ప్రయాణికుడితో దురుసు ప్రవర్తన
ABN , Publish Date - Nov 20 , 2026 | 05:51 AM
ప్రయాణికుడితో దురుసుగా ప్రవర్తించిన ప్రైవేట్ అద్దె బస్సు డ్రైవర్‌ను ఆర్టీసీ యాజమాన్యం విధుల నుంచి తొలగించింది.
అద్దె బస్సు డ్రైవర్ విధుల నుంచి తొలగింపు
హైదరాబాద్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ప్రయాణికుడితో దురుసుగా ప్రవర్తించిన ప్రైవేట్ అద్దె బస్సు డ్రైవర్‌ను ఆర్టీసీ యాజమాన్యం విధుల నుంచి తొలగించింది. హైదరాబాద్-1 డిపోకు చెందిన డ్రైవర్ సూర్య (బ్యాడ్జి నంబర్ 421) ఈ నెల 12న ఎంజీబీఎస్ నుంచి రాయచూర్‌కు వెళ్లే మార్గంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఉదయం సుమారు 5.50 గంటలకు ఓ ప్రయాణికుడితో దురుసుగా ప్రవర్తించినట్లు అధికారుల దృష్టికి వచ్చింది.
ఈ ఘటనపై విచారణ అనంతరం ఆడ్రైవర్‌ను విధుల నుంచి తొలగిస్తూ.. రాష్ట్రంలోని ఏ డిపోలోనూ ప్రైవేట్ అద్దె బస్సులపై విధులు కేటాయించరాదని అన్ని డిపో మేనేజర్లను అధికారులు ఆదేశించారు. అదేవిధంగా, ఆ బస్సు యజమాని.. డ్రైవర్ సూర్య స్థానంలో అర్హత కలిగిన మరో డ్రైవర్‌ను నియమించిన తర్వాతే బస్సును ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని ఆర్టీసీ యాజమాన్యం ఆదేశించింది. ప్రయాణికులకు ప్రయాణ సమయంలో ఏవైనా సమస్యలు ఎదురైనా, సిబ్బంది వల్ల ఇబ్బందులు కలిగినా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చని, కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 కు ఫోన్ చేసి తమ ఫిర్యాదులను తెలియజేయవచ్చని అధికారులు సూచించారు.
మంత్రి పొన్నంను కలిసిన ఆర్టీసీ ఎండీ
రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆర్టీసీ ఎండీ అనిల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్టీసీ నూతన ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రుల నివాస సముదాయంలో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్‌కు మంత్రి పొన్నం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి - ఉచిత బస్సు ప్రయాణ పథకం’ తీరుతెన్నులు, మహిళా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు బస్సు సర్వీసుల నిర్వహణపై చర్చించారు.
ఇవి కూడా చదవండి...
సిరాజ్‌ను ఎందుకు పక్కన పెట్టారు?.. టీమిండియా ఎంపికపై గావస్కర్
హైదరాబాద్‌లో డ్రగ్స్ కింగ్‌పిన్ అరెస్ట్.. 51 గ్రాముల ఎమ్‌డీఎమ్‌ఏ స్వాధీనం
Read latest Telangana News And Telugu NEws