Share News

కమ్మని సద్దులు హద్దే లేని ఆటపాటలు

ABN , Publish Date - Oct 19 , 2026 | 04:49 AM

సూర్యుడు పడమట వాలుతుండగా ఆ నారింజ రంగుతో కూడిన చల్లని హాయి అయిన మలిసంధ్యకు మరింత అందాన్ని తెచ్చేలా.. తీరొక్క రంగులతో బతుకమ్మలు ఇళ్లలోంచి వీధుల్లోకొచ్చి ఓ చోట చక్కగా అలికి పరిచిన ముగ్గులపై కొలువుతీరాయి.

కమ్మని సద్దులు హద్దే లేని ఆటపాటలు
Saddula Bathukamma 2026

  • రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ సంబురాలు

  • ట్యాంక్‌బండ్‌పై 700 మంది కళాకారుల ప్రదర్శనల నడుమ హోరెత్తిన ఉత్సవం

  • బతుకమ్మ ఆడిన గవర్నర్‌ సతీమణి జానకి, మంత్రి సీతక్క, సినీనటులు రష్మిక, విజయ్‌

  • బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనాలని పెళ్లప్పుడే ర ష్మికకు చెప్పా.. తీసుకొచ్చా: విజయ్‌

  • నేను తెలంగాణ కోడలిని.. అందుకే బతుకమ్మ ఆడేందుకు వచ్చా: రష్మిక

  • కులమతాలకు అతీతంగా ప్రజలను ఒకచోటకు చేర్చే పండుగ: మంత్రి జూపల్లి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

సూర్యుడు పడమట వాలుతుండగా ఆ నారింజ రంగుతో కూడిన చల్లని హాయి అయిన మలిసంధ్యకు మరింత అందాన్ని తెచ్చేలా.. తీరొక్క రంగులతో బతుకమ్మలు ఇళ్లలోంచి వీధుల్లోకొచ్చి ఓ చోట చక్కగా అలికి పరిచిన ముగ్గులపై కొలువుతీరాయి. వాటి చుట్టూ పట్టు పరికిణీలు, పట్టు చీరల్లో నగల ధగధగలు, గాజుల గలగలతో యువతులు, మహిళలు చేరి ఆడిపాడారు. ఉయ్యాలో ఉయ్యాల అంటూ వారు అందుకున్న పాటలకు, కోలాటాల సందడికి, డీజేల మోతకు వీధులు హోరెత్తిపోయాయి. చీకట్లు కమ్ముకుంటుండగా మహిళలంతా బతుకమ్మలను చెరువుల్లో నిమజ్జనం చేసి.. ఒడ్డున కూర్చుని సద్దులు తిని.. పాటలు పాడుకుంటూ ఇళ్లకు కదిలారు.


ఆదివారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా పల్లె, పట్నం అన్న తేడా లేకుండా ఇలా సంప్రదాయరీతిలో సద్దుల బతుకమ్మ సంబురాలు కన్నుల పండుగగా జరిగాయి! ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై పెద్ద బతుకమ్మ వేడుకలు వైభవోపేతంగా జరిగాయి. విద్యుద్దీపాల అలంకరణల నడుమ పోతురాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యకారులు సహా 700 మంది కళాకారుల ప్రదర్శనలు, హుస్సేన్‌ సాగర్‌ అలలపై లేజర్‌ షో, తారాజువ్వలు దూసుకెళ్లడాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. వేడుకలకు గవర్నర్‌ శివప్రసాద్‌ శుక్లా, ఆయన సతీమణి జానకీ శుక్లా, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి, మరోమంత్రి సీతక్క, ప్రముఖ సినీనటులు, కొత్త దంపతులు అయిన విజయ దేవరకొండ, రష్మిక, సినీ గీత రచయిత సుద్దాల అశోక్‌ తేజ తదితరులు వేడుకకు హాజరయ్యారు. ఎల్‌నినో కారణంగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన సూచనలను ప్రజలు, రైతులు తప్పకుండా పాటించాలని గవర్నర్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు. నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని సూచించారు.


రంగురంగుల పూలను ఒకచోటకు చేర్చి.. ఆ పూలతోనే అమ్మవారిని కొలిచే గొప్ప పండుగ.. కుల, మతాలకు అతీతంగా ప్రజలందరినీ ఒక చోటకు చేర్చి ఐకమత్యంగా ఉండాలనే సందేశాన్నిచ్చే వేడుక బతుకమ్మ అని జూపల్లి పేర్కొన్నారు. చెరువులు, చేలను పరిరక్షించుకోవాలనే సందేశాన్నిచ్చే పండుగ బతుకమ్మ అని సీతక్క అన్నారు. బతుకమ్మ ఆడటం ద్వారా ఆరోగ్యం బాగుంటుందని, ఆ రకంగా ఇది ఆరోగ్యాన్ని పరిరక్షించే పండుగ అని వివరించారు. అనంతరం విజయ్‌ దేవరకొండ మాట్లాడారు. తనకు తెలంగాణ పండుగలు అంటే ఎంతో ఇష్టం అని.. అందులోనూ బోనాలు, బతుకమ్మ పండుగలంటే మరీ ఇష్టం అని చెప్పారు. ఫిబ్రవరిలో తమకు వివాహం జరిగిందని, తెలంగాణ పండుగల్లో ఒకటైన పెద్ద బతుకమ్మ పండగ ఎక్కడ జరిగితే అక్కడ బతుకమ్మ ఆడాలని రష్మికకు అప్పట్లోనే తాను చెప్పానని వెల్లడించారు. ఆ ప్రకారంగానే రష్మికను ట్యాంక్‌బండ్‌పై వేడుకల్లో బతుకమ్మను ఆడించేందుకు తీసుకొచ్చానని చెప్పారు.


