Share News

బకాయిలపై ఏం చేద్దాం?

ABN , Publish Date - May 04 , 2026 | 04:52 AM

రాష్ట్రంలో విద్యుత్‌ శాఖకు వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి పెద్దమొత్తంలో బకాయిలు ఉన్న విషయాన్ని సర్కారు తీవ్రంగా పరిగణిస్తోంది. ఇరిగేషన్‌ శాఖ నుంచి పలు ఎత్తిపోతల పథకాలకు సంబంధించి ...

బకాయిలపై ఏం చేద్దాం?

  • విద్యుత్తు శాఖకు రూ.55 వేల కోట్ల బకాయిలు

  • అన్నీ ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచే!.. నేడు క్యాబినెట్‌లో వాటి రికవరీపై చర్చ

  • వాయిదాల వారీ చెల్లించే అంశంపై నిర్ణయం.. సింగరేణి సంస్థకు విద్యుత్‌ శాఖ బకాయి

  • భూముల విలువల రెట్టింపు.. బహుదూర్‌గూడలో బస్‌ టెర్మినల్‌ ఏర్పాటుపైనా చర్చ

  • విద్యుత్తు సబ్‌స్టేషన్ల పక్కన సోలార్‌ ప్లాంట్ల నిర్మాణం.. ఖజానాకు వనరుల సమీకరణ..

  • ఆర్టీసీ విలీనం.. ఉద్యోగులకు 6 వేల కోట్ల చెల్లింపుపైనా చర్చించనున్న క్యాబినెట్‌

  • ఛత్తీస్‌గఢ్‌ కరెంటు కొనుగోలు అంశంపైనా చర్చ.. కార్పొరేషన్లకు చైర్మన్లపై కూడా..

హైదరాబాద్‌, మే 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్‌ శాఖకు వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి పెద్దమొత్తంలో బకాయిలు ఉన్న విషయాన్ని సర్కారు తీవ్రంగా పరిగణిస్తోంది. ఇరిగేషన్‌ శాఖ నుంచి పలు ఎత్తిపోతల పథకాలకు సంబంధించి రూ.26 వేల కోట్లు, మిషన్‌ భగీరథ రూ.5వేల కోట్లు, పంచాయతీరాజ్‌, మునిసిపాలిటీలు కలిపి రూ.6 వేల కోట్లతోపాటు పలు ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు కలిపి మొత్తం సుమారు రూ.55 వేల కోట్లకు పైగా విద్యుత్‌ శాఖకు చెల్లించాల్సి ఉంది. ఇటీవల నిర్వహించిన పలు సమీక్షల్లో అధికారులు ఈ బకాయిల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు విద్యుత్‌ శాఖ కూడా సింగరేణి సంస్థకు రూ.వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీంతో ఏవైనా అవసరాల నిమిత్తం ప్రభుత్వం రుణాల కోసం బ్యాంకులు, ఇతర సంస్థల వద్దకు వెళ్లినప్పుడు.. ఈ బకాయిల అంశం తెరపైకి వస్తోంది. రుణాలను తిరిగి చెల్లించేందుకు ఉన్న అవకాశాలు, ప్రస్తుతం శాఖ పరిస్థితిని పరిశీలించి ఆయా బ్యాంకులు, సంస్థలు రుణాలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయన్న విషయాన్ని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఈ నేపథ్యంలో సోమవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరగనున్న మంత్రివర్గ సమావేశంలో బకాయిల అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏయే సంస్థలు ఎంత మేర బకాయిలు ఉన్నాయి, చెల్లింపులకు ఉన్న అవకాశాలేంటన్న దానిపై చర్చించి, వాయిదాల పద్ధతిలో విద్యుత్‌ శాఖకు చెల్లించేలా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. దీంతోపాటు పలు కీలక అంశాలపై క్యాబినెట్‌ భేటీలో చర్చించనున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్‌ మినహా మిగిలిన తొమ్మిది ఉమ్మడి జిల్లాల పరిధిలో జిల్లాకు రెండు చొప్పున సోలార్‌ పవర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. అంతర్జాతీయంగా నెలకొంటున్న యుద్ధ వాతావరణం, రోజురోజుకూ పెరుగుతున్న గ్యాస్‌ ధరల నేపథ్యంలో సర్కారు ఈ దిశగా ఆలోచిస్తోంది. ప్రతి జిల్లాలోని ఒక నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని ఫైలట్‌గా ఎంపిక చేసి, పూర్తి సోలార్‌ పవర్‌ను సరఫరా చేయాలని భావిస్తోంది. అంతేకాకుండా ఆ గ్రామాల్లో గ్యాస్‌ స్టవ్‌లు వాడకుండా పూర్తి సోలార్‌ స్టవ్‌లను అందించేందుకు ఉన్న అవకాశాలనూ పరిశీలిస్తోంది.


