Share News

భూవిస్తీర్ణంలో మార్పుచేర్పులు.. పరస్పర సమ్మతితోనే..

ABN , Publish Date - Nov 21 , 2026 | 04:08 AM

రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రక్రియను మరింత పారదర్శకంగా, వివాదాలకు తావులేకుండా నిర్వహించేందుకు ప్రభుత్వం కొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది.

భూవిస్తీర్ణంలో మార్పుచేర్పులు.. పరస్పర సమ్మతితోనే..
Telangana Land Resurvey

  • కొలతలకు ముందే రైతులకు నోటీసులు

  • కొలిచిన వెంటనే విస్తీర్ణం వివరాల వెల్లడి

  • అప్పీళ్ల సమయంలో క్షేత్రస్థాయి తనిఖీలు చేయనున్న కలెక్టరేట్‌ స్థాయి అధికారులు

  • గెజిట్‌ తర్వాత భూభారతిలో మార్పులు

  • ఆరు దశల్లో సమస్యలకు పరిష్కారం

  • మార్గదర్శకాలు జారీ చేసిన సీసీఎల్‌ఏ

హైదరాబాద్‌, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రక్రియను మరింత పారదర్శకంగా, వివాదాలకు తావులేకుండా నిర్వహించేందుకు ప్రభుత్వం కొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. రీసర్వే సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటిని క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేలా ఆరు దశల ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని (ఎస్‌వోపీ) సీసీఎల్‌ఏ రూపొందించింది. పహాణీలో నమోదైన భూమి విస్తీర్ణానికి, వాస్తవంగా రైతు స్వాధీనంలో ఉన్న భూమికి మధ్య తేడాలుంటే వాటిని ఎలా పరిష్కరించాలి? ఉమ్మడి ఖాతాలు, ఉమ్మడి ల్యాండ్‌ పార్శిల్‌ మ్యాప్స్‌ (ఎల్‌పీఎంల) సమస్యలను ఎలా అధిగమించాలి? ఒకరి పేరుపై రికార్డులున్నా మరొకరు భూమిని అనుభవిస్తుంటే ఏం చేయాలి? ఇలాంటి అనేక సందేహాలకు ఈ మార్గదర్శకాల్లో స్పష్టత ఇచ్చారు.


ఈ మేరకు చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిరేస్టషన్‌ (సీసీఎల్‌ఏ) డీఎస్‌ లోకేశ్‌కుమార్‌ శుక్రవారం సర్క్యులర్‌ ఇచ్చారు. హైదరాబాద్‌ మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (రెవెన్యూ), ఆర్డీవోలు, తహసీల్దార్లు ఈ మార్గదర్శకాలను అమలు చేయాలని ఆదేశించారు. ఆ మార్గదర్శకాల ప్రకారం ఆరు దశలు ఏవంటే.. రీసర్వేకు ముందు ఏర్పాట్లు చేయడం, కొలిచిన భూమి విస్తీర్ణాన్ని పట్టాదారులకు తెలియజేయడం, తహసీల్దార్‌ స్థాయిలో భూమి పాత రికార్డుల, రీసర్వే తరువాత కొత్తగా గుర్తించిన భూమి వివరాల పట్టికల (కో-రిలేషన్‌ స్టేట్‌మెంట్ల) పరిశీలన, రెవెన్యూ ఉన్నతాధికారుల క్షేత్రస్థాయి తనిఖీలు, తుది సర్వే రికార్డుల ఖరారు, గెజిట్‌ ప్రకటన, భూభారతి రికార్డుల నవీకరణ.


ఇలా చేయాలి..

కొత్త ఎస్‌వోపీ ప్రకారం.. సర్వే ప్రారంభానికి కనీసం నాలుగు రోజుల ముందు సంబంధిత తహసీల్దార్‌ ప్రతి పట్టాదారుకూ నోటీసులు అందించాలి. దీనిపై గ్రామంలో ప్రచారం చేయాలి. తహసీల్దార్‌ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించి.. రీసర్వే ఉద్దేశం, చేసే విధానం, దాంట్లో రైతుల భాగస్వామ్యం గురించి వివరించాలి. సర్వే ప్రారంభానికి కనీసం రెండు రోజుల ముందుగా రైతులకు జెండాలు అందించాలి. వాటిని తమ భూముల సరిహద్దుల్లోని మూలల్లో ఏర్పాటు చేసుకోవాలని సూచించాలి. దీనివల్ల సర్వే బృందాలకు భూముల హద్దులను గుర్తించడం సులభమవుతుంది.


