Share News

నేను జైలుకు వెళ్లా: తెలంగాణ గవర్నర్

ABN , Publish Date - May 12 , 2026 | 01:46 PM

స్వాతంత్ర్యానికి ముందు జైళ్లు ఎంత అమానవీయంగా ఉండేవో ప్రజలకు తెలియజేయాల్సి ఉందని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తెలిపారు. మంగళవారం చంచల్‌గూడ జైలులో ఏర్పాటు చేసిన మ్యూజియం, ఫీల్ ది జైల్‌ను ఆయన ప్రారంభించారు.

నేను జైలుకు వెళ్లా: తెలంగాణ గవర్నర్
TG Governor Siva pratap shukla

హైదరాబాద్, మే 12: స్వాతంత్ర్యానికి ముందు జైళ్లు ఎంత అమానవీయంగా ఉండేవో ప్రజలకు తెలియజేయాల్సి ఉందని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తెలిపారు. మంగళవారం చంచల్‌గూడ జైలులో ఏర్పాటు చేసిన మ్యూజియం, ఫీల్ ది జైల్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మాట్లాడుతూ.. స్వాతంత్రానికి పూర్వం జైల్లో గడిపిన వారు ఎలా ఉండేవారనే విషయం ఈ మ్యూజియంను చూస్తే తెలుస్తుందన్నారు.


తెలంగాణ జైళ్ల శాఖ ఆధ్వర్యంలో మ్యూజియం, ఫీల్ ది జైల్ ప్రారంభించడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ మ్యూజియంలో ఉన్నది కేవలం ఇతిహాసానికి సంబంధించిన వస్తువులు కాదన్నారు. స్వాతంత్రానికి ముందు జైళ్లలో ఉన్నవారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో ఈ మ్యూజియం ద్వారా తెలుస్తుందని చెప్పారు. శిక్షల పేరుతో సంస్కారాన్ని, శరీరాన్ని, మనస్తత్వాన్ని విరగ్గొట్టే ప్రయత్నం చేశారని బ్రిటిష్ పాలనలో సాగిన అకృత్యాలను ఆయన వివరించారు.


మన కోసం మన పూర్వీకులు పడ్డ కష్టాన్ని తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని ప్రజలకు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూచించారు. విద్యార్థి నాయకుడిగా ఉన్న సమయంలో తాను పలుమార్లు జైలుకు వెళ్లానన్నారు. ఎమర్జెన్సీ సమయంలో 21 రోజులు తాను జైల్లో ఉన్నానని ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పుడే జైలు ఎలా ఉంటుందో తనకు తెలిసిందని వివరించారు.


గతంలో ఉత్తరప్రదేశ్‌లో కళ్యాణ్ సింగ్ ప్రభుత్వంలో జైళ్ల శాఖ మంత్రిగా తాను పని చేశానని తెలంగాణ గవర్నర్ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా జైళ్లలో తాను పలు సంస్కరణలు తీసుకొచ్చానని తెలిపారు. ఈ సంస్కరణలతో ఖైదీలు సంతోషం వ్యక్తం చేశారని చెప్పారు. ఈ రోజు మ్యూజియంలో చూసిన దృశ్యాలతో.. మళ్లీ ఆనాటి జ్ఞాపకాలు తనకు గుర్తుకు వచ్చాయన్నారు.


ఖైదీలలో ప్రతి ఒక్కరూ క్రిమినల్స్ కాదని.. పరిస్థితులు వారిని ఆ సమయంలో నిందితులుగా మార్చాయని వివరించారు. ఖైదీలలో మార్పు తీసుకురావడానికి అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జైలు అధికారులకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూచించారు. మరోసారి తప్పుచేసే ఆలోచన రాకుండా ఖైదీల్లో పరివర్తన తీసుకురావాలని అధికారులకు తెలంగాణ శివ ప్రతాప్ శుక్లా స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నీట్ పేపర్ లీక్.. 13 మంది అరెస్ట్

సోనియాతో భేటీ కానున్న కేరళ నేతలు.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై చర్చ

For More TG News And Telugu News

Updated Date - May 12 , 2026 | 02:37 PM