Share News

తలుపులు తెరిచి ఉన్నాయి.. వచ్చి సమస్యలు చెప్పుకోవచ్చు: కార్మికులకు మంత్రి సూచన

ABN , Publish Date - Apr 14 , 2026 | 10:23 AM

Telangana RTC Strike April 22 Minister Ponnam Prabhakar Appeals to Workers to Withdraw Protest

తలుపులు తెరిచి ఉన్నాయి.. వచ్చి సమస్యలు చెప్పుకోవచ్చు: కార్మికులకు మంత్రి సూచన
TG Minister Ponnam Prabhakar

హైదరాబాద్, ఏప్రిల్14: ఆర్టీసీ పరిరక్షణ - ప్రజల ప్రయోజనాల దృష్ట్యా సమ్మె నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కార్మికులకు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని సంస్థ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.


సమస్యలు చెప్పుకోవడానికి తమ తలుపులు తెరిచే ఉన్నాయి.. ఎవరైనా వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చునని ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాల అంశాలు ప్రభుత్వ పరిధిలోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఆర్టీసీ విలీనానికి సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ పని చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు.


తమ డిమాండ్ల నెరవేరని పక్షంలో ఏప్రిల్ 22వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ సోమవారం ప్రకటించింది. 21వ తేదీ అర్థరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు నిలిపి వేస్తామని స్పష్టం చేసింది. 22వ తేదీ తెల్లవారుజాము నుంచి సమ్మెలోకి వెళ్తామని పేర్కొంది. సోమవారం ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని కార్మిక శాఖ కార్యాలయంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో ఆర్టీసీ జేఏసీ నేతలు సమావేశమయ్యారు.


అనంతరం ఆర్టీసీ జేఏసీ నేతలు మాట్లాడుతూ.. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఆర్టీసీ సంస్థ నుంచి అధికారులు రాలేదని స్పష్టం చేశారు. అయితే ఆర్టీసీ యాజమాన్యం నుంచి లేఖ మాత్రం వచ్చిందన్నారు. కార్మికుల సమస్యలు ప్రభుత్వం పరిధిలో ఉన్నాయని ఈ సందర్భంగా యాజమాన్యం స్పష్టం చేసిందని చెప్పారు.


ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, కార్మిక సంఘాలకు ఎన్నికలు సహా మరో 30 డిమాండ్లతో సమ్మెకు వెళ్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం పైవిధంగా స్పందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

26 నుంచి చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాలు

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్

For More TG News And Telugu News

Updated Date - Apr 14 , 2026 | 11:00 AM