ఉన్న భూమి వరకే పట్టా!
ABN , Publish Date - Nov 19 , 2026 | 04:29 AM
సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం షాహిద్‌నగర్.. ఇక్కడ రీ సర్వేలో భాగంగా ప్రభుత్వం గత ఏడాది మే నెలలో సర్వే చేసింది.
విస్తీర్ణం కన్నా తక్కువగా వస్తే అంతే భూమికి కొత్త పాస్‌బుక్
భూముల రీ సర్వే తర్వాత అమలుకు నిర్ణయం
విస్తీర్ణం పరంగా గ్రామాల్లో భారీగా తేడాలు
సర్దుబాటుకు రైతులు ఒప్పుకొంటారా? డౌటే!
సంగారెడ్డి జిల్లా షాహిద్నగర్లో గందరగోళం
ఆ ఊర్లో 94.65 శాతం కమతాల విస్తీర్ణంలో తేడాలు
44.79 శాతం మంది రైతులకు రికార్డులో ఉన్న విస్తీర్ణం కన్నా తక్కువగా భూములు
355 పాస్ పుస్తకాల్లో క్షేత్రస్థాయి సర్వేతో సరిపోయినవి 19 పుస్తకాలు మాత్రమే
తొలిదశలో 416 గ్రామాల్లో రీ-సర్వే పూర్తి
హైదరాబాద్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం షాహిద్‌నగర్.. ఇక్కడ రీ సర్వేలో భాగంగా ప్రభుత్వం గత ఏడాది మే నెలలో సర్వే చేసింది. ఇక్కడి 355 మంది రైతుల భూముల వివరాలను పరిశీలిస్తే 19 మంది రైతుల భూములు మాత్రమే రెవెన్యూ రికార్డుల్లో ఉన్న వివరాలతో సరిపోయాయి. రికార్డుల్లో ఉన్న భూమి కన్నా ఎక్కువ భూమి కలిగి ఉన్న రైతులు 177 మంది (49.86శాతం) ఉన్నారు. తక్కువ భూమి ఉన్న రైతులేమో 159 మంది (44.79శాతం)గా తేలారు. అంటే మొత్తం రైతుల్లో రికార్డుల్లో ఉన్న వివరాల ప్రకారం భూమి ఉన్న రైతులు వందకు ఐదుగురిగా (5.35శాతం) తేలారు.
మొత్తంగా ఆ గ్రామంలో రికార్డులకు, క్షేత్రస్థాయిలో సాగులో భూములకు సంబంధించి తేడాలున్న రైతులు ఏకంగా 94.65శాతం ఉన్నారు! సమగ్ర భూముల రీసర్వేలో భాగంగా తొలి విడతలో 2,720 గ్రామాల్లో సర్వే చేయాలని నిర్ణయించారు. వెయ్యి గ్రామాల్లో ఇప్పటికే సర్వే ప్రారంభమైంది. వీటిలో 416 గ్రామాల్లో సర్వే పూర్తయింది. చాలా గ్రామాల్లో షాహిద్నగర్లో మాదిరిగా భారీగా తేడాలు ఉన్నట్లు సమాచారం. ఒకపక్క రికార్డుల నవీకరణ, మ్యాప్‌తో కూడిన కచ్చితమైన రికార్డుల కల్పన, భవిష్యత్తులో వివాదాల్లేని భూ రికార్డుల నిర్వహణ చేయాలన్న లక్ష్యంతో చేపట్టిన ఈ రీసర్వే.. విస్తీర్ణంలో ఇంత భారీ ఎత్తున తేడాలు రావడంతో ఆ మేరకు రైతులను ఒప్పించి రికార్డులు సరిచేయడం కత్తిమీద సాములాంటిదేనని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
‘ఉన్న’ భూమికే పట్టా
భూముల రీ సర్వే తర్వాత ఎవరికి ఎంత భూమి ఉంటే అంతమేరకే చట్టబద్ధమైన హక్కులు కల్పించాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. ఏ సర్వే నంబరులో ఎంత భూమి ఉంది? ఆ సర్వే నంబరులో రెవెన్యూ రికార్డుల ప్రకారం హక్కుదారులకు ఎంత ఉంది? అన్నదే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఒకవేళ పాస్‌బుక్‌లో పదెకరాలు ఉండి.. సాగుబడిలో 11ఎకరాలు ఉంటే.. ఆ పదెకరాల వరకు మ్యాప్ తయారుచేసి.. హద్దులు నమోదుచేసి కొత్త పాస్‌బుక్‌లు ఇస్తారు. పాస్‌బుక్‌లో పదెకరాలుండి సాగుబడిలో తొమ్మిదెకరాలే ఉంటే.. అది ఇతరుల భూమిలో ఎక్కడైనా కలిసి ఉందా? అన్నది పరిశీలిస్తారు. ఆ రైతు పాత సేత్వారు కాలం నుంచీ పదెకరాలకు పట్టాదారు అయితే.. ఆ తగ్గిన ఎకరం ఎక్కడ? అన్నది రీ సర్వేలో వెతుకుతారు. అతను తన పాస్బుక్లోనే ఉన్నదానికంటే ఎక్కువుగా నమోదు చేయించేసుకున్నాడని తేలితే ఆ రైతు పాస్‌బుక్‌లో తొమ్మిదెకరాల విస్తీర్ణాన్నే నమోదు చేస్తారు. ఒక గ్రామంలో రికార్డుల్లో ఉన్నదానికంటే కొంతమందికి ఎక్కువ భూమి, మరికొంత మందికి తక్కువ భూమి ఉంటే రెవెన్యూ అధికారుల సమక్షంలో చర్చలు చేసి పరిష్కరించుకునే అవకాశం ఇస్తారు.
