Share News

Telangana Assembly: ఎస్‌జీహెచ్ సభ్యురాలుగా ప్రతీ మహిళ.. ఇదే మా సంకల్పం: మంత్రి సీతక్క

ABN , Publish Date - Jan 05 , 2026 | 10:36 AM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగవ రోజుకు చేరుకున్నాయి. ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటుపై సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సీతక్క సమాధానం ఇచ్చారు.

Telangana Assembly: ఎస్‌జీహెచ్ సభ్యురాలుగా ప్రతీ మహిళ.. ఇదే మా సంకల్పం: మంత్రి సీతక్క
Telangana Assembly

హైదరాబాద్, జనవరి 5: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly) నాలుగవ రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ఏర్పాటుపై సభ్యులు ప్రశ్న లేవనెత్తగా.. మంత్రి సీతక్క (Minister Seethakka) సమాధానం ఇచ్చారు. మహిళా సాధికారతకు సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని స్పష్టం చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించామని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేస్తున్నామన్నారు.


ప్రతి మహిళ ఎస్‌జీహెచ్‌ సభ్యురాలుగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని వెల్లడించారు. 15 సంవత్సరాలు దాటిన బాలికల నుంచి పండు ముదుసలి వరకు మహిళా సంఘం సభ్యులుగా చేర్చుతున్నామని తెలిపారు. కిశోర బాలికలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక మహిళా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.


మరోవైపు ఈరోజు శాసనసభలో పలు కీలక గెజిట్ నోటిఫికేషన్లను ప్రభుత్వం సభ ముందు పెట్టనుంది. తెలంగాణ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ పెండింగ్ వార్షిక నివేదికలను శాసన సభ్యులకు సర్కార్ అందించనుంది. అలాగే ఈరోజు రెండు బిల్లులపై చర్చించి శాసనసభ ఆమోదించనుంది.


సభలో చర్చించే బిల్లులు ఇవే..

  • తెలంగాణ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు

  • GST సవరణ బిల్లు

అనంతరం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ (HILT) పాలసీపై సభలో లఘు చర్చ జరుగనుంది.


కాగా.. ఈరోజు కూడా బీఆర్‌ఎస్ సభకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. శాసనసభ, శాసనమండలి సమావేశాలకు హాజరుకావొద్దని బీఆర్‌ఎస్ నిర్ణయం తీసుకుంది. సభలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వటంలేదని.. అందుకు నిరసనగా బీఆర్‌ఎస్ అసెంబ్లీని బహిష్కరించిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి...

ప్రపంచ తెలుగు మహాసభలకు సీఎం చంద్రబాబు

ఫోన్ ట్యాపింగ్ కేసు.. నేడు సుప్రీంలో విచారణ.. తీవ్ర ఉత్కంఠ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 05 , 2026 | 11:27 AM