ప్రభుత్వ భూముల రీసర్వే సందర్భంగా గ్రామపంచాయతీ నోటీసు బోర్డులో ఫారం-9 సాధారణ నోటీసు ప్రచురించాలి. పక్కనున్న భూముల పట్టాదారులు, ఆసక్తి ఉన్న వ్యక్తులు పాల్గొనేలా చూడాలి. ప్రభుత్వ భూమి విస్తీర్ణంలో ఏవైనా వ్యత్యాసాలు గుర్తిస్తే.. అందుకు గల కారణాలను రిమార్క్స్‌ కాలమ్‌లో నమోదు చేయాలి. చెరువులు, కుంటలు, అటవీ భూములు, ఇతర శాఖలకు బదిలీ చేసిన భూముల విషయంలో సంబంధిత శాఖలకు ఫారం-10 నోటీసులు ఇవ్వాలి. ఆయా శాఖల అధికారులను కూడా సర్వేలో భాగస్వాములను చేసి సరిహద్దులను గుర్తించాలి. ఇక.. ప్రతి భూమి కొలత పూర్తికాగానే వాస్తవంగా ఎంత విస్తీర్ణం ఉందో సంబంధిత పట్టాదారుకు వెంటనే తెలియజేయాలి. పహాణి, రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌ (ఆర్‌వోఆర్‌)లో నమోదైన విస్తీర్ణానికి, క్షేత్రస్థాయిలో కొలిచిన విస్తీర్ణానికి మధ్య తేడా ఉంటే ఆ విషయాన్ని కూడా వెంటనే రైతు దృష్టికి తీసుకెళ్లాలి. దీనివల్ల రైతులు తమ పాత పత్రాలు, రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు, ఇతర రెవెన్యూ రికార్డులను పరిశీలించుకుని ప్రారంభదశలోనే వివరణలు, అభ్యంతరాలు సమర్పించే అవకాశం ఉంటుంది.


TG copy.jpgసమస్యల నమోదు..

సర్వేలో గుర్తించిన సమస్యలను ఫీల్డ్‌ రిజిస్టర్‌లోని రిమార్క్స్‌ కాలమ్‌లో కచ్చితంగా నమోదు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏడు రకాల పరిస్థితులను ప్రత్యేకంగా గుర్తించాలి. అవేంటంటే.. పహాణీలో ఉన్న విస్తీర్ణానికి, భౌతికంగా కొలిచిన విస్తీర్ణానికి మధ్య తేడా ఉండటం. ఒకే ఖాతా నంబరుకు అనేక ల్యాండ్‌ పార్సెల్‌ మ్యాప్స్‌ (ఎల్‌పీఎంలు) ఉండటం, ఉమ్మడి ఖాతాలో అనేక మంది పట్టాదారులు ఉండి ఒకే ఎల్‌పీఎం ఉన్నా, ఉమ్మడి ఖాతాలో అనేక మంది పట్టాదారులకు అనేక ఎల్‌పీఎంలు, పట్టాదారుల పేర్లలో వ్యత్యాసాలు, రికార్డుల్లో పట్టాదారు పేరున్నా వాస్తవంగా భూమి స్వాధీనంలో లేకపోవడం, పహాణీలో పేరు లేకున్నా క్షేత్రస్థాయిలో భూమిని సాగు చేస్తూ, అనుభవిస్తూ ఉండటం. ఇలాంటి సందర్భాల్లో విస్తీర్ణం పెరగడానికి లేదా తగ్గడానికి గల కారణాలను కూడా స్పష్టంగా నమోదు చేయాలి.


