Share News

వంద అడుగుల అప్రోచ్‌ రోడ్డు నిబంధనకు చెక్‌!

ABN , Publish Date - Sep 30 , 2026 | 05:35 AM

ఎకరం లేఅవుట్‌ అయినా సరే.. వంద అడుగుల అప్రోచ్‌ రోడ్డు ఉండాలనే నిబంధనకు త్వరలో తెర పడనుంది. భవన నిర్మాణం, లేఅవుట్‌ అనుమతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న యూనిఫైడ్‌ డెవల్‌పమెంట్‌ బిల్డింగ్‌ కోడ్‌ (యూడీబీసీ)లో ‘వంద అడుగుల అప్రోచ్‌ రోడ్డు’ నిబంధనను తొలగిస్తున్నారు.

వంద అడుగుల అప్రోచ్‌ రోడ్డు నిబంధనకు చెక్‌!
Telangana layout rules

  • 30 ఫీట్ల అప్రోచ్‌ రోడ్డుకు ఓకే

  • సరికొత్త బిల్డింగ్‌ కోడ్‌లో సవరణ..

  • గత ప్రభుత్వ హయాంలో 100 అడుగుల నిబంధన..

  • చిన్న రియల్టర్లకు శరాఘాతం

  • ‘ఆంధ్రజ్యోతి కథనం’తో స్పందన

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఎకరం లేఅవుట్‌ అయినా సరే.. వంద అడుగుల అప్రోచ్‌ రోడ్డు ఉండాలనే నిబంధనకు త్వరలో తెర పడనుంది. భవన నిర్మాణం, లేఅవుట్‌ అనుమతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న యూనిఫైడ్‌ డెవల్‌పమెంట్‌ బిల్డింగ్‌ కోడ్‌ (యూడీబీసీ)లో ‘వంద అడుగుల అప్రోచ్‌ రోడ్డు’ నిబంధనను తొలగిస్తున్నారు. చిన్నస్థాయి స్థిరాస్తి వ్యాపారులకు తీవ్ర నిరాశ కలిగించేలా.. బడా సంస్థలు మాత్రమే లేఅవుట్లు వేసేలా 2020 జూన్‌లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన వంద అడుగుల అప్రోచ్‌ రోడ్డు నిబంధన.. స్థిరాస్తి రంగానికి శరాఘాతంగా మారింది.


దీనిపై ‘అభివృద్ధికి అడ్డంకులు.. 100 అడుగులు’ అనే శీర్షికతో శనివారం ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. గతంలో మాదిరిగా 30అడుగుల అప్రోచ్‌ రోడ్డు ఉంటే లేఅవుట్లకు అనుమతులు జారీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో గత ఆరేళ్లుగా రియల్‌ ఏస్టేట్‌ రంగంపై కత్తిలా వేలాడుతున్న వంద అడుగుల అప్రోచ్‌ రోడ్డు నిబంధన తొలగిపోనుంది. తద్వారా పెరి అర్బన్‌ రీజియన్‌ (ప్యూర్‌) పరిధిలో రియల్‌ ఎస్టేట్‌ ఊపందుకునే అవకాశాలున్నాయి. 2020 జూలై ఆరో తేదీన అప్పటి ప్రభుత్వం జీఓ నెంబర్‌ 106 తీసుకొచ్చింది.


హెచ్‌ఎండీఏ పరిధిలో ఒక ఎకరం నుంచి ఎన్ని ఎకరాల వరకైనా వేసే లేఅవుట్‌లో అప్రోచ్‌ రోడ్డు 100అడుగులు ఉండాలని నిబంధన విధించారు. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకొచ్చిన జీఓ నెంబర్‌ 33 ప్రకారం హెచ్‌ఎండీఏ పరిధిలోని లేఅవుట్లకు 30ఫీట్ల అప్రోచ్‌ రోడ్డు ఉండాలనే నిబంధనను నాటి నుంచి తొలగించారు. ఈ జీఓ 106 విడుదల చేసిన సందర్భంలోనే ‘వంద అడుగుల దందా’ అనే శీర్షికతో ఆంధ్రజ్యోతి కథనాలను ప్రచురించింది. ఆరేళ్లుగా హెచ్‌ఎండీఏ పరిధిలో లేఅవుట్‌ అనుమతుల ప్రక్రియ ఈ జీఓ 106 ప్రకారంగానే కొనసాగుతోంది. ఈ నిబంధన వచ్చిన తర్వాత ప్యూర్‌ ప్రాంతంలోని మండలాల్లో లేఅవుట్లు వేసే చిన్నస్థాయి రియల్టర్లు వ్యాపారం చేయలేని పరిస్థితి వచ్చింది.