అనంతరం రష్మిక మాట్లాడారు. తాను తెలంగాణ కోడలినని, ఆ రకంగా రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాల్లో పాలు పంచుకోవడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. పెళ్లయ్యాక.. తెలంగాణలో జరిగే అతిపెద్ద బతుకమ్మ పండగలో పాల్గొని బతుకమ్మ ఆడాలని విజయ్‌ తనకు చెప్పారని అందుకే ఈ బతుకమ్మ ఉత్సవాలకు తాను హాజరయ్యానని చెప్పారు. అప్పట్లో తనను అంతా మేడం అని పిలిచేవారని, తెలంగాణ కోడలినయ్యాక అంతా వదినా అని పిలుస్తున్నారని.. తన పట్ల ఈ అభిమానం ఎప్పటికీ ఇలానే ఉండాలని పేర్కొన్నారు. గవర్నర్‌ సతీమణి జానకీ శుక్లా, మంత్రి సీతక్క, రష్మిక బతుకమ్మ ఆడారు. హనుమకొండలో పద్మాక్షి ఆలయం వద్ద జరిగిన బతుకమ్మ ఉత్సవాల్లో వేలసంఖ్యలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు.


వరంగల్‌లోని పోతన ఆడిటోరియం, ప్రసిద్ధ భద్రకాళి ఆలయ ప్రాంగణం, ఉర్సూ కరీమాబాద్‌లోని రంగలీలా మైదానం, వరంగల్‌ కోట, కాజీపేటలోని వడ్డెపల్లి చెరువుకట్ట, కాశీబుగ్గలోని కోటి లింగాల దేవాలయ ప్రాంగణం వద్దా బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి కొండా సురేఖ హనుమకొండ రాంనగర్‌లో జరిగిన బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో జరిగిన వేడుకలకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ హాజరయ్యారు. నిజామాబాద్‌ జిల్లా బోర్గాంలో బతుకమ్మ ఆడుతుండగా ఆ వైపు అంబులెన్స్‌ రావడంతో మహిళలు బతుకమ్మలను పక్కకు తీసి అంబులెన్స్‌కు దారి ఇచ్చి తమ బాధ్యతను చాటుకున్నారు.


4క్వింటాళ్ల పూలతో..

ఖమ్మం జిల్లా ప్రజలు. కూసుమంచి మండలం పెరికశింగారం గ్రామంలో 55 అడుగుల భారీ బతుకమ్మను పేర్చారు. గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు- విజయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఈ అతి పెద్ద బతుకమ్మను తీర్చిదిద్దారు. ఈ బతుకమ్మ పేర్చడానికి నాలుగు క్వింటాళ్ల పూలు అవసరమయ్యాయి. 25 మంది పదిగంటల పాటు శ్రమించి బతుకమ్మను సిద్ధం చేశారు. గత 25 ఏళ్లుగా ఇక్కడ భారీ ఎత్తుతో బతుకమ్మను పేర్చడం ఆనవాయితీగా వస్తోంది. కాగా కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం తిప్పాపూర్‌లో బతుకమ్మ నిమజ్జనం సందర్భంగా విషాద ఘటన జరిగింది. ధర్మగల్ల స్వామి (40) అనే ఆర్టీసీ డ్రైవర్‌ కుటుంబసభ్యులతో కలిసి బతుకమ్మ వేడుకలకు హాజరయ్యాడు. బతుకమ్మను నిమజ్జనం చేస్తుండగా కాలు జారడంతో స్వామి నీళ్లలో మునిగిపోయాడు. కొద్దిసేపటికి అతడిని నీళ్లలోంచి బయటకు తీయగా అప్పగికే మృతిచెందాడు. స్వామికి భార్య శ్యామల, కుమార్తె, కుమారుడు, తల్లిదండ్రులు ఉన్నారు.


ఈ వార్తలూ చదవండి

విజయవాడ మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ నామినేషన్

విజయనగరంలో ఎవరికి వారే!

For More AP News And Telugu News

Updated Date - Oct 19 , 2026 | 04:49 AM