భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
ABN , Publish Date - Sep 22 , 2026 | 06:46 PM
తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడంతోపాటు రోడ్లు, జంక్షన్లలో నీరు నిలవకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వర్షాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని హైడ్రా, పోలీస్ కమిషనర్లు, ఇతర శాఖల అధికారులకు సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
రోడ్లు, ప్రధాన జంక్షన్లలో నీరు నిలవకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూడాలని, ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, సహాయక బృందాలను సిద్ధంగా ఉంచాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. కంట్రోల్ రూమ్‌లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ పరిస్థితిని పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.