ఎస్సీ, ఎస్టీల కేటాయింపులు ఖర్చు చేయకపోతే ఎలా?
ABN , Publish Date - Nov 28 , 2026 | 05:36 AM
ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధులు సరిగా ఖర్చు చేయక పోవడంపై రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్షణ్ కుమార్ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
అధికారులను నిలదీసిన మంత్రి అడ్లూరి
హైదరాబాద్, నవంబరు 27, (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధులు సరిగా ఖర్చు చేయక పోవడంపై రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్షణ్ కుమార్ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్లో కేటాయించిన నిధులను కూడా ఖర్చు చేయకపోతే ఎలా? అని అధికారులను నిలదీశారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ విషయంలో తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, సంక్షేమం కోసం బడ్జెట్లో కేటాయించిన ప్రతి రూపాయీ అర్హులకు చేరాలన్నారు.
సాధారణ పథకాల కోసం చేసే ఖర్చులను ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ఉప ప్రణాళిక కింద చేసిన ఖర్చులతో కలిపి చూడరాదని కూడా ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్థి, పారిశ్రామిక రంగాల్లో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. వినియోగించని నిధులు, పెండింగ్ బిల్లులు, పథకాల అమలులో ఉన్న అడ్డంకులను గుర్తించి, తక్షణం పరిష్కార చర్యలు చేపట్టాలన్నారు.
ఎస్సీ, ఎస్టీ కుటుంబాల ఆరోగ్యశ్రీ వైద్య సేవల బిల్లుల పెండింగ్ అంశాన్ని ఈ సమీక్షా సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. 2025, 2026 సంవత్సరాలకు సుమారు రూ.242 కోట్ల మేర బిల్లులు పెండింగ్లో ఉన్నట్టు అధికారులు వివరించారు. ఈ బకాయిల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ, అర్హులైన రోగులకు వైద్య సేవల్లో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన 39 కేంద్రీకృత వంటశాలల ఏర్పాటు వచ్చే నెలాఖరుకు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అడ్లూరి అధికారులను ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్