Share News

పునర్విభజన తర్వాతే పీఏసీఎస్‌ల ఎన్నికలు!

ABN , Publish Date - Nov 21 , 2026 | 04:59 AM

రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) ఎన్నికల నిర్వహణకు మరో ఆరు నెలల సమయం పట్టేలా ఉంది.

పునర్విభజన తర్వాతే పీఏసీఎస్‌ల ఎన్నికలు!
Telangana PACS Elections

  • 6 నెలలపాటు కొనసాగనున్న విభజన ప్రక్రియ

  • రాష్ట్రంలోని పాత సొసైటీలు 908...

  • కొత్తగా ఆమోదించినవి 240

  • విభజన జరిగే పాత సొసైటీల్లో పర్సన్‌ ఇన్‌చార్జిల నియామకానికి బ్రేక్‌

హైదరాబాద్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) ఎన్నికల నిర్వహణకు మరో ఆరు నెలల సమయం పట్టేలా ఉంది. ఇప్పటికే ఉన్న 908 పీఏసీఎస్‌లకు తోడు మరో 240 కొత్త సంఘాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన విషయ తెలిసిందే. ఈ ప్రక్రియ శనివారం నుంచిప్రారంభం కానుంది. ఓటర్లు, గ్రామాలు, ఆస్తులు, అప్పుల పంపకాలు, కొత్త సొసైటీల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తిచేసి.. పునర్విభజన చేయటానికి సుమారు 6 నెలల సమయం పడుతుందని అధికారవర్గాలు తెలిపాయి. ఆ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.


ఈ సంఘాలకు ప్రభుత్వం విడతలవారీగా పర్సన్‌ ఇన్‌చార్జిలను నియమిస్తోంది. అయితే, విభజన జాబితాలో ఉన్న పీఏసీఎస్‌లకు మాత్రం పర్సన్‌ ఇన్‌చార్జిల నియామకానికి బ్రేక్‌ పడింది. కేంద్ర ప్రభుత్వం, నాబార్డు మార్గదర్శకాల ప్రకారం... పీఏసీఎస్‌ల సంఖ్యను పెంచుతున్నారు. రాష్ట్రంలో 908 పీఏసీఎస్‌లు ఉన్నప్పటికీ.. 83 మండలాల్లో ఒక్క సంఘం కూడా లేదు. గిరిజన ప్రాంతాల్లో 50 నుంచి 100 కి.మీ దూరంలో పీఏసీఎస్‌ కేంద్రాలు ఉండటంతో ఎరువుల బస్తాలు, పంట రుణాలు తీసుకోవటం రైతులకు ఇబ్బందిగా మారింది. పునర్విభజనలో ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. 8 గిరిజన ప్రాంతాలు, 83 కొత్త మండలాల్లో పీఏసీఎస్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.


నిజానికి 400 కొత్త పీఏసీఎస్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రాగా... 240 సంఘాలకు ఆమోదం లభించింది. పునర్విభజన పూర్తయితే రాష్ట్రంలో పీఏసీఎస్‌ల సంఖ్య 1,148కి చేరుతుంది. వీటి పాలకవర్గాల కాలపరిమితి ఐదేళ్లు. గత పాలకవర్గాల పదవీకాలం 2025 ఫిబ్రవరి 14తో ముగిసింది. అప్పటి నుంచి కోర్టు ఉత్తర్వుల ద్వారా కొందరు, పర్సన్‌ ఇన్‌చార్జ్జిల నియామక ప్రక్రియ ద్వారా కొందరు పదవుల్లో కొనసాగుతున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు 195 పీఏసీఎస్‌లకు పర్సన్‌ ఇన్‌చార్జిలతో కూడిన పాలకవర్గాలను నియమించింది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి వీటి పదవీకాలాన్ని పొడిగించేలా నిబంధనలు ఉన్నాయి. పునర్విభజన జాబితాలో ఉన్న 240 పీఏసీఎస్‌ల పాత పాలకవర్గాలను రద్దుచేశారు. పీఏసీఎస్‌ల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ప్రభుత్వాన్ని ఇటీవల హైకోర్టు ప్రశ్నించగా.. పునర్విభజన తర్వాత నిర్వహిస్తామని సమాధానమిచ్చింది. అందుకు 6 నెలల సమయం కోరే అవకాశాలున్నాయి. ఆ తర్వాత 1,148 సంఘాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.


వేగంగా మత్స్య సహకార సంఘాల ఎన్నికలు

రాష్ట్రంలో ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు ఎన్నికలు వేగంగా సాగుతున్నాయి. ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటివరకు 1,077 సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. ఐదేళ్లపాటు ఈ పాలకవర్గాలు కొనసాగుతాయి. గత ప్రభుత్వ హయాంలో కాలపరిమితి ముగిసినప్పటికీ ఎన్నికలు నిర్వహించలేదు. ప్రస్తుతం రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 49 మంది ఓటర్ల(సభ్యులు) వరకు ఉన్న సంఘాలకు చేతులెత్తే పద్ధతిలో, 50 కంటే ఎక్కువ మంది సభ్యులున్న సంఘాలకు బ్యాలెట్‌ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ అదనపు రిజిస్ట్రార్‌ చంద్రమోహన్‌రెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. మత్స్యపారిశ్రామిక, చేనేత- జౌళి, గీత పారిశ్రామిక, ఎంప్లాయీస్‌ కో- ఆపరేటివ్‌, హౌసింగ్‌ సొసైటీ, ఇండస్ట్రీస్‌ కో-ఆపరేటివ్‌ కలిపి 1,700 సంఘాలకు ఎన్నికలు నిర్వహించి, కొత్త పాలకవర్గాలను నియమించినట్లు వెల్లడించారు.


ఈ వార్తలనూ చదవండి:

భారత్‌కు పాక్ మంత్రి రాక.. మోదీ సర్కారుపై విపక్షాల విమర్శలు

తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కావేరీ నీటి అభ్యర్థన తిరస్కరణ..

Updated Date - Nov 21 , 2026 | 04:59 AM