భాద్రపదంలో గ్రీష్మం!
ABN , Publish Date - Sep 29 , 2026 | 06:22 AM
దాదాపు మూడు నెలల తర్వాతొచ్చే మార్గశిరం మంచు కురిపిస్తూ హాయి గొలిపే మాసం! ప్రస్తుతం వర్ష రుతువు చివరికొచ్చేసింది. రానున్నదేమో నదులు, కాలువలను తేటనీటితో కళకళలాడించే శరత్కాలం! ఇలా ఎంతో చల్లగా, హాయి గొలిపేలా ఉండాల్సిన వాతావరణం ..
రాష్ట్రంలో రెండ్రోజులుగా మండుతున్న ఎండలు
తుపాను ఎఫెక్ట్ గాయబ్.. మళ్లీ తెరపైకి ఎల్‌నినో
పగలంతా ఉక్కబోత.. రాత్రేమో చలిగాలులు..
భిన్న వాతావరణంతోనే జ్వరాలా?
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
దాదాపు మూడు నెలల తర్వాతొచ్చే మార్గశిరం మంచు కురిపిస్తూ హాయి గొలిపే మాసం! ప్రస్తుతం వర్ష రుతువు చివరికొచ్చేసింది. రానున్నదేమో నదులు, కాలువలను తేటనీటితో కళకళలాడించే శరత్కాలం! ఇలా ఎంతో చల్లగా, హాయి గొలిపేలా ఉండాల్సిన వాతావరణం అలానే ఉందా అసలు? కాల మహిమ అనాలో.. ఇంకేమనాలో గానీ రోహిణి కార్తెలో మాదిరిగా రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి! అంతటా రెండ్రోజులుగా ఇదే పరిస్థితి! నెలకొంది. అల్పపీడన ప్రభావం, ఫలితంగా తుపాను కారణంగా నాలుగు రోజుల క్రితం వర్షాలు పడి.. రాష్ట్రమంతా వాతావరణం చల్లబడింది.
అయితే ఎల్‌నినో ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు కనిపిస్తోంది. పరిస్థితులు వేసవిని తలపిస్తున్నాయి. ఉదయం 10 నుంచే ఎండ దంచికొడుతోంది. ఇళ్లలో కాసేపు కూడా ఫ్యాన్ తిరగకుండా ఉండలేని పరిస్థితి నెలకొంది. భరించలేని ఉక్కబోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొన్నిచోట్ల మూడు రోజుల్లోనే దాదాపు 6 డిగ్రీల మేర ఉష్ణోగ్రత పెరిగింది. పగటి పూట ఎండ, ఉక్కబోత, రాత్రుళ్లేమో చలిగాలులు ఇలా వాతావరణంలో మార్పుల ఫలితంగానో ఏమో జనం జ్వరాల బారిన పడుతున్నారు. జగిత్యాల జిల్లాలోని చాలా మండలాల్లో 37 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత నమోదైంది. కొడిమ్యాల మండలం పూడూరులో 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్టలో 35.4 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్లలో 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మం జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 34 నుంచి 36 డిగ్రీల దాకా నమోదవుతున్నాయి. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సోమూర్‌లో 37.8 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లా మెండోరలో 36.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబాబాద్ జిల్లాలో 36.3 డిగ్రీలు, హనుమకొండ జిల్లాలో 35.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తుపాను ప్రభావంతో కురిసిన వర్షానికి మురిసిపోయిన రైతులే ఇప్పుడు మండుతున్న ఎండలకు పంటల పరిస్థితి ఏమవుతుందోనని కలవరపడుతున్నారు.
వార్తలు కూడా చదవండి:
జీహెచ్‌ఎంసీ, స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
రాముడికి.. శివుడికి మధ్య రాజకీయ విభజన సరికాదు
Read Latest AP News And Telangana News And International News And Telugu New