ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..
ABN , Publish Date - Aug 14 , 2026 | 04:14 PM
ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (TDR)పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీడీఆర్ జారీ, వినియోగ నిబంధనల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్: ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్ (TDR)పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీడీఆర్ జారీ, వినియోగ నిబంధనల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు G.O.Ms.No.218 ద్వారా తెలంగాణ బిల్డింగ్ రూల్స్-2012లో సవరణలు చేసింది. దీని ద్వారా హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (HMDA) పరిధిలో టీడీఆర్ వినియోగానికి మరింత వెసులుబాటు కల్పించినట్లైంది.
నూతన జీవో ప్రకారం.. ఇకపై, హెచ్ఎండీఏ చేపట్టే ప్రాజెక్టుల కోసం అవసరమైన/స్వాధీనం చేసుకున్న భూములకు ఆ సంస్థే టీడీఆర్ సర్టిఫికెట్లు జారీ చేయనుంది. CURE, PURE పరిధి సహా సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ప్రజా ప్రయోజన/ప్రాజెక్టుల కోసం ఇచ్చే భూములకూ ఈ నియమం వర్తించనుంది. హెచ్ఎండీఏ జారీ చేసే టీడీఆర్ సర్టిఫికెట్‌ను ఆ సంస్థ పరిధిలో ఎక్కడైనా వినియోగించుకోవచ్చు/డిస్పోజ్ చేసుకోవచ్చు. అలాగే టీడీఆర్ జారీ ప్రక్రియను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నారు.
అదేవిధంగా టీడీఆర్‌కు సంబంధించిన వివరాలు, లెక్కలు, వినియోగంపై ఏకరీతి విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ మేరకు సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్/ULB/FCDAలకు టీడీఆర్ సర్టిఫికెట్ కాపీ అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. బిల్డ్ నౌ(BuildNow) వ్యవస్థలో టీడీఆర్ ప్రాసెసింగ్, జారీ, అకౌంటింగ్, వినియోగానికి అవసరమైన మార్పులూ చేసింది. గెజిట్‌లో ప్రచురించిన తేదీ నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0 నిర్వహణకు కేబినెట్ నిర్ణయం
స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫొటో ఎందుకు పెట్టరు?: ఎంపీ రఘునందన్ రావు..