హైదరాబాద్‌లో కార్ల తయారీ ప్లాంట్ పెట్టండి
ABN , Publish Date - Oct 17 , 2026 | 04:58 AM
రాజధాని హైదరాబాద్‌లో కార్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని.. హ్యుందాయ్ యాజమాన్యాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
‘హ్యుందాయ్’ యాజమాన్యానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి
జహీరాబాద్‌లో రూ.8,528 కోట్లతో ఆ సంస్థ గ్లోబల్ ఆర్ అండ్ డీ కేంద్రం..
త్వరలోనే భూమిపూజకు సిద్ధం
త్వరగా అనుమతులు ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశం
హైదరాబాద్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్‌లో కార్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని.. హ్యుందాయ్ యాజమాన్యాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. జహీరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న హ్యుందాయ్ గ్లోబల్ ఆర్అండ్డీ కేంద్రానికి సంబంధించిన పెండింగ్ అనుమతులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఇక్కడ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలోని బోధి పెవిలియన్‌లో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ మేనేజింగ్ డైరెక్టర్ చాంగ్యాన్ చో నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రితో సమావేశమైంది. తెలంగాణను కార్ల తయారీకి ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం వారికి తెలిపారు. కార్ల తయారీ పరిశ్రమకు అవసరమైన రవాణా, మౌలిక సదుపాయాలు తెలంగాణలో అందుబాటులో ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలూ అందిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి హ్యుందాయ్ బృందానికి తెలిపిన సీఎం.. డిసెంబరులో నిర్వహించినున్న గ్లోబల్ సమ్మిట్‌కు హాజరుకావాల్సింగా ఆహ్వానించారు.
ఆర్ అండ్ డీ కేంద్రం నేపథ్యం..
హ్యుందాయ్ సంస్థకు హైదరాబాద్‌తో రెండు దశాబ్దాల అనుబంధం ఉంది. హైటెక్ సిటీలో ఆ సంస్థ అధునాతన వాహన ఇంజినీరింగ్‌కు మద్దతునిస్తూ కీలక ఆర్ అండ్ డీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో 2024 ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశంలో సీఎం రేవంత్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం హ్యుందాయ్ ప్రతినిధులతో చర్చలు జరిపింది. అనంతరం హ్యుందాయ్ ఆర్ అండ్ డీ కేంద్రం ఏర్పాటు ప్రతిపాదన చేసింది. దానికి 2025 జూన్‌లో రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. ఈ మేరకు.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని నేషనల్ ఇన్వె్‌స్టమెంట్ అండ్ మ్యానుఫాక్చరింగ్ జోన్లో రూ.8,528 కోట్ల పెట్టుబడితో హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది.
678 ఎకరాల్లో విడతలవారిగా అభివృద్థి చేయనున్న ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 4,276 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఆ ప్రాజెక్టు పురోగతి గురించి హ్యుందాయ్ ప్రతినిధులు శుక్రవారం భేటీలో ముఖ్యమంత్రికి వివరించారు. రాబోయే కొద్ది నెలల్లోనే ఆ కేంద్రం నిర్మాణానికి భూమిపూజ చేయనున్నట్టు తెలిపారు. ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు సాగేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్... అవసరమైన అనుమతుల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కేంద్రం ద్వారా హ్యుందాయ్ వాహనాల రూపకల్పన, పరీక్షలు, పనితీరు, ధ్రువీకరణ, నాణ్యతా ప్రమాణాల పరిశీలనతోపాటు ఇంజినీరింగ్ ప్రక్రియలను మరింత మెరుగుపరిచేందుకు అవకాశం కలగనుంది. హ్యుందాయ్ అధునాతన సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుంది.
సీఎం రేవంత్‌ను కలిసిన దిల్ రాజు
తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని శుక్రవారం కలిశారు. బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ చాలెంజ్- 2026 అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన్ను ఆహ్వానించారు. సినీ దర్శకుడు హరీష్ శంకర్, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, చరణ్ అర్జున్, నల్గొండ గద్దర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈనెల 17న శిల్పకళా వేదికలో ఈ వేడుక నిర్వహించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఎల్‌నినో దెబ్బకు పొదుపు మంత్రం
క్షేత్రస్థాయిలో కరెంటు యంత్రాంగం
Read Latest AP News And Telangana News And International