Share News

జూలై దాకా కరువే!

ABN , Publish Date - Oct 24 , 2026 | 04:21 AM

ఎల్‌నినో ప్రభావంతో చిన్నగా మొదలైన కరువు సమస్య.. వచ్చే ఏడాది జూలై వరకూ కొనసాగనుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

జూలై దాకా కరువే!
Revanth Reddy drought warning

  • అప్పటికి సాధారణ వర్షపాతం నమోదైతేనే ఊరట

  • రానున్న 9 నెలలూ అత్యంత ప్రమాదకర పరిస్థితులు

  • ఎండాకాలం తాగడానికి చుక్కనీరు దొరక్కపోవచ్చు

  • ఈ పరిస్థితిని దాచితే క్యాన్సర్‌లా తయారవుతుంది

  • రానున్న ముప్పును ప్రజలందరికీ వివరించండి

  • నాటి విపత్కరం కరోనా.. నేటి విపత్కరం ఎల్‌నినో

  • కాంగ్రెస్‌ తెచ్చిన కరువంటూ హరీశ్‌రావు చేస్తున్న

  • తప్పుడు ప్రచారాన్ని కాంగ్రెస్‌ శ్రేణులు తిప్పికొట్టాలి

  • సంక్రాంతి తర్వాత ప్రజలకు పని కల్పించేందుకు

  • ప్రత్యేక ప్రణాళిక.. నేతలంతా గ్రామాలకు వెళ్లాలి

  • మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,

  • కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో చిన్నగా మొదలైన కరువు సమస్య.. వచ్చే ఏడాది జూలై వరకూ కొనసాగనుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ కరువు ప్రభావంతో రానున్న 9 నెలలూ అత్యంత ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొనబోతున్నామని చెప్పారు. వేసవికాలంలో బయటకు వెళ్లలేని పరిస్థితులు ఏర్పడతాయని, తాగటానికి చుక్క నీరు కూడా దొరకని పరిస్థితి రాబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిజాన్ని దాచి పెడితే క్యాన్సర్‌లా బాధపడాల్సి వస్తుందని, అందుకే దాచకుండా ప్రజలకు చెప్పాలని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్‌ ముఖ్యనాయకులకు సూచించారు.


శుక్రవారం వారితో ప్రజాభవన్‌లో ఎల్‌నినో పరిస్థితులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, ఢిల్లీలో ఎస్‌ఐఆర్‌ వ్యతిరేక ర్యాలీకి సన్నద్ధతపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులపై గత ఆరు నెలల నుంచీ ప్రజల్ని అప్రమత్తం చేస్తూ వస్తున్నామని గుర్తు చేశారు. ‘‘ఇది కాంగ్రెస్‌ తెచ్చిన కరువంటూ హరీశ్‌రావు రాజకీయ దురుద్దేశంతో కూడిన ప్రకటనలు చేస్తున్నడు. యూకేతో సహా ప్రపంచంలోని వంద దేశాల్లో ఎల్‌నినో ప్రభావం ఉంది. ఒక్కో ఊరు.. ఒక్కో మండలం, ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలాగా దీని ప్రభావం ఉండవచ్చు. తెలంగాణలోనే ఉత్తర తెలంగాణలో ఒకలాగా.. దక్షిణ తెలంగాణలో మరోలా ఉంది. ఏపీలో ఒకలా, మహారాష్ట్రలో మరోలా, కేరళ, కర్ణాటక, తమిళనాడుల్లో ఇంకో రకంగా ఉంది. ఈ వంద దేశాలకు, ఇన్ని రాష్ట్రాలకు చెందిన వారంతా హరీశ్‌రావు కంటే తెలివి తక్కువోళ్లా? గత 75 ఏళ్లలో చూడని కరువు ఇది. అత్యంత అభివృద్ధి చెందిన దేశాలూ ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. మహారాష్ట్రలోని కచ్‌ ప్రాంతంలో ఇప్పటికే ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తూ.. అందులోనూ రేషన్‌ విధానం పెట్టారు. ప్రతి మనిషీ తన నీటి వినియోగం కనీసంగా 20 శాతం తగ్గించుకోవడం తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలను రూపొందిస్తున్నారు’’ అని సీఎం రేవంత్‌ వివరించారు.


