Telangana: పంచాయతీ ఎన్నికలు.. గెలిచిన వారికి కొత్త పరేషాన్..!
ABN , Publish Date - Jan 10 , 2026 | 12:16 PM
గ్రామాల్లో కొత్త పంచాయతీల పాలకవర్గం కొలువుదీరింది. గత నెల డిసెంబరు 11, 14, 17 తేదీల్లో మూడు విడుతల్లో ఎన్నికలు జరిగాయి. ఎక్కడా ఏ చిన్న లోటుపాట్లు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి. గ్రామాల్లో ఎన్నికైన నూతన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఇప్పటికే పదవీ ప్రమాణ స్వీకారం..
పంచాయతీ ఎన్నికల ఖర్చు సమర్పణలో అభ్యర్థుల సతమతం
నిబంధనలకు మించి ఖర్చు చేసిన సర్పంచ్, వార్డు సభ్యులు
మూడు విడతల్లో గెలుపొందిన వారికి 45 రోజుల గడువు
సరైన లెక్కలు సమర్పించకపోతే పదవికి గండం..
హైదరాబాద్, జనవరి 10: గ్రామాల్లో కొత్త పంచాయతీల పాలకవర్గం కొలువుదీరింది. గత నెల డిసెంబరు 11, 14, 17 తేదీల్లో మూడు విడుతల్లో ఎన్నికలు జరిగాయి. ఎక్కడా ఏ చిన్న లోటుపాట్లు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి. గ్రామాల్లో ఎన్నికైన నూతన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఇప్పటికే పదవీ ప్రమాణ స్వీకారం చేసి పాలన సాగిస్తున్నారు. ఆయితే, ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన అభ్యర్థులు ఎంత ఖర్చు చేశారో వివరాలు తెలపాలంటూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు జరిగిన రోజు నుంచి 45 రోజుల్లో లెక్కల వివరాలు సమగ్రంగా ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో గెలుపొందిన సర్పంచ్, వార్డు సభ్యులు సతమతమవుతున్నారు. వివరాలు ఎలా ఇవ్వాలోననే ఆందోళనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. లెక్కకు మించి ఖర్చు చేసిన అభ్యర్థులు ఏమివ్వాలో.. ఎలా ఇవ్వాలో అని తలలు పట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.
అసలు ఖర్చు ఎంతంటే..
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కొంత మేరకే ఖర్చు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. 5వేలకు పైబడిన జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.2.50లక్షలు, వార్డు సభ్యులు రూ.50వేలు, 5వేల లోపు జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.1.50 లక్షలు, వార్డు సభ్యులు రూ.30వేలు మాత్రమే ఖర్చు చేయాలనే నిబంధన ఉంది. కానీ, ఈ నిబంధన ఏ పంచాయతీలో అమలైన పరిస్థితి లేదనే చర్చ జరుగుతోంది. మేజర్ గ్రామ పంచాయతీల్లో పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థులు రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు సైతం ఖర్చు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక వార్డు సభ్యులు సుమారు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల మేర ఖర్చు చేశారనే విమర్శలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఖర్చుల వివరాలు నిబంధనల ప్రకారం ఎలా సర్దాలా అని పోటీలో గెలిచిన సర్పంచ్, వార్డు సభ్యులు ఆలోచనలో పడ్డట్లుగా తెలుస్తోంది. నిబంధనల ప్రకారం కాకి లెక్కలు సమర్పించి మమ అనిపించాలనే ప్రయత్నంలో కొత్త పాలకవర్గం ఆలోచన చేస్తున్నట్లు తీవ్ర చర్చ జరుగుతోంది.
సమీపిస్తున్న గడువు..
ఎన్నికల్లో ఖర్చు చేసిన వివరాలు సమర్పించేందుకు గడువు సమీపిస్తోంది. రాష్ట్రంలో మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో.. భాగంగా కేవలం 45 రోజుల గడువును ఎన్నికల సంఘం విధించింది. ఈ గడువు లోపే వివరాలు ఆయా ఎంపీడీవో కార్యాలయాల్లో అందించాలి. తొలి విడతలో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్, వార్డు సభ్యులు జనవరి 24వ తేదీ లోపు, రెండో విడతలో గెలుపొందిన వారు 27వ తేదీ లోపు, 3వ విడతలో గెలుపొందిన సర్పంచ్, వార్డు సభ్యులు జనవరి 30వ తేదీలోగా వివరాలు అందించాలని ఎన్నికల సంఘం జిల్లాల ఎన్నికల అధికారితో పాటు ఆయా మండలాల ఎంపీడీవోలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయా మండలాల ఎంపీడీవోలు గెలుపొందిన సర్పంచ్, వార్డు సభ్యులకు నోటీసులు పంపినట్లు తెలిసింది. మొత్తంగా గెలుపొందిన అభ్యర్థులు ఈ నెలాఖరులోగా వారి ఖర్చుల వివరాలు లెక్కలతో సహా సమర్పించాల్సి ఉంటుంది.
అలసత్వం వహిస్తే అనర్హత వేటే..
ఎన్నికల్లో పోటీ చేశాం.. గెలుపొందాం.. ఇంకేం అవుతదిలే అనుకుంటే పొరపాటే.. ప్రతీ ఒక్కరి వివరాల సేకరణను ఎన్నికల సంఘం పరిశీలిస్తుందని అధికారులు అంటున్నారు. అయితే, ఈ విషయంలో గెలుపొందిన అభ్యర్థులు అలసత్వం వహించి సకాలంలో వివరాలు సమర్పించకపోతే అనర్హత వేటు పడనున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఎన్నికల్లో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులు సైతం వారి ఖర్చుల వివరాలు సమర్పించాలి. లేదంటే వచ్చే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఉండదు. మూడేళ్ల పాటు వారంతా పోటీకి అనర్హులవుతారని అధికారులు వెల్లడించారు. కాగా, ఇప్పటికే గెలుపొందిన ఆయా గ్రామాల సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో పాటు ఓటమి చెందిన అభ్యర్థులకు సంబంధిత మండలాల ఎంపీడీవోల నుంచి నోటీసులు సైతం వెళ్లాయి.
Also Read:
అర్ష్‌దీప్ సింగ్‌ను ఇమిటేట్ చేసిన విరాట్.. ఫన్నీ వీడియో వైరల్!
వార్నీ.. హీటర్‌ను ఇలా కూడా వాడతారా.. ఈమె తెలివికి దండం పెట్టాల్సిందే..
ఇరాన్‌లో ఇంటర్నెట్, ఫోన్ కనెక్షన్లు కట్.. 200 మందికి పైగా మృతి..