ఓటర్ల నమోదులో ఇంత జాప్యమా?
ABN , Publish Date - Oct 24 , 2026 | 04:39 AM
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ఓటర్ల నమోదును వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ నేతలకు, ఆయా జిల్లాల ఇన్‌చార్జులకు సూచించారు.
ఇంకా 64 శాతం ఓటర్ల నమోదు పెండింగ్‌లోనే..
ఇలా అయితే ఎలా గెలుద్దామనుకుంటున్నారు?
సానుభూతిపరులను వేగంగా నమోదు చేయించాలి
రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ఓటర్ల నమోదుపై సీఎం రేవంత్ సూచన
బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందాలు
కాంగ్రెస్‌ను దొంగ దెబ్బ తీయడానికి కుట్రలు
ప్రధాని మోదీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
నవంబర్ 1న ఢిల్లీలో జరిగే ఉద్యమంలో
తెలంగాణ తడాఖా ఏంటో చూపిద్దాం
15 వేల మందికి పైగా వెళదాం: రేవంత్
హైదరాబాద్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ఓటర్ల నమోదును వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి.. కాంగ్రెస్ నేతలకు, ఆయా జిల్లాల ఇన్‌చార్జులకు సూచించారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం ఓటర్ల నమోదు చాలా తక్కువగా జరిగిందని,. ఇలా అయితే ఎలా గెలుద్దామనుకుంటున్నారని ప్రశ్నించారు. శుక్రవారం ప్రజాభవన్‌లో టీపీసీసీ ఆధ్వర్యంలో మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు. 2021లో మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో 5,31,268 ఓట్లు ఉన్నాయని, ప్రస్తుతం 1,91,365 ఓట్లే నమోదయ్యాయని అన్నారు.
అప్పటి ఓట్లతో పోల్చుకుంటే ప్రస్తుతం 36 శాతమే నమోదయ్యాయన్నారు. ఇక వరంగల్-ఖమ్మం-నల్లగొండ గ్రాడ్యుయేట్ స్థానంలోనూ 2021లో 5,05,565 ఓట్లు ఉంటే, ప్రస్తుతం 2,44,349 (49 శాతం) మాత్రమే నమోదు చేశారని తెలిపారు. ఈ రెండు స్థానాల్లో 7 లక్షల ఓట్లను టార్గెట్‌గా పెట్టుకుని నమోదు చేయించాలని సూచించారు. అయితే ఎవరిని పడితే వారిని ఓటర్లుగా నమోదు చేయించకూడదని, అలా చేయిస్తే.. ఇటీవల తమిళనాడులో జరిగినట్లుగా జరుగుతుందని అన్నారు. అక్కడ డీఎంకే కష్టపడి అందరినీ ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్తే.. వాళ్లంతా విజయ్‌కు ఓటేశారని చెప్పారు. పార్టీ సానుభూతిపరులనే తీసుకెళ్లాలన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థులను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, సీడబ్ల్యూసీ ఖరారు చేసిందని, హైకమాండ్ నిర్ణయం తీసుకున్నాక వాదనలకు ఆస్కారం లేదన్నారు. వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.
బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య చీకటి ఒప్పందాలు..
బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు రెండూ కలిసి కాంగ్రె్‌సను దొంగ దెబ్బ తీయడానికి కుట్రలు చేస్తున్నాయని సీఎం రేవంత్ ఆరోపించారు. ఇందుకోసం చీకటి ఒప్పందం చేసుకుంటున్నాయన్నారు. పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సర్పంచ్ ఎన్నికల్లో 66 శాతం, మున్సిపల్ ఎన్నికల్లో 85 శాతం గెలిచామని, సమన్వయంతో పనిచేసినందునే పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. జూబ్లీహిల్స్, కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లోనూ అలాగే గెలిచామన్నారు. ఆ రెండు ఉప ఎన్నికల్లో కేటీఆర్ డబ్బులిచ్చి బెట్టింగ్ కూడా కట్టిచ్చారని, అయినా కాంగ్రెస్సే గెలిచిందని అన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను అభ్యర్థులకే వదిలేయకుండా.. పార్టీ భుజాలపై మోయాలని, గెలుపు సాధించాలని సూచించారు. ఎన్నికలు లేని జిల్లాల వారికీ కొంత బాధ్యత ఇస్తామని, కార్యాచరణను పార్టీ తెలుపుతుందని చెప్పారు.
