వేశ్యాగృహాల నిర్వాహకులు, బాధితులు ఒక్కటి కాదు
ABN , Publish Date - Nov 19 , 2026 | 05:25 AM
వేశ్యాగృహాల నిర్వాహకులను.. మానవ అక్రమ రవాణా బాధితులను సమానంగా చూడలేమని తెలంగాణ హైకోర్టు పేర్కొంది.
బాధితులు ఉండే రక్షిత గృహాల్లో నిర్వాహకులను ఉంచితే ప్రమాదం: హైకోర్టు
హైదరాబాద్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): వేశ్యాగృహాల నిర్వాహకులను.. మానవ అక్రమ రవాణా బాధితులను సమానంగా చూడలేమని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. బాధితులు ఉండే రక్షిత గృహాల్లో నేరస్థులను, వేశ్యాగృహాల నిర్వాహకులను ఉంచితే బాధితులకు ప్రమాదం ఏర్పడుతుందని తెలిపింది. వీరికి వేర్వేరు నిర్భంధ కేంద్రాలు ఉండాలని స్పష్టంచేసింది. పలు నేరాల్లో నిందితురాలిగా ఉన్న ఒక వేశ్యాగృహ నిర్వాహకురాలిని, లైంగిక దోపిడీకి గురైన బాధితులు ఉండే రక్షిత గృహంలో ఉంచాలని నాంపల్లి మేజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రజ్వల అనే స్వచ్ఛంద సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్‌పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్‌కోషీ, జస్టిస్ నర్సింగ్‌రావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. వేశ్యాగృహాల నిర్వాహకులను, బాధితులను ఒకే రక్షిత గృహం లేదా సంస్థలో ఉంచరాదని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పోలీస్‌స్టేషన్లకు ఎస్‌వోపీ పంపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వేశ్యాగృహాల కోసం ఇళ్లు అద్దెకు ఇవ్వకుండా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని పేర్కొంది. అలాగే జిల్లాలవారీగా చట్టబద్ధంగా నిర్వహిస్తున్న రక్షిత గృహాలు, ఎన్జీవో సంస్థలను గుర్తించాలని సూచించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం
బాబా బర్త్‌డే స్పెషల్.. బెంగళూరు-ధర్మవరం మధ్య ప్రత్యేక ప్యాసింజరు రైలు
Read Latest Telangana News And Telugu News