Share News

డిపోల్లోనే బస్సులు! తొలిరోజు ఉధృతంగా సాగిన ఆర్టీసీ సమ్మె

ABN , Publish Date - Apr 23 , 2026 | 05:29 AM

ఆర్టీసీ సమ్మె తొలిరోజు ఉధృతంగా సాగింది. చాలా వరకు బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. కార్మికులు తెల్లవారుజామునే డిపోల వద్దకు చేరుకుని బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. పోలీసు బందోబస్తు మధ్య ఐదుశాతం బస్సులు మాత్రమే రోడ్లపైకి.....

డిపోల్లోనే బస్సులు! తొలిరోజు ఉధృతంగా సాగిన ఆర్టీసీ సమ్మె

  • విధులు బహిష్కరించిన కార్మికులు

  • ఎక్కడికక్కడ బస్సులను అడ్డగిస్తూ నిరసనలు

  • పోలీసు బందోబస్తు మధ్య 5 శాతం బస్సులే రోడ్లపైకి..

  • ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు

  • ఇదే అదనుగా ప్రైవేటు వాహనదారుల దోపిడీ

  • పలుచోట్ల బస్సుల్లో కండక్టర్లు లేక.. అందరికీ ఉచిత ప్రయాణం!

  • కొన్ని అద్దె బస్సుల్లో మహిళలకూ చార్జీలు

  • నేడు మహా ధర్నాకు ఆర్టీసీ జేఏసీ పిలుపు

  • 32 డిమాండ్లలో 29 పరిష్కారానికి సిద్ధం

  • సమ్మె వెనక బీఆర్‌ఎస్‌, హరీశ్‌ కుట్ర: పొన్నం

  • సమ్మెలో పాల్గొనేవారిపై చర్యలు: ఆర్టీసీ ఎండీ

  • సమ్మెకు దూరం.. సూపర్‌వైజర్‌ అసోసియేషన్‌

  • మే 5న ఆటో, ప్రైవేట్‌ రవాణా డ్రైవర్ల మహాధర్నా

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

ఆర్టీసీ సమ్మె తొలిరోజు ఉధృతంగా సాగింది. చాలా వరకు బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. కార్మికులు తెల్లవారుజామునే డిపోల వద్దకు చేరుకుని బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. పోలీసు బందోబస్తు మధ్య ఐదుశాతం బస్సులు మాత్రమే రోడ్లపైకి వచ్చాయి. సమ్మె సంగతి తెలియక బస్టాండ్లకు వచ్చిన వేలాది మంది ప్రయాణికులకు తిప్పలు తప్పలేదు. పోలీసు బందోబస్తు మధ్య పలు బస్సులు నడిపినా అవి ఏమాత్రం చాలలేదు.

7.jpg


కేవలం జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాల మధ్య మాత్రమే బస్సులు తిరిగాయి. ఎండల తీవ్రత, గ్రామాలకు బస్సులు లేకపోవడంతో మహిళలు, చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. కండక్టర్లు కూడా సమ్మెలో ఉండటంతో హైదరాబాద్‌, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అన్ని బస్సుల్లో ప్రయాణికులను ఉచితంగా గమ్యస్థానాలకు చేర్చారు. మరోవైపు మంచిర్యాలతోపాటు పలు ప్రాంతాల్లో ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు ఆధార్‌కార్డు చూపించిన మహిళల నుంచి బలవంతంగా చార్జీలు వసూలు చేశారు. ఇవ్వబోమన్న మహిళలను బస్సుల నుంచి కిందికి దింపేశారు. ప్రయాణ మార్గంలో వివిధ స్టేజీల వద్ద మహిళా ప్రయాణికులు ఉన్న చోట బస్సులు ఆపకుండానే వెళ్లిపోయారు. మరోవైపు ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా తీసుకున్న చాలా మంది ప్రైవేటు వాహనదారులు ఏకంగా రెండింతల వరకు చార్జీలు వసూలు చేశారు. నేరుగా బస్టాండ్లలోకి వచ్చి ప్రయాణికులను ఎక్కించుకున్నారు. హైదరాబాద్‌తోపాటు జిల్లా కేంద్రాల్లో ఆటోవాలాలు గతంలో పది, ఇరవై రూపాయలు తీసుకునే దూరానికి కూడా.. రూ.30 నుంచి రూ.50 వరకు తీసుకున్నారు. కరీంనగర్‌ నుంచి వరంగల్‌కు వెళుతున్న ఆర్టీసీ అద్దె బస్సు కరీంనగర్‌ బైపాస్‌ రోడ్డు ప్రాంతంలో లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 22 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.