ఈ విషయంపైనా మంత్రివర్గంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. ఇక రాష్ట్ర ఖజానాకు వనరుల సమీకరణపై దృష్టి సారించిన ప్రభుత్వం.. అందుకు ఉన్న అవకాశాలను గుర్తిస్తోంది. ఇప్పటికే పలు సంస్థల పరిధిలోని ఆస్తులను వేలం వేస్తూ ఆదాయం రాబడుతోంది. తాజాగా వనరుల సమీకరణ కోసం ఏర్పాటైన క్యాబినెట్‌ సబ్‌ కమిటీ.. ఇటీవల వరుసగా వివిధ ప్రభుత్వ శాఖలతో భేటీ అవుతోంది. ఆ భేటీల్లో వనరుల సమీకరణకు ఉన్న మార్గాలను గుర్తించి ఒక నివేదికను రూపొందించినట్టు తెలిసింది. ఆ నివేదిక ను క్యాబినెట్‌ ముందుంచి దానిపై చర్చించనున్నారు. అనంతరం వనరుల సమీకరణకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు. ఆర్టీసీ కార్మికులతో చర్చల సందర్భంగా ఆ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్‌ పట్ల ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసింది. ఆ కారణంగానే కార్మికులు సమ్మెను విరమించినట్టు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై క్యాబినెట్‌లో చర్చించనున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 5న ఆందోళన చేపడతామని ఉద్యోగ సంఘాల జేఏసీ ఇచ్చిన ప్రకటన నేపథ్యంలో ప్రభుత్వం వారితోనూ సమావేశమై చర్చలు జరిపింది. వారి సమస్యల్లో కీలకమైన ఆర్థిక అంశాలను పరిష్కరిస్తామని చెప్పింది. ఇందులో భాగంగా రానున్న వంద రోజుల్లో రూ.6వేల కోట్లను చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ఈ దృష్ట్యా అందుకు ఉన్న అవకాశాలపైనా చర్చించి, చెల్లింపులపై ప్రకటన చేయనున్నట్లు సమాచారం. పీఆర్సీ, డీఏల వ్యవహారంపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. తుమ్మిడిహెట్టి వద్ద 150 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించి, ఎల్లంపల్లికి నీటిని తరలించే మార్గాలపై క్యాబినెట్‌లో లోతుగా చర్చించనున్నారు. దీంతోపాటు కొత్త రేషన్‌కార్డులు, ఆసరా పింఛన్లు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుపైనా చర్చించనున్నారు. ఉద్యమకారుల సంక్షేమ సంఘం విధివిధానాల ఖరారుపై చర్చించనున్నారు.


బస్‌ టెర్మినల్‌, మెట్రో రెండో ఫేజ్‌పై చర్చ

హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ కోసం శంషాబాద్‌లోని బహుదూర్‌గూడ సమీపంలో ఇప్పటికే 500 ఎకరాల స్థలం అందుబాటులో ఉండగా, మరో 150 ఎకరాలను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై క్యాబినెట్‌లో చర్చించనున్నారు. అక్కడే హైస్పీడ్‌ రైలు, మెట్రో, బస్సులతోపాటు విమానాశ్రయానికి వెళ్లేందుకు వీలుగా ఇంటర్‌స్టేట్‌ బస్‌ టెర్మినల్‌ పేరుతో భారీ నిర్మాణాన్ని చేపట్టే అంశంపైనా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కాగా, మెట్రో రెండో ఫేజ్‌ను ఏ పద్ధతిలో నిర్మించాలి, పీపీపీ మోడల్‌లో ముందుకు వెళ్లాలా, లేక కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో వెళ్లాలా అనేదానిపై చర్చించనున్నారు. ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా, మరోసారి డీపీఆర్‌ను పంపించి.. నిధులు, సంబంఽధిత అంశాలకు సహకరించాలని కోరే విషయంపై కీలకంగా చర్చించనున్నట్టు తెలిసింది. ఇక ఐఐటీ-బాసర (ఆర్‌జీయూకేటీ)కు యూనివర్సిటీ హోదా కల్పించే అంశంపైనా క్యాబినెట్‌ భేటీలో చర్చించనున్నారు. హైబ్రిడ్‌ యాన్యునిటీ మోడ్‌ (హ్యామ్‌) విధానంలో అభివృద్ధి చేయదలచిన ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖలోని రోడ్ల టెండర్లలో ఎక్సెస్‌ రేట్ల వ్యవహారం తెరపైకి వచ్చినందున.. దీనిపైనా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.

కార్పొరేషన్ల చైర్మన్ల జాబితా సిద్ధం!

రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్పొరేషన్లకు కొత్త చైర్మన్‌లను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న చైర్మన్‌ల పదవీకాలం పూర్తికానున్న నేపథ్యంలో కొత్త వారిని నియమించనున్నారు. ఇందుకు సంబంధించిన జాబితా కూడా సిద్ధమైనట్లు, దీనిపై క్యాబినెట్‌లో చర్చించనున్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్నవారిలో ఐదారుగురు మినహా మిగిలిన వారందరినీ కొత్త వారిని నియమించనున్నట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లోనే ఈ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని అధికార వర్గాల ద్వారా తెలిసింది.


ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొనుగోలుపై చర్చ

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వంతో చేసుకున్న విద్యుత్‌ ఒప్పందంపై రేవంత్‌ సర్కారు దృష్టి సారించింది. 2015లో చేసుకున్న ఈ ఒప్పందంలో విద్యుత్‌ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో యూనిట్‌కు చెల్లించే ధరల విషయంలో తీవ్రమైన మార్పులు జరిగాయని అప్పట్లో తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఒకరకంగా ఈ విషయం అప్పట్లో రాజకీయంగా దుమారం రేపింది. 2023లో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే.. దీనిపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని విద్యుత్‌ శాఖ ముఖ్య అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి మనం ఎంత ధరకు విద్యుత్‌ కొన్నాం? అప్పల్లో మార్కెట్‌లో ఇతర రాష్ట్రాల విద్యుత్‌ ధర ఎంత ఉంది? మనకు ఎంత నష్టం వాటిల్లింది? అనే వివరాలు ఇవ్వాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్దేశించారు. ప్రస్తుతం ఆ నివేదిక ప్రభుత్వానికి చేరిందని, అప్పటి ఒప్పందంపై చర్యలకు ఉపక్రమించే ఆలోచనలో సర్కారు ఉందని సమాచారం. అంతేకాకుండా.. గత ప్రభుత్వం హయాంలో జరిగిన అన్ని విద్యుత్‌ ఒప్పందాలపై విచారణ జరిపేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇదివరకే నరసింహారెడ్డి కమిషన్‌ను నియమించింది. అయితే కమిషన్‌ విచారణ జరిపిన తీరుపై మాజీ సీఎం కేసీఆర్‌ అభ్యంతరం తెలుపుతూ హైకోర్టును ఆశ్రయించడంతో.. కమిషన్‌ నుంచి నరసింహారెడ్డి వైదొలిగారు. అనంతరం మదన్‌ బి. లోకూర్‌ను కమిషన్‌ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది. ఈ కమిషన్‌ తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిసింది. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు ఈ నివేదికను బయటపెట్టలేదు. కాగా, ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ ఒప్పందంపై సోమవారం మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిసింది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు 2015లో ఒప్పందం జరగగా, ఒక్కో యూనిట్‌కు మొదట్లో ఒక ధరను నిర్ణయించి, ఆ తరువాత కొంత పెంచారు. దాంతో ఆ వ్యవహారంలో దాదాపు రూ.6 వేల కోట్లకు పైగా నష్టం వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో ధరను పెంచిన విషయంలో కమీషన్ల కమామిషు కూడా ఉందనే ఆరోపణలు వచ్చాయి.

Updated Date - May 04 , 2026 | 06:07 AM