తాగునీటికీ కటకట తప్పదు..

ఎల్‌నినో ప్రభావంతో ఎండ వేడిమి పెరిగి.. ఉన్న నీరు ఆవిరి అవుతూ ఉంటుందని, సాగునీటి మాట అటుంచి తాగునీటికీ కటకట ఏర్పడుతుందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు అవగాహన కల్పించకుండా కరువు పరిస్థితిని ఎదుర్కొనడం అసాధ్యమన్నారు. అందుకే ఈ అంశాన్ని శాసనసభలో చర్చకు పెట్టడమే కాకుండా మంత్రివర్గ ఉపసంఘాన్నీ వేశామని తెలిపారు. గతంలో కరోనాపై కేసీఆర్‌ బాధ్యత లేని మాటల వల్లే వేలాది మంది చనిపోయారని రేవంత్‌ ఆరోపించారు. కరోనా వచ్చినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్‌ బాధ్యత లేకుండా వ్యవహరించారన్నారు.


‘‘శాసనభలో కరోనాపై చర్చ సందర్భంగా 30 డిగ్రీల ఎండ కొడితే కరోనా చచ్చి ఊరుకుంటదని, ఎక్కువైతే పారాసిటమాల్‌ వేసుకుంటే పోతుందంటూ కేసీఆర్‌ దబాయించి మాట్లాడిండు. చివరకు ఏమైంది? లక్షల మంది చనిపోయారు. కరోనాతో చనిపోయిన వారిని దహనం, ఖననం చేయడానికి స్మశానాల్లో చోటు దొరకని పరిస్థితి ఏర్పడింది. కేసీఆర్‌ను దైవాంశ సంభూతుడని బావించి.. కరోనాపై ఆయన బాధ్యత లేని మాటలను నమ్మి బయటికి వెళ్లినవారు స్మశానానికి వెళ్లారు. నమ్మని మనం.. ఇక్కడ సమావేశంలో కూర్చుని మాట్లాడుకుంటున్నం’’ సీఎం వ్యాఖ్యానించారు. అలాగే.. ఇది కాంగ్రెస్‌ తెచ్చిన కరువంటూ హరీశ్‌రావు చెప్నిన మాటలు నమ్మి.. సాగునీరు వస్తుందని ఊహించుకుని పంటలు వేస్తే రైతులు నష్టపోవాల్సి వస్తుందన్నారు. ఈ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని మంత్రులు, కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులకు సూచించారు.


సిద్ధాంతాలు వేరైనా కరోనా సమయంలో ప్రధాని మోదీకి అందరమూ సహకరించామని గుర్తు చేశారు. వ్యాక్సిన్‌ వచ్చాక ఆ ఉపద్రవం నుంచి బయటపడ్డామన్నారు. ఆనాడు ప్రకృతి సృష్టించిన విపత్కర పరిస్థితి కరోనా అయితే.. ఈనాటి విపత్కర పరిస్థితి ఎల్‌నినో కరువన్నారు. కరువు, విద్యుత్తు విషయంలో తమ ప్రభుత్వం అద్భుతంగా పనిచేసిందని సీఎం రేవంత్‌ అన్నారు. అయితే ఈ అద్భుత విజయాన్ని చెప్పుకోవడంలో వెనుకాముందు అవుతున్నామన్నారు. ఈ సీజన్‌లో ఎప్పుడూ రాష్ట్రంలో 14 వేల మెగావాట్లకు మించి విద్యుత్తు వినియోగం జరగలేదని, కానీ.. ఈ ఏడాది 20 వేల మెగావాట్ల పైచిలుకు విద్యుత్తు వినియోగం జరిగిందని తెలిపారు.


