గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు ఎస్టీ కమిషన్ ప్రాధాన్యం ఇవ్వాలి: కవిత
ABN , Publish Date - Nov 06 , 2026 | 06:02 PM
తెలంగాణలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఎస్టీలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని తమ పార్టీ డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
హైదరాబాద్: తెలంగాణలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తమ పార్టీ డిమాండ్‌కు తలొగ్గే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. టీఆర్ఎస్ కారణంగానే ఆదివాసీలు, గిరిజనుల ఆకాంక్షలను గౌరవిస్తూ తెలంగాణ కేబినెట్ ప్రత్యేకంగా ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని చెప్పుకొచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఎస్సీ, ఎస్టీ కమిషన్లను కలిపి ఏర్పాటు చేయడంతో ఆ కమిషన్ అటు ఎస్సీలకు, ఇటు ఎస్టీలకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయిందని కవిత అభిప్రాయపడ్డారు. సమాజంలో ఎస్సీలు, ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలు వేర్వేరుగా ఉన్నాయన్నారు. ఇప్పటికీ ఎస్సీలు పీడన, అణచివేత, దౌర్జన్యాలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, ఆదివాసీలను రకరకాల పేర్లతో అడవుల నుంచి దూరం చేసే కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. జల్-జంగల్-జమీన్‌పై గిరిజనులు హక్కులు కోల్పోయే ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని కవిత పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏర్పాటు కానున్న ఎస్టీ కమిషన్ గిరిజనుల ఆకాంక్షలకు ప్రతీకగా నిలవాలని, వారి ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించేలా పనిచేయాలని కవిత సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం..
కాగా, రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలు, హక్కులను కాపాడేందుకు వారికి వేర్వేరు కమిషన్లు అవసరమని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. ఈ మేరకు నవంబర్ 5న జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ‘తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చట్టం-2003’ను రద్దు చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దాని స్థానంలో ‘తెలంగాణ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చట్టం-2026’, ‘తెలంగాణ షెడ్యూల్డ్ తెగల కమిషన్ చట్టం-2026’లను తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ముసాయిదా ఆర్డినెన్సుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. జాతీయ స్థాయిలో ఆర్టికల్ 338, 338ఏ కింద జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్టీ కమిషన్లను వేర్వేరుగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా రాష్ట్రంలోనూ ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
గోదావరి పుష్కరాల పనుల నాణ్యతలో రాజీపడొద్దు.. అధికారులకు మంత్రి అడ్లూరి ఆదేశాలు
ఓటర్ల జాబితాలో పేరు లేదా?.. గుడ్ న్యూస్ చెప్పిన ఎన్నికల సంఘం..