వ్యత్యాసాలకు ప్రధాన కారణాలు ఇవే
రైతుల భూములకు సంబంధించి రికార్డులకు-సాగుబడిలో ఉన్నదానికి వ్యత్యాసాలు ఎందుకు వస్తున్నాయి? దీనికి కారణాలను అధికారులు చెబుతున్నారు. చాలా గ్రామాల్లో స్మశాన స్థలాలు, జలవనరుల ఆస్తులు (చెరువులు, కుంటలు) ఆక్రమణకు గురయ్యాయి. చాలా వరకు చెరువు భూముల్లో ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్న వారిలో కొందరు పాస్‌పుస్తకాలు సంపాదించి హక్కుదారులుగా చలామణి అవుతున్నారని చెబుతున్నారు. కొన్నిచోట్ల బ్యాంకు నుంచి పంట రుణాలు ఎక్కువగా పొందడం కోసం ఉన్న భూమికన్నా ఎక్కువ విస్తీర్ణం నమోదు చేయించుకున్న వారూ ఉన్నారని సర్వేలో తేలుతోందని చెబుతున్నారు. భూముల రీ సర్వే ద్వారా ఈ తరహా కేసుల్లో హక్కుదారుగా చలామణి అవుతున్న వారికి చట్టబద్ధంగా ఉన్న భూమి ఎంత అనేది తేలిపోతుందని చెబుతున్నారు. ఒకట్రెండు గుంటల భూమిని సాగులో కలుపుకొని ఉంటే అలాంటి విషయాల్లో చూసీచూడనట్లు వ్యవహరించాలని అధికారులు భావిస్తున్నారు.
విస్తీర్ణం తక్కువ ఉండటానికి కూడా కారణాలు కనిపిస్తున్నాయి. గతంలో ఒక వందెకరాలు ఒకే వ్యక్తి దగ్గర ఉండి ఉంటే.. ఆ తర్వాత దాన్ని పదెకరాల చొప్పున పది మంది కొనుగోలు చేశారనుకుందాం. వీరంతా తమ భాగానికి వచ్చిన కమతాల్లోకి వెళ్లేందుకు ఐదారడుగులు కాలిబాటలుగా, 10-15అడుగులు బండి బాటలకు వదులుకుంటూ వచ్చారు. అదే సమయంలో ఆయా భూముల గుండా సాగునీటి కాలువలూ వచ్చాయి. అవి ఎంత మేరకు ఉన్నాయో ఆ మేరకు వారి పదెకరాల్లోంచి తగ్గినట్లే. తాజాగా ఆ తగ్గిన భూమికే మ్యాప్ ఇచ్చి.. దాన్ని రికార్డుల్లో నమోదు చేస్తారు. ఎందుకంటే కాలిబాటలు, బండి బాటలు భూమిలో కలిపి చూపిస్తే.. రేపు లోపలి పొలాల్లోకి వెళ్లేందుకు దిగువనున్న రైతులకు సమస్యగా మారొచ్చు. కాగా రీసర్వేలో భూమి విక్రయాల నమోదులో లోపాలు, సబ్ డివిజన్ల సమస్య.. ఒక సర్వే నంబర్ నుంచి కొత్త సబ్ డివిజన్ సృష్టించినా పాత రికార్డుల్లో మార్పులు చేయకపోవడంతోనూ గందరగోళ పరిస్థితి ఎదురవుతోందంటున్నారు.
కాగా నిజాంకాలం నాటి 1936 భూ రికార్డుల ఆధారంగా కొనసాగుతున్న సర్వే మ్యాప్‌లను ప్రస్తుత భూ పరిస్థితులతో పోల్చి చూడటం అధికారులకు సవాలుగా మారుతోంది. చాలాచోట్ల టిప్పన్లు పాడైపోయాయి. దాదాపు 125 ఏళ్ల తర్వాత సర్వే చేపడుతున్న తరుణంలో రికార్డులకు, వాస్తవ పరిస్థితులకు మధ్య విస్తీర్ణంలోని వ్యత్యాసాలు అధికారులకు సవాలుగా మారుతున్నాయి. రీ సర్వే విజయవంతమవ్వాలంటే ఆధునిక సర్వే పరికరాలు, సాంకేతికత సరిపోదని.. పాత రికార్డుల నాణ్యత, స్పష్టత కూడా ముఖ్యమని అధికారులు చెబుతున్నారు. డీజీపీఎస్ సిగ్నల్ వ్యత్యాసాలు, కొలతల్లో తేడాలు, పాత మ్యాపుల్లో స్పష్టత లేకపోవడం, హద్దుల గుర్తింపులో సమస్య, జీఐఎస్ మ్యాప్‌లలో తప్పు లేయర్లు, భూముల వర్గీకరణలో తేడాలు, సర్వే నంబర్ల డేటా అనుసంధానంలో లోపాలు, ఒకే భూమికి వేర్వేరు వివరాలు నమోదు చేయడం, చాలా చోట్ల సబ్ డివిజన్ మ్యాప్‌లు లేకపోవడం సర్వే సిబ్బందికి సమస్యగా ఉందని చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మొన్నే బుల్లెట్ దిగాల్సింది.. కానీ కొంచెంలో మిస్ అయ్యింది: ఎమ్మెల్యే కోమటిరెడ్డి
ఇందిరమ్మ కుటుంబ బీమా అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: సీఎస్ ఆదేశం
Read Latest Telangana News And Telugu News