ఆరేళ్లుగా ప్యూర్‌ ప్రాంతంలో రాని లేఅవుట్లు

జీఓ 106 వచ్చిన తర్వాత అప్రోచ్‌ రోడ్డు వంద అడుగులు లేకుంటే విధించే పెనాల్టీలు కూడా భారంగా మారాయి. పది ఎకరాల్లోపు లేఅవుట్లు చేసే డెవలపర్లు, గ్రామాలు, మండల కేంద్రాల్లో ఉన్న రియల్టర్లు లేఅవుట్లు వేసే పరిస్థితి లేక.. భూముల అమ్మకాల్లో దళారులుగా మారారు. ఎకరం,రెండెకరాలు ఉన్నవారు అనుమతులను పొందలేక గుంటలుగా స్థలాలను విభజించి విక్రయిస్తున్నారు.


ఊపందుకోనున్న గ్రామీణ, పట్టణ రియల్‌ ఎస్టేట్‌!

ఈ నేపథ్యంలో 100 అడుగుల అప్రోచ్‌ రోడ్డు నిబంధనపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసింది. భవన నిర్మాణ, లేఅవుట్‌ అనుమతులకు సంబంధించి తీసుకురానున్న యూనిఫైడ్‌ డెవల్‌పమెంట్‌ బిల్డింగ్‌ కోడ్‌ (యూడీబీసీ)లో వంద అడుగుల అప్రోచ్‌ రోడ్డు నిబంధనను తొలగించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఎర్నెస్ట్‌ యంగ్‌ అనే కన్సల్టెన్సీ సంస్థ రూపొందించిన యూడీబీసీ ముసాయిదాలో.. ఈ వంద అడుగులు అప్రోచ్‌ రోడ్డు నిబంధన ఉందని, దానిని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థకు స్పష్టం చేసినట్లు సమాచారం.


హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ ఆహ్మద్‌ నేతృత్వంలోని ప్లానింగ్‌ అధికారుల బృందం వంద అడుగుల అప్రోచ్‌ రోడ్డు నిబంధనను తొలగించేలా చర్యలు తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎకరం నుంచి ఎన్ని ఎకరాల లేఅవుట్‌కు అయినా ఇకపై 30అడుగుల అప్రోచ్‌ రోడ్డు ఉంటే సరిపోతుందని సవరణలు తీసుకొచ్చిన్నట్లు పేర్కొన్నాయి. ఈ యూడీబీసీని త్వరలోనే అమలులోకి తీసుకొచ్చేందుకు హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు కసరత్తు జరుపుతున్నారు. దీనిపై ఓ అధికారి మాట్లాడుతూ.. క్యూర్‌ పరిధిలో లేఅవుట్లు కొత్తగా వేసేందుకు భూములు చాలా తక్కువగా ఉన్నాయని, ప్యూర్‌ పరిధిలోనే పెద్దఎత్తున భూములున్నాయని, అప్రోచ్‌ రోడ్డు నిబంధన సవరణతో చిన్న రియల్టర్లు పెద్ద సంఖ్యలో ముందుకొచ్చి లేఅవుట్లు వేసే అవకాశం ఉందన్నారు.


ఇవి కూడా చదవండి..
సైబర్‌ వల.. చిక్కితే విలవిల!

ధరణి ముసుగులో రికార్డులు తారుమారు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 30 , 2026 | 05:35 AM