తహసీల్దార్లకు కీలక బాధ్యతలు

రీసర్వేలో సేకరించిన వివరాలు, కో-రిలేషన్‌ స్టేట్‌మెంట్లు, కో-రిలేషన్‌ మ్యాప్‌లను తహసీల్దార్లు క్షుణ్నంగా పరిశీలించాలి. ఇందుకోసం మొత్తం ఎనిమిది రకాల కేసులను వర్గీకరించి పరిశీలించాలని ఎస్‌వోపీలో పేర్కొన్నారు. అవేంటంటే.. పహాణీలో ఉన్న విస్తీర్ణం, వాస్తవంగా భూమిపై ఉన్న విస్తీర్ణం సమానంగా ఉండటం (విస్తీర్ణం సరిపోలిన కేసులు), రికార్డుల్లో ఎక్కువ విస్తీర్ణం ఉన్నా రైతు స్వాధీనంలో తక్కువ భూమి ఉండటం (తక్కువ భూమి స్వాధీనం), రికార్డుల్లో ఉన్నదానికంటే ఎక్కువ భూమి రైతు స్వాధీనంలో ఉండటం (అదనపు భూమి స్వాధీనం), రికార్డుల్లో పట్టాదారు పేరు ఉన్నా క్షేత్రస్థాయిలో వారి స్వాధీనంలో లేకపోవడం(పట్టాదారు స్వాధీనంలో లేని భూమి), రికార్డుల్లో పేరు లేకపోయినా మరొకరు భూమిని సాగు చేస్తూ అనుభవించడం (పహాణీలో పేరు లేకున్నా స్వాధీనంలో ఉండటం), ఒక ఖాతాకు అనుసంధానంగా అనేక భూభాగాల మ్యాప్‌లు ఉండటం(ఒకే ఖాతాకు అనేక ఎల్‌పీఎంలు), పలువురు పట్టాదారులకు ఒకే భూభాగం మ్యాప్‌ అనుసంధానమై ఉండటం(ఉమ్మడి ఖాతాకు ఒకే ఎల్‌పీఎం), పలువురు పట్టాదారులకు అనేక భూభాగాల మ్యాప్‌లు అనుసంధానమై ఉండటం (ఉమ్మడి ఖాతాకు అనేక ఎల్‌పీఎంలు). ఈ ఎనిమిది రకాల కేసులకు సంబంధించిన రెవెన్యూ రికార్డులు, ఇతర పత్రాలను తహసీల్దార్లు సేకరించి పరిశీలించాలి. గ్రామస్థాయి శిబిరాలు ముగిసిన 3-4 రోజుల్లోగా అన్నికేసులనూ పరిశీలించి కో-రిలేషన్‌ స్టేట్‌మెంట్లు, మ్యాప్‌లలో అవసరమైన వివరాలను సరిచూసుకోవాలి.


పరస్పర అంగీకారంతో..

భూముల రీసర్వేలో ఎక్కువ వివాదాలు తలెత్తే అంశం పహాణీలోని విస్తీర్ణానికి, భౌతిక స్వాధీనంలోని విస్తీర్ణానికి మధ్య ఉండే వ్యత్యాసం. ఈ సమస్యలను న్యాయస్థానాలు, అప్పీళ్ల వరకు తీసుకెళ్లకుండా గ్రామస్థాయిలోనే పరిష్కరించేందుకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. ఆయా గ్రామాల్లో తహసీల్దార్‌ 3-4 రోజులపాటు గ్రామ పెద్దలు, సంబంధిత పట్టాదారులు, పొరుగు భూముల యజమానులతో సమావేశాలు నిర్వహించాలి. అందుబాటులో ఉన్న రెవెన్యూ రికార్డులు, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించి సాధ్యమైనంతవరకూ పరస్పర అంగీకారంతో సమస్యలను పరిష్కరించాలి. అయితే.. పరస్పర అంగీకారం కుదిరినంత మాత్రాన యథేచ్ఛగా రికార్డులను మార్చడానికి వీల్లేదు. సంబంధిత వివరాలను భౌతికంగా పరిశీలించి, చట్టబద్థమైన విధానంలోనే సవరణలు చేయాలి. ప్రతి పట్టాదారుకూ ప్రత్యేక ఖాతా, ప్రత్యేక ఎల్‌పీఎం రూపొందించడమే దీని ఉద్దేశం.


