పట్టాపగ్గాల్లేని విద్యుత్ డిమాండ్
ABN , Publish Date - Oct 17 , 2026 | 05:11 AM
విద్యుత్ డిమాండ్ సాధారణంగా వేసవిలో గరిష్ఠ స్థాయికి చేరుకొని పాత రికార్డులు బద్దలవుతుంటాయి. కానీ, ఈసారి ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో శీతాకాలంలో కొత్త రికార్డులు నెలకొంటున్నాయి.
20,003 మెగావాట్లుగా నమోదు..
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇదే అత్యధికం
యూనిట్‌కు రూ.10 పెట్టినా దొరకని కరెంట్
కరెంట్ కొనుగోళ్లకు ఒక్కరోజే రూ.42 కోట్లు
హైదరాబాద్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ డిమాండ్ సాధారణంగా వేసవిలో గరిష్ఠ స్థాయికి చేరుకొని పాత రికార్డులు బద్దలవుతుంటాయి. కానీ, ఈసారి ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో శీతాకాలంలో కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. గురువారం ఉదయం 10:29 గంటల సమయంలో 20,003 మెగావాట్ల డిమాండ్ రికార్డయింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇదే అత్యధిక విద్యుత్ డిమాండ్. వ్యవసాయ, గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగం గణనీయంగా పెరగడంతోపాటు ఎత్తిపోతల పథకాల మోటార్లకు భారీగా కరెంటును ఉపయోగిస్తుండటమే దీనికి కారణమని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది అక్టోబరులో డిమాండ్ 12,998 మెగావాట్లు ఉండగా... ప్రస్తుతం 20 వేల మెగావాట్లకు చేరింది. 2027 ఫిబ్రవరి, మార్చి నాటికి ఇది 26వేల మెగావాట్లకు పెరిగే అవకాశం ఉందంటున్నారు.
విద్యుత్ వినియోగం కూడా 300 మిలియన్ యూనిట్లకు పైగా ఉండటం గమనార్హం. మరోవైపు రాష్ట్ర అవసరాలు తీర్చడానికి వీలుగా ప్రతిరోజు 60 మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్‌ను బహిరంగ విపణిలో కొనుగోలు చేస్తున్నారు. కాగా, రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 300 మిలియన్ యూనిట్లకు పైగా నమోదు అవుతుండగా.. ఇందులో 35 శాతానికి పైగా కరెంట్‌ను తెలంగాణ జెన్కో థర్మల్, జలవిద్యుత్ కేంద్రాలే తీర్చుతున్నాయి.
గురువారం 334.54 మిలియన్ యూనిట్ల వినియోగం నమోదు కాగా... థర్మల్ కేంద్రాల ద్వారా 116.52, జలవిద్యుత్ ద్వారా 6.96, సోలార్ కూడా కలిపి మొత్తంగా 123.54 మిలియన్ యూనిట్ల కరెంట్‌ను జెన్కో అందించింది. సింగరేణి 26.77 మిలియన్ యూనిట్ల కరెంట్‌ను అందించింది. కేంద్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో పాటు బహిరంగ విపణిలో కొన్నది 141 మిలియన్ యూనిట్లు. సంప్రదాయేతర ఇంధన వనరుల నుంచి 55.95 మిలియన్ యూనిట్లను సేకరించారు.
కరెంట్‌కు కటకట..
యూనిట్‌కు రూ.10పెట్టినా బహిరంగ విపణిలో కరెంటు దొరకడం లేదు. గురువారం ‘డే ఎహెడ్ మార్కెట్’లో యూనిట్ రూ.4.37 చొప్పున 45 మిలియన్ యూనిట్ల కరెంట్ కొనుగోలు చేయగా... యూనిట్‌కు రూ.10చొప్పున గ్రీన్‌డే ఎహెడ్ నుంచి ఒక మిలియన్ యూనిట్లు కొనుగోలు చేశారు. ఆర్టీఎంలో యూనిట్ రూ.9.41 చొప్పున 23 మిలియన్ యూనిట్ల కరెంట్ కొన్నారు. తెలంగాణ జెన్కో 4156 మెగావాట్ల కరెంట్ అందించగా, సింగరేణి 1087 మెగావాట్లు, కేంద్ర సంస్థల నుంచి 2477 మెగావాట్లు, ప్రైవేట్ సంస్థల నుంచి 6962 మెగావాట్లు లభించింది.
దీనికి అదనంగా బహిరంగ విపణిలో 4502 మెగావాట్లు కొన్నారు. మొత్తంగా రాష్ట్ర వినియోగానికి 339 మిలియన్ యూనిట్ల అవసరం ఉండగా... 325 మిలియన్ యూనిట్లనే సరఫరా చేశారు. 14 మిలియన్ యూనిట్లలోటు నమోదైంది. భారీగా విద్యుత్ డిమాండ్ ఉండటంతో గురువారం ఒక్కరోజే కొనుగోళ్ల కోసం రూ.42.92 కోట్లు వెచ్చించారు.
యాదాద్రిలో 5 రోజులకే సరిపోయే బొగ్గు నిల్వలు
కీలకమైన యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రతి రోజూ 27 వేల టన్నుల బొగ్గు అవసరం కాగా, ప్రస్తుతం 1,35,234 టన్నుల బొగ్గు నిల్వ ఉంది. ఇది 5 రోజులకు మాత్రమే సరిపోతుంది. ఇక కేటీపీఎస్ (పాల్వంచ)ఐదో , ఆరో దశలో 10 రోజులు, కేటీపీఎస్ ఏడో దశలో 13 రోజులు, కేటీపీపీ(భూపాలపల్లి)లో 11 రోజులు, బీటీపీఎస్(మణుగూరు)లో 10 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
హైదరాబాద్‌లో కార్ల తయారీ ప్లాంట్ పెట్టండి
ఎల్‌నినో దెబ్బకు పొదుపు మంత్రం
క్షేత్రస్థాయిలో కరెంటు యంత్రాంగం
Read Latest AP News And Telangana News And International