Share News

కాంగ్రెస్ ‘మొహబ్బత్ కీ దుకాణ్’ అసలు రంగు ఇదే: టి. బీజేపీ చీఫ్

ABN , Publish Date - Aug 08 , 2026 | 07:24 PM

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు సంచలన ఆరోపణలు చేశారు. రాహుల్ గాంధీ ఢిల్లీలో 'మొహబ్బత్ కీ దుకాణ్' అని గొప్పలు చెప్తూ, రాష్ట్రంలో మాత్రం ఉపాధి కోరిన యువతపై లాఠీలు ఝళిపిస్తున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ ‘మొహబ్బత్ కీ దుకాణ్’ అసలు రంగు ఇదే: టి. బీజేపీ చీఫ్
Ramchander Rao

హైదరాబాద్, ఆగస్టు 08: సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వద్ద ఉద్యోగాల కోసం వచ్చిన నిరుద్యోగ యువతపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం తీవ్ర బాధాకరమని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేత ధోరణిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాహుల్ గాంధీ ఢిల్లీలో 'మొహబ్బత్ కీ దుకాణ్' అని గొప్పలు చెప్తూ, తెలంగాణలో మాత్రం ఉపాధి కోరిన యువతపై లాఠీలు ఝళిపిస్తున్నారని విమర్శించారు.


హైడ్రా (HYDRAA)లో కేవలం 150 ఖాళీల కోసం వేలాది మంది యువత తరలిరావడం రాష్ట్రంలో నెలకొన్న నిరుద్యోగ తీవ్రతకు, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి సాక్ష్యమని రామచందర్ రావు అన్నారు. అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్, నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి, స్వయం ఉపాధికి రూ.10 లక్షల వడ్డీ లేని రుణాలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పిందని గుర్తు చేశారు. అయితే రెండేళ్లు గడిచినా ఒక్క హామీనీ నెరవేర్చలేదని ఆయన మండిపడ్డారు.


హామీలను నమ్మి ఓటేసిన యువతను రోడ్లపాలేసి, కనీసం ఆశతో వచ్చిన వారిపై పోలీసులతో దౌర్జన్యం చేయించడం అన్యాయమని రామచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ యువత ఆకాంక్షలపై అధికారంలోకి వచ్చారో, అదే యువత భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం అంధకారంలోకి నెట్టివేసిందని ఆరోపించారు. ఉద్యోగాల కోసం వచ్చిన అభ్యర్థులపై పోలీసుల ప్రయోగంపై కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు, యువతకు సమాధానం చెప్పాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి:

'ది హండ్రెడ్' టోర్నీ నుంచి జెమీమా ఔట్!

టీమిండియాకు మరో ఎదురు దెబ్బ.. కీలక ప్లేయర్ ఔట్!

Updated Date - Aug 08 , 2026 | 07:28 PM