Traffic Jam at Hyd: సంక్రాంతి జోష్.. నగరంలో ట్రాఫిక్ రష్.!
ABN , Publish Date - Jan 10 , 2026 | 05:53 PM
సంక్రాంతి సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. మరీ ముఖ్యంగా.. పంతంగి టోల్‌ప్లాజా వద్ద రద్దీ తీవ్రంగా కనిపిస్తోంది. సుమారు 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
హైదరాబాద్, జనవరి 10: సంక్రాంతి పండుగ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో భాగ్యనగర పరిసర రహదారులన్నీ ట్రాఫిక్ జామ్‌తో కిటకిటలాడుతున్నాయి. నేడు రెండో శనివారం, రేపు ఆదివారం కావడంతో.. పండుగకు ముందే ప్రయాణికులు ఊర్లకు వెళ్తుండటమే ఈ రద్దీకి ప్రధాన కారణం. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై(NH-65) వాహనాల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా ఓవైపు ఔటర్ రింగ్ రోడ్(ORR) వద్ద వాహనాలు బారులు తీరగా.. మరోవైపు పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఉదయం నుంచీ వెహికిల్స్ క్యూ కట్టాయి. పెద్ద కాపర్తి నుంచి వెలిమినేడు వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
సాధారణంగా.. పంతంగి టోల్‌ప్లాజా మీదుగా రోజుకు సుమారు 35వేల నుంచి 40వేల వరకూ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే.. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో శుక్రవారం ఒక్కరోజే సుమారు 65 వేల వెహికిల్స్ ఆ మార్గంలో పరుగులు పెట్టాయి. ఇక.. నేడు ఈ రద్దీ మరింత పెరిగిందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో వాహనాల రద్దీని నియంత్రించేందుకు టోల్‌ప్లాజా సిబ్బంది సహా పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తక్షణ చర్యలు చేపడుతున్నారు. ఇంత పెద్దఎత్తున ట్రాఫిక్ జామ్ అవ్వడానికి ప్రధాన కారణాలు రోడ్డు ఇరుకుగా ఉండటం, సంక్రాంతి సందర్భంగా వాహనాల రద్దీ భారీగా పెరగడం. అదనంగా.. పెద్ద కాపర్తి దగ్గర జరుగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులూ ట్రాఫిక్‌ను మరింత తీవ్రతరం చేశాయి. అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి రోడ్లు విస్తరించినప్పటికీ, పండుగ సీజన్ రద్దీ ముందు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు.
మరోవైపు.. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లోనూ వాహనాల రద్దీ పెరిగింది. హైవే సర్వీస్ రోడ్డుపై గుంతల కారణంగా వాహనదారులు నెమ్మదిగా రాకపోకలు సాగిస్తున్నారు. అటు.. ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే వాహనాలతో కీసర టోల్‌ప్లాజా కిటకిటలాడుతోంది.
ఇవీ చదవండి:
హైదరాబాద్-విజయవాడ మధ్య మరో 10 సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్
భూ భారతి పేరుతో ఏజెంట్ల దందా.. ఏకంగా..