ఆర్డీవోలు, అదనపు కలెక్టర్ల తనిఖీలు

గ్రామస్థాయి పరిశీలన అనంతరం తహసీల్దార్‌ అవసరమైన మార్పులను పరిశీలించి ఆమోదించాలి. గ్రామసభల్లో కుదిరిన పరస్పర అంగీకారాలు, నిర్ణయాలను సర్వే షేప్‌ ఫైల్స్‌, కో-రిలేషన్‌ స్టేట్‌మెంట్లలో పొందుపరచాలి. ఆ తర్వాత మండల సర్వేయర్‌ తెలంగాణ సర్వే అండ్‌ బౌండరీస్‌ చట్టం-1923లోని సెక్షన్‌ 9(2) కింద నోటీసులు జారీ చేయాలి. ఈ నోటీసుల అనంతరం వచ్చే అప్పీళ్ల గడువులో ఆర్డీవోలు, అదనపు కలెక్టర్లు (రెవెన్యూ).. రీసర్వే చేసిన గ్రామాల్లో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించాలి. రైతులు లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలించాలి. రికార్డుల్లోని విస్తీర్ణం, వాస్తవ స్వాధీనంలోని విస్తీర్ణాన్ని అందుబాటులో ఉన్న రెవెన్యూ రికార్డులు, చట్టపరమైన నిబంధనల ఆధారంగా సరిపోల్చాలి. ఉమ్మడి ఖాతాల ఉపవిభజనకు కూడా అవసరమైన సూచనలు చేయాలి.


ఆ తర్వాతే భూభారతిలో మార్పులు

అప్పీళ్ల గడువు పూర్తయి.. వచ్చిన అభ్యంతరాలు, అప్పీళ్లు పరిష్కారమైన తర్వాతే తుది గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయాలి. అప్పీళ్ల సమయంలో ఉమ్మడి ఎల్‌పీఎంల విభజన, పరస్పర అంగీకారంతో జరిగిన భూముల విస్తీర్ణ సవరణలను మళ్లీ కొలిచి సర్వే రికార్డుల్లో పొందుపరచాలి. ఈ మార్పులను తనిఖీ అధికారులు పరిశీలించి ధ్రువీకరించాలి. జిల్లా సర్వే, భూమి రికార్డుల సహాయ సంచాలకుడు లేదా ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే తుది గెజిట్‌ ప్రక్రియను చేపట్టాలి. తుది గెజిట్‌ ప్రచురణ అనంతరం సంబంధిత తహసీల్దార్‌ భూభారతి చట్టం-2025లోని నిబంధనల ప్రకారం ఆర్‌వోఆర్‌ రికార్డులను సవరించాలి. రీసర్వేలో నమోదైన మార్పులు భూభారతి పోర్టల్‌లోనూ ప్రతిబింబించేలా చూడాలి.


ఈ కొత్త ఎస్‌వోపీ అమలుతో రీసర్వేలో రైతులకు ముందుగానే సమాచారం అందుతుంది. తమ భూమిని ఏ రోజున కొలుస్తారో తెలుసుకోవచ్చు. కొలతలు పూర్తయిన వెంటనే విస్తీర్ణం తెలుసుకునే అవకాశం ఉంటుంది. రికార్డుల్లో తేడాలుంటే ప్రారంభ దశలోనే అభ్యంతరాలు చెప్పవచ్చు. ఉమ్మడి ఖాతాల సమస్యలను పరిష్కరించుకునే అవకాశం లభిస్తుంది. అప్పీళ్ల సమయంలో ఉన్నతాధికారులు కూడా క్షేత్రస్థాయికి వచ్చి పరిశీలిస్తారు. ముఖ్యంగా రీసర్వే పూర్తయిందనే కారణంతో వెంటనే భూభారతి రికార్డులు మార్చకుండా, సెక్షన్‌ 9(2), సెక్షన్‌ 13 ప్రక్రియలను పూర్తి చేసి, తుది గెజిట్‌ తర్వాతే ఆర్‌ఓఆర్‌ సవరణలు చేపట్టాలని స్పష్టం చేయడం ఈ మార్గదర్శకాల్లో కీలకమైన అంశం.


ఈ వార్తలనూ చదవండి:

భారత్‌కు పాక్ మంత్రి రాక.. మోదీ సర్కారుపై విపక్షాల విమర్శలు

తమిళనాడుకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. కావేరీ నీటి అభ్యర్థన తిరస్కరణ..

Updated Date - Nov 21 , 2026 | 04:08 AM