Iran protests 2026: ఇరాన్‌లో ఇంటర్నెట్, ఫోన్ కనెక్షన్లు కట్.. 200 మందికి పైగా మృతి..
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:48 AM
అవినీతి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో ఇరాన్ ప్రభుత్వంపై ప్రజలు ప్రారంభించిన శాంతియుత నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు 200 మందికి పైగా మృతి చెందినట్టు ఇరాన్‌కు చెందిన ఓ డాక్టర్.. టైమ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ఆందోళనలు రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతున్నాయి. అవినీతి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడంతో ఇరాన్ ప్రభుత్వంపై ప్రజలు ప్రారంభించిన శాంతియుత నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఆందోళనల్లో ఇప్పటివరకు 200 మందికి పైగా మృతి చెందినట్టు ఇరాన్‌కు చెందిన ఓ డాక్టర్.. టైమ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు (Iran protests 2026).
ఒక్క టెహ్రాన్ నగరంలోనే 200 మంది చనిపోయారని, దేశ వ్యాప్తంగా సంభవించిన మరణాలు చాలా ఎక్కువగా ఉండొచ్చని ఆ డాక్టర్ పేర్కొన్నారు. ఉత్తర టెహ్రాన్‌లోని ఓ పోలీస్ స్టేషన్ వెలుపల నిరసనకారులపై భద్రతా దళాలు మెషిన్‌గన్‌లతో కాల్పులు జరిపాయని, ఆ కాల్పుల్లో 38 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఇరాన్ వ్యాప్తంగా ఇంటర్నెట్, ఫోన్ కనెక్షన్లను పూర్తిగా నిలిపేశారని, అందువల్ల పూర్తి సమాచారం బయటకు రావడం లేదని ఆ డాక్టర్ అభిప్రాయపడ్డారు (doctor reported 200 dead).
కాగా, ఆందోళనలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణమంటూ ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ ఆగ్రహం వ్యక్తం చేశారు (Iran internet blackout). అమెరికా అధ్యక్షుడిని సంతోషపరచడానికి ఇరాన్ ప్రజలు సొంత దేశాన్ని నాశనం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ట్రంప్ చేతులు ఇరాన్ రక్తంతో తడిచాయని విమర్శించారు. కాగా, ప్రవాసంలో తలదాచుకుంటున్న ఇరాన్ యువరాజు రెజా పహ్లావి డొనాల్డ్ ట్రంప్‌నకు ఓ విజ్ఞప్తి చేశారు. ఇరాన్ ఆందోళనల విషయంలో అమెరికా జోక్యం చేసుకుని ప్రభుత్వం చేస్తున్న దాడులను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
విమానాలు ఎక్కువగా తెలుపు రంగులోనే ఉంటాయేంటి.. ఆసక్తికర కారణాలు తెలిస్తే..
నేను ఉన్నంత కాలం చైనా ఆ పని చేస్తుందనుకోను: డొనాల్డ్ ట్రంప్