ఏకంగా 20 శాతం వినియోగం పెరిగినా.. అప్పులు తెచ్చి, రకరకాల ప్రయత్నాలు చేసి రైతులకు విద్యుత్తు అందించగలిగామని, వానాకాలం పంటలను బయట పడేయగలిగామని చెప్పారు. సీజన్‌కు ముందే 33 సన్న వరి రకాలకు బదులు.. డిమాండ్‌ ఉన్న ఏడు సన్న వరి రకాలకు మాత్రమే బోనస్‌ ఇస్తామని ప్రకటించామని, ఈ విషయంలోనూ తమను బదనాం చేసేందుకు కేటీఆర్‌, హరీశ్‌రావు ప్రయత్నించారని అన్నారు. అయితే ప్రస్తుతం డిమాండ్‌ ఉన్న ఏడు సన్న వరి రకాలకు మార్కెట్లో క్వింటాలుకు రూ.3,500 నుంచి రూ.4,500 వరకు ధర పలుకుతోందని, ఇతర రాష్ట్రాల నుంచీ వ్యాపారులు వచ్చి రైతులకు అడ్వాన్సులు ఇచ్చి పోతున్నారని తెలిపారు. మద్దతు ధర, బోనస్‌ ఇచ్చి కొందామన్నా ప్రభుత్వానికి ఆ ఏడు సన్నరకాలు దొరకడం లేదన్నారు. ‘‘సన్నబియ్యం ధర పెరగడానికీ కాంగ్రెస్సే కారణమని హరీశ్‌రావు అంటున్నడు. క్వింటాలు రూ.4,500 పెట్టి కొన్నవాడు లాభం వేసుకునే అమ్ముతడు కదా? బియ్యం ధర ఆటోమేటిక్‌గా పెరుగుతది కదా? ఈ మాత్రం అవగాహన హరీశ్‌కు లేదా?’’ అని మండిపడ్డారు.


సాగుకు నీరు అసాధ్యం!

కరువు పరిస్థితుల్లో సాగుకు నీరు, నిరంతరంగా విద్యుత్తు ఇవ్వడం అసాధ్యమని సీఎం రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30 లక్షల వరకు బోరుబావులు ఉంటే అందులో సగం బోరుబావులు ఇప్పటికే ఎండిపోయాయన్నారు. అప్పో.. సప్పో చేసి వ్యవసాయానికి విద్యుత్తు ఇచ్చినా.. పంట పొట్టకు వచ్చేనాటికి భూమిలో నీళ్లు ఉండవన్నారు. కృష్ణా రిజర్వాయర్లలో 20 శాతం మేరకు కూడా నీటి నిల్వలు లేవని, ప్రాజెక్టుల్లో నీళ్లు డెడ్‌ స్టోరేజీలో ఉన్నాయని తెలిపారు. వచ్చే ప్రతి చుక్క నీటినీ ఒడిసి పట్టుకుని తాగునీటి అవరాలు తీర్చుకోవడం తప్ప ఇంకో అవకాశమే లేదన్నారు. ఈ సమస్యకు వచ్చే జూన్‌, జూలై నెలల్లో సాధారణ వర్షపాతం నమోదైతే తప్ప.. పరిష్కారం దొరకదన్నారు.


అప్పుడూ వర్షాలు పడకుంటే కొత్త సమస్య మొదలవుతుందన్నారు. చిన్నపాటి నీటి వనరులు ఉంటే ఆరుతడి పంటలు, కూరగాయలు పండించుకోవాలని రైతులకు సూచించారు. రైతు వేదికల వద్ద ప్రతి 15 రోజులకోసారి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఈ పరిస్థితిని వివరించాలని మంత్రి తుమ్మలకు సూచించారు. విద్యుత్తు కొందామన్నా మార్కెట్లో అందుబాటులో లేదని, అందుకే ఈ విషయంలో స్వీయ నియంత్రణ ఉండాలని సీఎం అన్నారు. అవసరం లేకపోతే పగలు ట్యూబ్‌లైట్లు వేసుకోవద్దని, ప్రభుత్వ ఆఫీసుల్లో ఏసీలు తగ్గించుకుని పొదుపు మంత్రాన్ని పాటించాలని సూచించారు.


విమర్శలు విచారకరం: భట్టి

ఎల్‌నినో విపత్కర పరిస్థితుల్లో ప్రజలను అప్రమత్తం చేయడం అందరి బాధ్యత అని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. ప్రజలకు అండగా నిలవాల్సిన సమయంలో బీజేపీ-బీఆర్‌ఎస్‌ విమర్శలు చేయడం విచారకరమన్నారు.


ఇవి కూడా చదవండి..

తెలంగాణలో కరవుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణం: కేటీఆర్

ఎల్‌నినో ప్రభావంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి: సీఎస్ సంజయ్ జాజు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 24 , 2026 | 04:25 AM