Telangana: భూ భారతి పేరుతో ఏజెంట్ల దందా.. ఏకంగా..
ABN , Publish Date - Jan 10 , 2026 | 12:24 PM
గతంలో ధరణి.. ప్రస్తుతం భూ భారతి.. పేరు ఏదైతేనేం వారి వసూళ్లకు ఆంతు ఉండదు. తాము చేసిందే స్లాటు, చెప్పిందే రేటు అన్నట్లుగా వైఖరి ఉంటుంది. డాక్యుమెంట్ రైటర్లు, స్లాట్ బుకింగ్ ఏజెంట్లు, మీ సేవా కేంద్రాలు. చేసే పని ఒకటే అయినా వసూళ్లలో మాత్రం ఎవరి తీరు వారిదే.
స్లాట్ బుకింగ్ ఏజెంట్ల అక్రమ దందా
అమాయకులే లక్ష్యంగా అడ్డగోలు దోపిడీ
తప్పిదాలుంటే తహసీల్దార్ల పేర్లతో వసూళ్లు
పర్యవేక్షణ లేకపోవడంతో విచ్చలవిడిగా రేట్లు
భూ భారతి అక్రమాలకు అధికారుల అండ?
జనగామ, జనవరి 10: గతంలో ధరణి.. ప్రస్తుతం భూ భారతి.. పేరు ఏదైతేనేం వారి వసూళ్లకు ఆంతు ఉండదు. తాము చేసిందే స్లాటు, చెప్పిందే రేటు అన్నట్లుగా వైఖరి ఉంటుంది. డాక్యుమెంట్ రైటర్లు, స్లాట్ బుకింగ్ ఏజెంట్లు, మీ సేవా కేంద్రాలు. చేసే పని ఒకటే అయినా వసూళ్లలో మాత్రం ఎవరి తీరు వారిదే. భూముల క్రయ విక్రయాల్లో వారిదే కీలకం. అధికారులకు, క్రయవిక్రయదారులకు వారదిగా ఉంటూ అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. భూ భారతి పోర్టల్ ద్వారా ఆక్రమాలకు పాల్పడ్డ వైనం జిల్లాలో వెలుగుచూడగా స్లాట్ బుకింగ్ కేంద్రాలు, మీసేవా కేంద్రాల్లో వసూళ్లు, వాటి పని తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
అమాయకులే లక్ష్యంగా..
భూముల క్రయ విక్రయాలకు వచ్చే అమాయకులు, అవసరార్థులే లక్ష్యంగా కొందరు డాక్యుమెంట్ రైటర్లు, స్లాట్ బుకింగ్ ఏజెంట్లు ఆక్రమ దందాకు తెరలేపుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. భూముల క్రయవిక్రయాలు జరగాలంటే మొదటగా తమకు అనుకూలమైన తేదీలో స్లాట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్లాట్‌లను సొంతంగానూ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ, చాలా మందికి అవగాహన లేకపోవడంతో డాక్యుమెంట్ రైటర్లను, మీసేవా కేంద్రాలను ఆశ్రయిస్తుంటారు. వీరు స్లాట్ బుక్ చేసి డాక్యుమెంట్ ఫైల్ తయారు చేసి తహసీల్దార్ వద్దకు పంపిస్తారు. తహసీల్దార్ దీనిని పరిశీలించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు. కాగా, ఈ పనికి మీ సేవా కేంద్రాల్లో ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం రూ.200 చొప్పున తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల మీసేవా కేంద్రాల్లో జీఎస్టీ, ఇతర ట్యాక్స్‌ల పేరుతో రూ.300 వరకు తీసుకుంటుండగా ప్రైవేటుగా పెట్టుకున్న స్లాట్ బుకింగ్ కేంద్రాల నిర్వాహకులు మాత్రం రూ.1000 నుంచి రూ. 1500 పైనే తీసుకుంటున్నారన్న ప్రచారం ఉంది.
రశీదుల ఎడిటింగ్‌తోనూ మోసాలు..
జిల్లాలో కొన్ని చోట్ల స్లాట్ బుకింగ్ ఏజెంటు చలాన్ రశీదులను ఎడిట్ చేసి ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్టాంపు డ్యూటీకి సంబంధించిన ప్రింట్ అవుట్ తీసిన తర్వాత ఉదాహరణకు దానిపై రూ.10వేలు ఉంటే దానిని స్కాన్ చేసి రూ.20వేలుగా మార్చి తిరిగి ప్రింట్ తీసి ఇస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీల ఛార్జీలపై పూర్తిగా అవగాహన లేని వారి విషయంలో ఈ విధంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. దీనితో పాటు ఆధార్ కార్డులో తప్పిదాలున్నాయని, వాటిని సరిచేయాలంటే ఎక్కువ డబ్బులు కావాలంటూ అధిక మొత్తంలో వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో కొన్ని చోట్ల తహసీల్దార్ల పేర్లు చెప్పి వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారి స్లాట్ బుక్ అయితే ఆ రోజుకు రిజిస్ట్రేషన్ జరగాల్సిందే. లేనిపక్షంలో స్లాట్ రద్దవుతుంది. స్లాట్ రద్దు అయితే ఒకసారి చెల్లించిన రిజిస్ట్రేషన్ చార్జీలు తిరిగి రావు. దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు క్రయ విక్రయదారులను భయపెట్టి మరీ అదనంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్ ఆగుతుందన్న భయంతో అడిగినంత ఇస్తున్నారన్న ప్రచారం ఉంది. ఒక్కో డాక్యుమెంట్ బయటకు రావాలంటే కొందరు ఏకంగా రూ.3000 వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అధికారుల అండతోనే దందా?
జిల్లాలో ఆయా మండలాల తహసీల్దార్లు, అధికారుల ఆండతోనే స్లాట్ బుకింగ్ ఏజెంట్ల దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్లాట్ బుకింగ్ ఏజెంట్ల ద్వారా వెళ్తేనే రిజిస్ట్రేషన్ సాఫీగా జరుగుతుందన్న ప్రచారం ఉంది. పాసు పుస్తకాల్లో తప్పిదాలు, సరైన పత్రాలు లేకపోవడం వంటి కారణాలను చూపుతూ చేసిన వసూళ్లలో అధికారులకు సైతం వాటాలు పోతున్నాయన్న ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. మీసేవా కేంద్రాల్లో అదనపు వసూళ్లపై అధికారుల పర్యవేక్షణ ఉండగా ప్రైవేటు స్లాట్ బుకింగ్ ఏజెంట్లపై పూర్తిగా లేదు. వీరిపై ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో వీరు ఆడిందే ఆటగా సాగిందన్న చర్చ జరుగుతోంది. జిల్లాలో భూ భారతి పోర్టల్ ద్వారా జరిగిన స్కామ్ బయటపడడంతో స్లాట్ బుకింగ్ కేంద్రాల్లో అధిక వసూళ్లపై కూడా దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. కాగా.. స్లాట్ బుకింగ్ కేంద్రాల్లో అధిక వసూళ్ల వ్యవహారంపై కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాను వివరణ కోరగా.. అధిక వసూళ్లు చేసినట్లు ఎవరైనా ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
Also Read:
పంచాయతీ ఎన్నికలు.. గెలిచిన వారికి కొత్త పరేషాన్..!
అదిగో చిరుత... ఇదిగో ఎలుగుబంటి..
అర్ష్‌దీప్ సింగ్‌ను ఇమిటేట్ చేసిన విరాట్.. ఫన్నీ వీడియో వైరల్!