Share News

100 ఎకరాల్లో.. వందేళ్ల భవిష్యత్తు!

ABN , Publish Date - Apr 06 , 2026 | 05:11 AM

అందరికీ న్యాయం అనే లక్ష్యంతో ప్రతి రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేయాలని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. కానీ, ఆ లక్ష్యం సాకారం కావాలంటే సరైన మౌలిక వసతులు అవసరం.

100 ఎకరాల్లో.. వందేళ్ల భవిష్యత్తు!

  • తెలంగాణ హైకోర్టు దేశంలోనే అత్యుత్తమం కానుంది

  • ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది

  • డైనమిక్‌ సీఎం రేవంత్‌రెడ్డి కృషి అభినందనీయం

  • రూ.2500 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశారు

  • సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌

  • జోన్‌-2 భవనాలకు శంకుస్థాపన చేసిన సీజేఐ

  • సాధారణ పౌరుడికి చివరి ఆశ కోర్టు న్యాయవ్యవస్థకు అత్యున్నత గౌరవాన్నిస్తాం

  • దేశంలోనే అత్యుత్తమ హైకోర్టు భవనాన్ని సకల సౌకర్యాలతో విశాలంగా నిర్మిస్తున్నాం

  • 2027 డిసెంబరు కల్లా నిర్మాణాలన్నీ పూర్తి: రేవంత్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): ‘‘అందరికీ న్యాయం అనే లక్ష్యంతో ప్రతి రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేయాలని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. కానీ, ఆ లక్ష్యం సాకారం కావాలంటే సరైన మౌలిక వసతులు అవసరం. తెలంగాణలో ఆ లక్ష్యం క్రమంగా ఆచరణలోకి వస్తోంది’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ అన్నారు. రాజేంద్రనగర్‌లో 60 ఎకరాల్లో నిర్మించనున్న హైకోర్టు జోన్‌-2 భవనాలకు ఆయన ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘నా న్యాయ సేవా జీవితంలో ఓ విషయం గమనించాను. ప్రతి కార్యక్రమం మూడు దశల్లో ముందుకు సాగుతుంది. ప్రారంభం లక్ష్యాన్ని తెలియజేస్తుంది. మధ్యస్థ దశ పట్టుదలను చూపిస్తుంది. చివరికి ఫలితం ఆ వాగ్దానం నెరవేరిందా? అనే విషయాన్ని నిర్ధారిస్తుంది. ప్రస్తుతం మనం అలాంటి కీలకమైన దశలో ఉన్నాం. జోన్‌-1 నిర్మాణం కొనసాగుతుండగా, జోన్‌-2కు శంకుస్థాపన చేస్తున్నాం. ప్రజలకు కోర్టు అంటే బెంచ్‌, జాతీయ చిహ్నం, విచారణలు మాత్రమే కనిపిస్తాయి. కానీ, ఆ కోర్టును నడిపించే ఒక పెద్ద వ్యవస్థ వెనక ఉంటుంది. జడ్జిలు నివసించే భవనాలు, శిక్షణ కేంద్రాలు, పాత తీర్పులను భద్రపరచడం ఎంతో కీలకమైన అంశాలు. అలాంటి నిర్మాణాలకు శ్రీకారం చుడుతున్నాం.’


ఇది రాజ్యాంగబద్ధమైన బాధ్యత..

ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు. రాజ్యాంగబద్థమైన బాధ్యత. అందరికీ న్యాయం అనే లక్ష్యంతో ప్రతి రాష్ట్రానికి హైకోర్టు ఏర్పాటు చేయాలని రాజ్యాం గ నిర్మాతలు భావించారు. తెలంగాణలో ఆ లక్ష్యం క్రమంగా ఆచరణలోకి వస్తోంది. 40ఎకరాల్లో జోన్‌-1 పనులు వేగంగా సాగుతున్నాయి. అదే సమయంలో జోన్‌-2 కూడా ప్రారంభమవుతోంది. ఇది చాలా సరై న నిర్ణయం. ఎందుకంటే ప్రస్తుత హైకోర్టు భవనం అవసరాలకు సరిపోవడం లేదు. రాబోయే 100 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్మాణం చేపట్టాలి. పెద్ద చెట్టు నిలబడడానికి వేర్లు ఎంత ముఖ్య మో, ఈ నిర్మాణమూ అంతే ముఖ్యమైనది. సుమా రు 60 ఎకరాల్లో 57 నిర్మాణాలు చేస్తారు. ఇది దేశంలోనే అత్యుత్తమ హైకోర్టు అవుతుందని, ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని విశ్వసిస్తున్నా.

న్యాయ స్వతంత్రతకు వసతులు కీలకం..

న్యాయ స్వతంత్రతకు సరైన వసతులు కూడా కీలకం. మొత్తం 100 ఎకరాల క్యాంప్‌సలో అన్ని విభాగాలు ఒకే ప్రాంగణంలో ఉంటాయి. దీంతో న్యా యవ్యవస్థ స్వతంత్రంగా పనిచేయగలదు. జోన్‌-2లో నిర్మించనున్న ఆడిటోరియం నాకు ప్రత్యేకంగా ప్రియమైనది. ఇక్కడ న్యాయ శిక్షణ కార్యక్రమాలు, సదస్సులు జరుగుతాయి. మూడు అంతస్తుల సెంట్రల్‌ రికార్డు గది కూడా అత్యంత కీలకం. పాత తీర్పుల ప్రతులు భద్రంగా ఉండడం న్యాయ వ్యవస్థ స్థిరత్వానికి అవసరం.


సీఎం రేవంత్‌రెడ్డి కృషి అభినందనీయం..

ఈ ప్రాజెక్ట్‌ 2009లో ప్రారంభమైంది. అప్పుడు జరిగిన అగ్ని ప్రమాదం తర్వాత కొత్త క్యాంపస్‌ అవసరం ఏర్పడింది. 17 ఏళ్ల కృషి తర్వాత ఈ దశకు చేరుకున్నాం. డైనమిక్‌ సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రూ.2500 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయడం అభినందనీయం. న్యాయవ్యవస్థ, ప్రభుత్వం కలిసి పనిచేస్తే రాజ్యాంగం సజీవం గా ఉంటుంది. ఈ నిర్మాణం మన కాలానికే కాదు, భవిష్యత్‌ తరాలకు కూడా. తెలంగాణ ప్రజలు మెరుగైన న్యాయ సదుపాయాలను ఆశించే హక్కు కలిగి ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌ విజయవంతంగా పూర్తయితే, భవిష్యత్‌ తరాలు మన కృషిని గుర్తిస్తాయి.

Updated Date - Apr 06 , 2026 | 06:03 AM