ఎస్‌ఐఆర్ ద్వారా గెలవాలనుకుంటున్నారు..
ప్రధాని నరేంద్రమోదీ.. కులం, మతం, ప్రాంతం, ఈడీ, ఇన్‌కమ్ ట్యాక్స్ పేరుతో భయపెట్టి, బెదిరించి రాష్ట్రాలను, కేంద్రాన్ని గెలుస్తూ వచ్చారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అయితే ఇప్పుడు దేశంలో నిరుద్యోగ సమస్య తాండవం చేస్తోందని, ఓటుహక్కు అంశంపై మోదీపై జెన్-జీల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిపారు. దీంతో మోదీ అధికారం జెన్‌జీ ఎదుట జంతర్ మంతర్ వద్ద తలొగ్గాల్సిన పరిస్థితి వచ్చిందని, అందుకే ఈసారి ఎస్‌ఐఆర్ ద్వారా గెలవాలనుకుంటున్నారని ఆరోపించారు. దేశంలో ఓటుహక్కు ఉన్న ఆగర్భ శ్రీమంతులు, ఓటు హక్కు లేని దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మహిళలు అనే రెండు తరహాల్లో పౌరులను తయారు చేస్తున్నారని రేవంత్ ధ్వజమెత్తారు.
వీరంతా మోదీకి వ్యతిరేకంగా ఉన్నందునే వారి ఓట్లు తొలగించి.. ఓటు ఉన్న శ్రీమంతులతో గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. మోదీ మూడోసారి ప్రధాని అయిన ఎన్నికల సమయంలో ఉన్న 97 కోట్ల ఓట్లలో ఇప్పటికే దాదాపు 13 కోట్ల ఓట్లను తొలగించారని తెలిపారు. దాంతో దేశంలో ఓట్ల సంఖ్య 84 కోట్లకు పడిపోయిందన్నారు. 140 కోట్ల జనాభా ఉన్న ప్రస్తుత సమయంలో నాలుగోసారి ప్రధాని కావడానికి 80 కోట్ల లోపు ఓట్లకు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. బెంగాల్ తరువాత తెలంగాణ అని బీజేపీ నేతలు అంటున్నారని, తెలంగాణకు ఏమిచ్చారని వస్తారని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏమి చేశారని బీజేపీకి ఓటేస్తారని అన్నారు. ఎస్‌ఐఆర్‌ను సాకుతో వద్దామనుకుంటున్నారని విమర్శించారు.
రామ్‌లీలా మైదానంలో తెలంగాణ తడాఖా చూపిద్దాం
‘‘వందేళ్ల క్రితం జరిగిన ‘సైమన్ గో బ్యాక్’పై తిరుగుబాటు తరహాలోనే ఇప్పుడు బ్రిటిష్ జనతా పార్టీ (బీజేపీ) ద్వారా వచ్చిన జ్ఞానేశ్ కమిషన్‌ను ‘జ్ఞానేష్ గో బ్యాక్’ అంటున్నాం’’ అని సీఎం రేవంత్ అన్నారు. ఈ నినాదంతో నరేంద్రమోదీ నుంచి దేశానికి విముక్తి కలిగించేందుకు రాహుల్‌గాంధీ పెద్ద కార్యక్రమం తీసుకున్నారని చెప్పారు. ‘‘నవంబరు 1న రామ్‌లీలా మైదానంలో జరిగే ఉద్యమానికి మనవంతు భాగస్వామ్యులం కావాలి. తెలంగాణ నుంచి 15 వేల మంది రావాలన్నారు. వాళ్లు అడిగిన దానికంటే ఎక్కువే వెళ్లాలి. ఆ రోజు మన తడాఖా చూపిద్దాం. మన గళం-బలం చూపిద్దాం’’ అని సీఎం పిలుపునిచ్చారు. ఆ గర్జనతో ఢిల్లీలోని ఎర్రకోటపై కాంగ్రెస్ జెండాను ఎగరవేయించాలన్నారు.
జయప్రదం చేద్దాం: మహేశ్
నవంబరు 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న మెగా ర్యాలీని విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ర్యాలీకి పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేయాలన్నారు. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సమావేశంలో సూచించారు.
ఇవి కూడా చదవండి..
ఎల్‌నినో ప్రభావంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి: సీఎస్ సంజయ్ జాజు
Read Latest Telangana News And Telugu News