Share News

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం: రాంచందర్ రావు

ABN , Publish Date - Apr 24 , 2026 | 11:37 AM

టీజీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు మండిపడ్డారు. సమ్మె చేస్తున్న కార్మిక సంఘాలకు ఆయన మద్దతు ప్రకటించారు.

ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం: రాంచందర్ రావు
T BJP Chief Ramachadrarao

హైదరాబాద్, ఏప్రిల్ 24: టీజీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోకుండా తీవ్ర అన్యాయం చేస్తుంది. ఆర్టీసీ సమ్మె సమస్యను పరిష్కరించాల్సింది పోయి కమిటీల పేరుతో కాలయాపన చేయడం ద్వారా ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ కార్మికులు చేపట్టిన పోరుబాట చివరకు సమ్మెకు దారితీసి.. తద్వారా రాష్ట్రంలో పరిస్థితిని ఆందోళనకరంగా మార్చింది.


ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ముగ్గురు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడడం ఎంతో కలచివేసింది. ముఖ్యంగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆత్మహత్యాయత్నం చేసిన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటకు చెందిన డ్రైవర్ కోల శంకర్ గౌడ్ చికిత్స పొందుతూ మరణించడం అత్యంత బాధాకరం. కాంగ్రెస్ సర్కారు ఆర్టీసీ కార్మికుల డిమాండ్లతోపాటు వారి సమస్యలు పరిష్కరించక పోవడం వల్లే ఈ దారుణ పరిస్థితి ఎదురైంది. శంకర్ గౌడ్ మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆయన కుటుంబానికి తగిన పరిహారం చెల్లించాలి. ఆర్టీసీ కార్మికులు ముందుగానే నోటీసులు ఇచ్చినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోకపోవడం అత్యంత దురదృష్టకరం. బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.


గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ కార్మికులు సమ్మెకు దిగినప్పుడు, భారతీయ జనతా పార్టీ కార్మికుల పక్షాన నిలబడి పోరాటం చేసింది. అదే విధంగా, 2017 నుంచి ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ బకాయిలు చెల్లించకపోవడం, రిటైర్డ్ ఉద్యోగులకు రావలసిన బెనిఫిట్స్ ఇవ్వకపోవడం కూడా ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇలాంటి చర్యలు ఇప్పటికే అమలు చేసిన విషయం తెలిసిందే.


ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలి. కార్మికుల ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. ఆర్టీసీ కార్మికులకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోంది. వారి హక్కుల కోసం మేము పోరాటం కొనసాగిస్తున్నాం.. కొనసాగిస్తూనే ఉంటాం. ఆర్టీసీ కార్మికుల పక్షాన బీజేపీ ఎల్లప్పుడూ నిలుస్తుంది. తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈ పోరాటంలో కార్మికుల పక్షానే నిలుస్తోంది. అయితే, ఈ సందర్భంగా నేను ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాను.. ఎవరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దు. మీ సమస్యల పరిష్కారం కోసం బీజేపీ పోరాటం కొనసాగుతుందని’ ఆ పార్టీ తెలంగాణ చీఫ్ ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

లిక్కర్ స్కాం నిందితుల నివాసాల్లో ఈడీ ఆకస్మిక సోదాలు

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన ట్రావెల్స్ బస్సు.. ఒకరి మృతి, పలువురికి గాయాలు

For More AP News And Telugu News

Updated Date - Apr 24 , 2026 | 12:08 PM