నేడు మహాధర్నాకు జేఏసీ పిలుపు

తమ సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె విరమించేది లేదని, సకల జనుల సమ్మె తరహాలో పోరుబాట పడతామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. సమ్మె రెండో రోజు గురువారం మహాధర్నాకు పిలుపునిచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోలు, యూనిట్లు, వర్క్‌షాష్ ల్లో ఆందోళనలు చేపట్టాలని కార్మికులకు సూచించింది. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం తమ డిమాండ్లను పరిష్కరించకుండా మొండిగా వ్యవహరిస్తున్నాయని జేఏసీ నాయకులు ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ ఇప్పుడు సమస్యలను పరిష్కరించలేమని చేతులెత్తేయడంతోనే సమ్మె చేపట్టామని తెలిపారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, 2021 వేతన సవరణ 30ు తగ్గకుండా అమలు, కార్మిక సంఘాలను అనుమతించి గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణతోపాటు ఇతర న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

5.jpg


ప్రత్యామ్నాయ చర్యలపై సర్కారు దృష్టి

సమ్మె కొనసాగితే.. సాధారణ ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూసేందుకు ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టిపెట్టాయి. ఆర్టీసీలో డ్రైవర్‌, శ్రామిక్‌ పోస్టుల భర్తీ కోసం గతంలో పోలీస్‌ నియామక బోర్డు ఆధ్వర్యంలో దరఖాస్తులు స్వీకరించారు. అప్పుడు దరఖాస్తు చేసుకుని ఎంపిక కానివారిని పిలిచి.. తాత్కాలిక డ్రైవర్లుగా నియమించి బస్సులు నడపాలనే ప్రతిపాదన వచ్చినట్టు తెలిసింది. ఇలా 2 వేల మంది వరకు తాత్కాలిక డ్రైవర్లను తీసుకుని, పోలీసు బందోబస్తుతో బస్సులు నడపాలని భావిస్తున్నట్టు సమాచారం. దీనిపై ఇప్పటికే పోలీస్‌ ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఇక జిల్లాల్లో డిపోల వారీగా కూడా తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్లను నియమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రోజుకు డ్రైవర్‌కు రూ.1,000, కండక్టర్‌కు రూ.8,00 ఇస్తామని డిపో మేనేజర్లు ప్రకటనలు చేశారు.

టైర్లలో గాలి తీసి.. డిపోల ముందు బైఠాయించి..

రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్‌డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు బుధవారం తెల్లవారుజాము నుంచే ఆందోళనలు చేపట్టారు. డిపోల ఎదుట బైఠాయించి, బతుకమ్మ ఆడుతూ నిరసనలు తెలిపారు. బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. పలుచోట్ల బస్సులను బయటికి తీసేందుకు అద్దెబస్సుల డ్రైవర్లు ప్రయత్నించగా టైర్లలో గాలి తీసేశారు. ఈ క్రమంలో కార్మికులకు, పోలీసులకు మధ్య తోపులాటలు జరిగాయి. వికారాబాద్‌ జిల్లా పరిగి ఆర్టీసీ డిపో వద్ద ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీనితో పోలీసులు లాఠీచార్జి చేశారు. కార్మికులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్మికులు అక్కడ కూడా నిరసన తెలిపారు. ఇక సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో ఆర్టీసీ కార్మికులు డీఎస్పీ కాళ్లు పట్టుకుని.. సమ్మెకు సహకరించాలని కోరారు. కొన్నిచోట్ల తాత్కాలికంగా ప్రైవేటు కండక్టర్లను నియమించి సర్వీసులు నిర్వహించారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలు వేములవాడ, యాదగిరిగుట్టకు వచ్చి భక్తులు బస్సులు లేకపోవడంతో తిరుగుప్రయాణం కోసం తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. మంచిర్యాలలో కండక్టర్‌ లేకుండా బస్సు నడపలేనన్న ఒక అద్దెబస్సు డ్రైవర్‌పై పోలీసులు చేయిచేసుకున్నారంటూ కార్మికులు ఆందోళన చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల ఆందోళనల్లో స్థానిక బీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొని మద్దతు పలికారు.

8.jpg


సమ్మెకు దూరం: సూపర్‌వైజర్స్‌ అసోసియేషన్‌

తాము సమ్మెకు మద్దతివ్వడం లేదని ఆర్టీసీ సూపర్‌వైజర్‌ అసోసియేషన్‌ ప్రకటించింది. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని.. అందుకే సమ్మెలో పాల్గొనవద్దని నిర్ణయించామని అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కె.వాసుదేవరావు తెలిపారు.

మెట్రో సర్వీసుల పెంపు.. ఎంఎంటీఎస్‌లు ఫుల్‌!

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హైదరాబాద్‌ నగరంలో ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా మెట్రోరైల్‌ సర్వీసులను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో మెట్రో సర్వీసుల మధ్య విరామాన్ని తగ్గించి 56 రైళ్లను నడుపుతుంటారు. మిగతా సమయాల్లో 44 రైళ్లు తిప్పుతారు. సమ్మె నేపథ్యంలో రోజంతా 56 రైళ్లు నడపాలని అధికారులు నిర్ణయించారు. రాత్రి 11 గంటల తర్వాత కూడా కొన్ని సర్వీసులను నిర్వహించాలన్న ప్రతిపాదనలనూ పరిశీలిస్తున్నట్టు తెలిపారు. బుధవారం మెట్రోలో ప్రయాణికుల సంఖ్య సాధారణంతో పోలిస్తే 40వేల దాకా పెరిగిందని వెల్లడించారు. మరోవైపు బస్సులు లేకపోవడంతో ఎంఎంటీఎస్‌ రైళ్లు కూడా కిటకిటలాడాయి. ఈ రైళ్ల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

1.jpg


రక్షిస్తామని భక్షిస్తారా?: హరీశ్‌

ఆర్టీసీని రక్షిస్తామని చెప్పిన కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా భక్షించే పనిలో పడిందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఆర్టీసీ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు, ముఖ్యమంత్రికి సఖ్యత లేదనే మాట వినిపిస్తోందన్నారు. ఆర్టీసీ లాభాల్లో నడుస్తోందని చెబుతున్న ప్రభుత్వం.. ఆర్టీసీ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు ఎందుకు తీసుకొచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తీసుకువచ్చి ఆర్టీసీ డ్రైవర్‌, కండక్టర్‌లపై ఒత్తిడి పెంచిందన్నారు. కార్మికులను పిలిచి సమస్యలను పరిష్కరించకపోతే సమ్మె మరింత ఉధృతం అవుతుందని హెచ్చరించారు.

కాంగ్రెస్‌ పంతాలకు సామాన్యులు బలి: కవిత

కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం పంతాలు, పట్టింపులకు సామాన్యులు బలయ్యే ప్రమాదం ఏర్పడిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. సమ్మె ప్రభావం లేదని చెప్పడానికి శిక్షణలేని డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులు నడిపి, కరీంనగర్‌లో ప్రమాదానికి కారణమయ్యారని మండిపడ్డారు.

బెదిరించడం సరికాదు: కూనంనేని

సమ్మెలో పాల్గొనే కార్మికులపై చర్యలు తీసుకుంటామని ఆర్టీసీ యాజమాన్యం బెదిరించడం సరికాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. కార్మికులకు తాము అండగా ఉంటామని ప్రకటించారు. కార్మికుల డిమాండ్లన్నీ ప్రభుత్వం పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

4.jpg


మే 5న ఆటో, ప్రైవేట్‌ రవాణా డ్రైవర్ల మహాధర్నా

ప్రైవేటు రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు, సొంత ఇల్లు లేని డ్రైవర్లకు డబుల్‌ బెడ్రూం ఇళ్ల మంజూరు తదితర డిమాండ్లతో ఆటో, ప్రైవేట్‌ రవాణా డ్రైవర్లు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ స్టేట్‌ ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మజ్దూర్‌ మహాసంఘ్‌ ఆధ్వర్యంలో మే 5న మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించారు. ఇందిరాపార్కు వద్ద నిర్వహించే మహాధర్నాలో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహిళలకు ఉచిత బస్సుపై పునః పరిశీలన, డ్రైవర్లకు ఏటా రూ.12 వేలు ఇస్తామన్న హామీ అమలు, రాష్ట్రవ్యాప్తంగా ఆటో పర్మిట్ల మంజూరుతోపాటు పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా చేపడుతున్నట్లు భారతీయ ప్రైవేట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ మజ్దూర్‌ మహాసంఘ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి రవిశంకర్‌ అల్లూరి తెలిపారు.

3.jpg

Updated Date - Apr 23 , 2026 | 06:06 AM