పీఆర్సీని వెంటనే అమలు చేయాలి
ABN , Publish Date - Nov 15 , 2026 | 06:01 AM
ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణను వెంటనే చేపట్టాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారంలో
5 పనిదినాలు అమలుచేయాలి
ఏటా బదిలీలు చేపట్టాలి.. పెండింగ్
బకాయిలు నెలకు రూ.2 వేల కోట్లివ్వాలి
రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ గెజిటెడ్
అధికారుల సంఘం విజ్ఞప్తి
హైదరాబాద్, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణను వెంటనే చేపట్టాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రెండో వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) నివేదికను తక్షణం తెప్పించుకుని 42 శాతం ఫిట్మెంట్‌ను అమలు చేయాలని టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివా్‌సరావు, ప్రధాన కార్యదర్శి శ్యామ్ డిమాండ్ చేశారు. టీజీవో 33 జిల్లాల ప్రతినిధులతో నాంపల్లిలోని టీజీవో భవన్‌లో శనివారం వీరు సమావేశమై పీఆర్సీ, ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. పలు తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపారు. ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 5 రోజుల పని దినాల అమలు చేయాలని కోరారు.
ప్రస్తుతం ప్రతినెలా చెల్లిస్తున్న రూ.1,000 కోట్ల పెండింగ్ బకాయిలను రూ.2,000 కోట్లకు పెంచాలని డిమాండ్ చేశారు. అధికారులు విధి నిర్వహణ కోసం వాడుతున్న ప్రైవేట్ అద్దె వాహనాల నెలవారీ చార్జీలను కనీసం రూ.60 వేలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. శాఖల్లోని అన్ని విభాగాల్లో డీపీసీలను ఏర్పాటుచేసి వేగంగా పదోన్నతులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగులకు ప్రతి సంవత్సరం మే నెలలో సాధారణ బదిలీలు విధిగా చేయాలని విన్నవించారు. ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో ఉన్న శాశ్వత ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వ గుర్తింపును వెంటనే పునరుద్ధరించాలని కోరారు.
ఉద్యోగ సంఘాల ముఖ్య కార్యవర్గ సభ్యులకు (అధ్యక్షులు, కార్యదర్శులు, సహాధ్యక్షులు, కోశాధికారులు) సాధారణ బదిలీల నుంచి మినహాయింపు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని, ఉద్యోగ సంఘాల జిల్లాల ముఖ్య కార్యవర్గ సభ్యులకు 21 రోజుల ప్రత్యేక సాధారణ సెలవులను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. టీజీవో జిల్లా ఆఫీసు భవనాల నిర్మాణం కోసం అన్ని జిల్లాల్లో ప్రభుత్వం భూమిని కేటాయించాలని, గెజిటెడ్ అధికారుల హౌసింగ్ సొసైటీలకు ఇళ్ల స్థలాల కోసం కూడా అన్ని జిల్లాల్లో భూమి కేటాయించాలని కోరుతూ తీర్మానాలు ఆమోదించారు. సమావేశంలో టీజీవో కేంద్ర సంఘ కార్యవర్గం, 76 విభాగాల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
రెవెన్యూ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలి
రెవెన్యూ శాఖలోని అన్నిస్థాయిల ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైౖర్మన్ వీ లచ్చిరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఖాళీగా ఉన్న 25 అదనపు కలెక్టర్ల పోస్టులను డిప్యూటీ కలెక్టర్లతో భర్తీచేయాలని డిమాండ్ చేశారు. లచ్చిరెడ్డి నేతృత్వంలో తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ (టీజీటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రాములు, తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ (టీజీఆర్‌ఎ్‌సఏ) నేతలు బాణాల రాంరెడ్డి, వీ భిక్షం, తెలంగాణ గ్రామ పాలన అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేంద్రరావులు శనివారం భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) లోకే్‌షకుమార్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందచేశారు.
17న సామూహిక సెలవులు
సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రకటన
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో అత్యధికంగా ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులు పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ కోసం మరోసారి ఉద్యమానికి సిద్ధం కావాలని తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జీ స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ శనివారం పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని మొత్తం 3.6 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో 2.6 లక్షల నుంచి 2.80 లక్షల మంది సీపీఎస్ విధానంలో ఉన్నారని.. వారంతా గత 22 ఏళ్లుగా పెన్షన్ భద్రత లేక తీవ్ర ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారని ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసి ఈ నెల 17వ తేదీకి మూడేళ్లు పూర్తవుతున్నందున.. ఆరోజు ఉద్యోగులంతా సామూహిక సెలవులు పెట్టాలని పిలుపునిచ్చారు. అన్ని జిల్లా కేంద్రాల్లో శాంతియుతంగా సత్యాగ్రహ దీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ధరణి అక్రమాలపై సీఐడీ దర్యాప్తు వేగవంతం
వికారాబాద్‌లో మహిళా క్రికెటర్ మృతి!
Read Latest AP News And Telangana News And International News And Telugu News