Daggubati Suresh Babu: దగ్గుబాటి కుటుంబంపై తప్పుడు వార్తలు రాస్తే చర్యలు తప్పవు: సురేశ్ బాబు
ABN , Publish Date - Jan 10 , 2026 | 01:55 PM
దగ్గుబాటు కుటుంబంపై వచ్చిన తప్పుడు కథనాలపై సినీ నిర్మాత డి.సురేశ్ బాబు స్పందించారు. ఈ వార్తలను ఖండించిన ఆయన.. ఇలాంటి కథనాలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇంటర్నెట్ డెస్క్: దగ్గుబాటి కుటుంబంపై వచ్చిన తప్పుడు వార్తలను ప్రముఖ నిర్మాత డి.సురేశ్ బాబు ఖండించారు(Daggubati Suresh Babu). ఈ నెల 2న న్యాయస్థానంలో హాజరు కావాలన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలను వక్రీకరించి ఇలాంటి కథనాలు ప్రచురించారని ఆయన ఆరోపించారు. తాను వ్యక్తిగతంగా హాజరు కానవసరం లేదని కోర్టు ఇప్పటికే వెల్లడించిందని పేర్కొన్నారు. నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీకి ఎలాంటి కారణాలూ లేవని న్యాయస్థానం తెలిపిందని చెప్పారు సురేశ్ బాబు.
ఇలాంటి తప్పుడు కథనాలు ప్రచురితం కావడంపై సురేశ్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. 'సంచలనాత్మక కథనాలతో ప్రజలను తప్పుదారి పట్టించడం ఆవేదన కలిగిస్తోంది. ఇలాంటి తప్పుడు ప్రచురణలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం' అని ఆయన హెచ్చరించారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తిగా నమ్మకముందని స్పష్టం చేశారు. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అధికారిక రికార్డులు పరిశీలించాలని ఈ సందర్భంగా నిర్మాత విజ్ఞప్తి చేశారు. ఎక్కడా తమకు నాన్‌బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తామని చెప్పలేదని చెప్పుకొచ్చారు.
గతంలోనూ..
2017లో టాలీవుడ్ డ్రగ్స్ కేసు సమయంలోనూ.. తన కొడుకులు రానా, అభిరామ్‌లకు డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉన్నట్టు పుకార్లు రాగా.. నాడు వాటిని కొట్టిపారేశారు సురేశ్ బాబు. అలాగే భూ వివాదాలపైనా కొన్ని వార్తలు రాగా.. అవి తమ వ్యక్తిగత సమస్యలనీ.. వాటిని బహిరంగంగా చర్చించకుండా వ్యక్తిగతంగా పరిష్కరించుకుంటామని, పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారాయన. మొత్తంగా.. దగ్గుబాటి కుటుంబంపై వచ్చే ఊహాగానాలు, తప్పుడు వార్తలను సురేశ్ బాబు ఎప్పటికప్పుడు ఖండిస్తూ, నిజానిజాలను వివరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇవీ చదవండి: