అయినా.. రిజిస్ట్రేషన్లకు నో!
ABN , Publish Date - Sep 30 , 2026 | 05:42 AM
పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూ ఎల్‌సీ) దరఖాస్తుల పరిష్కారం.. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా మారింది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న యూఎల్‌సీ దరఖాస్తులకు మోక్షం చూపుతామని ప్రభుత్వం ప్రకటించినా, ఇందుకు సంబంధించి రెవెన్యూ శాఖ మెమో కూడా జారీ చేసినా..
యూఎల్‌సీ, 22ఏ ఆస్తులపై అధికారుల స్పష్టీకరణ
ఆదేశాలు అందలేదంటున్న సబ్ రిజిస్ట్రార్లు
రిజిస్ట్రేషన్ చేసినా డాక్యుమెంట్లు
ఇవ్వమన్న ఎల్‌బీనగర్ ఎస్‌ఆర్‌వో
మంత్రి చెప్పినా తమ నిబంధనలు
మారవన్న రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్
హైదరాబాద్, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూ ఎల్‌సీ) దరఖాస్తుల పరిష్కారం.. దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించని చందంగా మారింది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న యూఎల్‌సీ దరఖాస్తులకు మోక్షం చూపుతామని ప్రభుత్వం ప్రకటించినా, ఇందుకు సంబంధించి రెవెన్యూ శాఖ మెమో కూడా జారీ చేసినా.. అధికారులు మాత్రం రిజిస్ట్రేషన్లకు అనుమతించడంలేదు. అంతేకాదు.. 22ఏ జాబితాలోని ఆస్తుల విషయంలోనూ ఇలాగే వ్యవహరిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, మునిసిపల్ అనుమతులు ఉన్న ఇళ్లు, ప్లాట్ల రిజిస్ట్రేషన్లను అనుమతించాలని ఈ నెల 24న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆదేశాలను రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని బాధితులు వాపోతున్నారు.
‘‘ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. మీ ఆస్తి ఇంకా 22ఏ లోనే ఉంది. కలెక్టర్ నుంచి ఎన్‌వోసీ తెచ్చుకోండి. లేదా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఇప్పించండి’’ అంటూ తమ దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో గత రెండు రోజులుగా ఈ తరహా కేసులు ఎక్కువగా వస్తున్నాయి. మంగళవారం ఓ బాధితుడు ఎల్‌బీనగర్ సబ్ రిజిస్ట్రార్‌ను కలిసి.. తాను విక్రయానికి పెట్టిన 132 గజాల ప్లాట్ రిజిస్ట్రేషన్‌కు అనుమతించాలని కోరారు. అయితే సర్వే నంబరు 39లో ఉన్న ఈ భూమి యూఎల్‌సీలో ఉందంటూ రిజిస్ట్రేషన్‌కు నిరాకరించారని ఆయన వాపోయారు. యూఎల్‌సీ భూముల రిజిస్ట్రేషన్లు ఆపొద్దంటూ 2026 జూన్ 8న (డబ్ల్యూపీ నంబరు 7213/2008) హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను చూపించినా.. ససేమిరా అన్నారని తెలిపారు.
ఉత్తర్వులు రాలేదంటూ..
గతంలో లావాదేవీలు జరిగినా, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అనుమతులు ఉన్నా రిజిస్ట్రేషన్‌కు అనుమతించాలంటూ ప్రభుత్వం ఇటీవల స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేసినా అధికారులు అనుమతించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఉత్తర్వులు (మంగళవారం నాటికి) రాలేదని అధికారులు చెబుతున్నారని వాపోతున్నారు. ఒకవేళ ఉత్తర్వులు వచ్చినా రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తాం తప్ప.. డాక్యుమెంట్లు ఇవ్వవద్దని జిల్లా రిజిస్ట్రార్ నుంచి తమకు ఆదేశాలు ఉన్నాయని చెబుతున్నట్లు పేర్కొంటున్నారు. ఈ నెల 24న ప్రభుత్వం ఇచ్చిన మెమో ప్రకారం రిజిస్ట్రేషన్‌కు అనుమతించాలని కోరినా.. అధికారులు తిరస్కరిస్తున్నారని చెప్పారు.ఇదే తరహా కేసులో సోమవారం కూకట్‌పల్లికి చెందిన ఓ మహిళ.. రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో వాగ్వాదానికి దిగడం చర్చనీయాంశమైంది.
యూఎల్‌సీ ప్రొసీడింగ్స్ జారీకి సిద్ధం!
యూఎల్‌సీ కింద గతంలో ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి క్రమబద్ధీకరణ చార్జీలు చెల్లించిన చాలా మందికి నేటికీ ప్రొసీడింగ్ ఉత్తర్వులు ఇవ్వలేదు. తాజాగా ప్రభుత్వం.. గత జీవోల ఆధారంగా యూ ఎల్‌సీ కేసుల పరిష్కారానికిగాను పెండింగ్ దరఖాస్తుల క్రమబద్ధీకరణకు ఆదేశాలిచ్చింది. దీంతో గతంలో ఫీజు చెల్లించిన వారికి ప్రస్తుతం ప్రొసీడింగ్స్ జారీ చేసేందుకు రెవెన్యూ శాఖ సిద్ధమైంది.
తాజా మెమో 22ఏ(1)(బి)కు మాత్రమే!
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంగళవారం ఇచ్చిన మెమో (జి3/140/2026) కేవలం 22ఏ(1)(బి) కేటగిరిలో ఉన్న ప్రభుత్వ భూములకు మాత్రమే వర్తిస్తుంది. ఇందులో యూఎల్‌సీ భూముల ప్రస్తావన లేదు. ఈ నేపథ్యంలో సీలింగ్ భూముల వివాదాలపై దరఖాస్తు చేసుకున్న వేల మంది బాధితులు యూఎల్‌సీపై రిజిస్ట్రేషన్ల శాఖ ఇచ్చే మెమో కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఈ నెల 27న యూఎల్‌సీ సమస్య పరిష్కారానికి రెవెన్యూ శాఖ ఇచ్చిన మెమో (48062/యూఎల్‌సీ/ఏ1/2026-1) ఆధారంగా రిజిస్ట్రేషన్లను అనుమతించేందుకు సబ్ రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్లు ఒప్పుకోవడం లేదని బాధితులు చెబుతున్నారు.
ఆదేశాలిచ్చాం.. అమలు చేయాల్సిందే
రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ(1)(బి)కి సంబంధించి అన్ని జిల్లాల రిజిస్ట్రార్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. వాటిని ప్రతి అధికారీ అమలు చేయాల్సిందే. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తిరస్కరించి, రిజిస్ట్రేషన్‌కు అనుమతించకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ అనుమతి ఉన్న లేఅవుట్లలోని ప్లాట్లు, ఇళ్ల రిజిస్ట్రేషన్ల విషయంలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చాం. జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లు వీటిని అమలు చేయాలి. కోర్టు వివాదాలున్న భూములు తప్ప.. మిగిలిన విషయాల్లో చట్టపరంగా ప్రభుత్వ ఆదేశాలకు లోబడి నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్లకు అనుమతించాలని చెప్పాం.
- రాజీవ్‌గాంధీ హనుమంతు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ
ఇవి కూడా చదవండి..
సైబర్ వల.. చిక్కితే విలవిల!
వంద అడుగుల అప్రోచ్ రోడ్డు నిబంధనకు చెక్!
Read Latest Telangana News And Telugu News