ఇప్పటి వరకు సుమారు 16 వేల మంది శ్రామిక్‌ నుంచి అధికారి స్థాయి వరకు పదవీ విరమణ చేశారు. వారికి సంబంధించి లీవ్‌ ఎన్‌క్యా్‌షమెంట్‌, 2017 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు, గ్రాట్యూటీ, డీఏ బకాయిలు కలిపి సుమారు రూ.700 కోట్లకుపైగా ఉన్నాయి. 2017 ఏప్రిల్‌ నుంచి 2025 జూలై వరకు రివైజ్డ్‌ పే స్కేల్‌(ఆర్‌పీఎస్‌) బకాయిలతోపాటు పెరిగిన డీఏలు కూడా రావాల్సి ఉంది.


2017 పీఆర్సీకి ముందు పదవీ విరమణ చేసిన వారికి ఆర్‌పీఎస్‌ బకాయిల చెల్లింపు మినహా మిగతా అంశాలకు సంబంధించి సంస్థ నుంచి డబ్బులు అందాల్సి ఉంది. ఉద్యోగ విరమణ సమయంలో కుటుంబ ఆర్థిక భద్రతకు అండగా నిలిచే గ్రాట్యుటీ కూడా కొందరికి సకాలంలో అందడం లేదని రిటైర్డ్‌ ఉద్యోగులు వాపోతున్నారు. రిటైర్‌మెంట్‌ సమయంలో ఒకేసారి అందాల్సిన ప్రయోజనాలు విడతల వారీగా వస్తుండడంతో ఆర్థిక ప్రణాళికలు తారుమారవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, విశ్రాంత ఉద్యోగుల్లో ఎక్కువ మంది వృద్థాప్యంలో ఉన్నారు. నెలవారీ మందులు, వైద్య పరీక్షలు, ఆస్పత్రి ఖర్చులు భరించడం తమకు కష్టంగా మారిందని వారంతా వాపోతున్నారు.


ఒకవైపు పెన్షన్‌ పరిమితంగానే ఉండటం.. మరోవైపు రిటైర్‌మెంట్‌ బెనిఫిట్స్‌ ఆలస్యం కావడంతో కుటుంబ సభ్యులపై ఆధారపడాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తాము బకాయిల కోసం ఎదురుచూడటం ఎంతటి మానసిక వేదనో ప్రభుత్వ పెద్దలు, ఆర్టీసీ యాజమాన్యం అర్థం చేసుకోవాలని విశ్రాంత ఉద్యోగులు కోరుతున్నారు. బకాయిల కోసం ఎదురుచూస్తున్న వారిలో కొందరు అనారోగ్యంతో మృతి చెందిన సందర్భాలు ఉన్నాయని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. రిటైర్డ్‌ ఉద్యోగుల వయసు, ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని బకాయిలను ప్రాధాన్యతా క్రమంలో బకాయిలు చెల్లించాలని రిటైర్డు ఉద్యోగులు డిమాండ్‌ చేస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

చెక్‌పోస్ట్‌-పంజాగుట్ట ఎలివేటెడ్‌ కారిడార్‌!
అవినీతి కేసులో సీఐ, ఎస్సై అరెస్ట్‌

Updated Date - Sep 18 , 2026 | 06:24 AM