ఓపీఎస్‌తో ఖజానాపై అదనపు భారం పడదు
ABN , Publish Date - Nov 28 , 2026 | 05:40 AM
పాత పెన్షన్ విధానం(ఓపీఎస్) పునరుద్ధరణతో రాష్ట్ర ఖజానాపై అదనపు భారం పడదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రిలకు తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ వివరించింది.
సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ సీఎస్ సంజయ్ జాజు, సీఎం ముఖ్య కార్యదర్శికివినతిపత్రం
హైదరాబాద్, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): పాత పెన్షన్ విధానం(ఓపీఎస్) పునరుద్ధరణతో రాష్ట్ర ఖజానాపై అదనపు భారం పడదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రిలకు తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ వివరించింది. ఈ మేరకు వారిద్దరిని యూనియన్ నాయకులు సచివాలయంలో శుక్రవారం కలిసి వినతిపత్రాలు అందించారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జి. స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ సచివాలయంలో ఈ ఉన్నతాధికారులను కలిసి సీపీఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణకు సంబంధించిన ఆర్థిక గణాంకాలను వివరించారు.
కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని సుమారు 2.80 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. రాష్ట్ర బడ్జెట్, రెవెన్యూ పరిస్థితి, జీతాల వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఓపీఎస్ అమలు సాధ్యమేనని పేర్కొన్నారు. అలాగే మోడల్ స్కూళ్ల టీచర్లకు రిటైర్మెంట్ గ్రాట్యుటీ, డెత్ గ్రాట్యుటీ అమలుకు సంబంధించి జీవో 60, ఫ్యామిలీ పెన్షన్‌కు సంబంధించి జీవో 58ని తక్షణమే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రంలోని అంశాలను పరిశీలించిన సీఎస్ సంజయ్ జాజు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి ఈ విషయాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని సానుకూలంగా స్పందించినట్లు యూనియన్ నేతలు ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
అటవీ ప్రాంతాల్లో నిఘా, గస్తీ మరింత పటిష్ఠం చేయాలి: పవన్ కల్యాణ్