Share News

గ్లోబల్‌ సమ్మిట్‌కు 1059 కంపెనీలు

ABN , Publish Date - Nov 28 , 2026 | 04:36 AM

రాష్ట్రానికి రూ.వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా డిసెంబరు 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026’ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది.

గ్లోబల్‌ సమ్మిట్‌కు 1059 కంపెనీలు

  • 1,300 మందికి పైగా ప్రత్యేక ఆహ్వానితులు..

  • 7 వేదికలు.. 6 ఎక్స్‌పో హాళ్లు.. స్టాళ్లు

  • 77 సమావేశాల నిర్వహణకు కార్యాచరణ

హైదరాబాద్‌, రంగారెడ్డి అర్బన్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి రూ.వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా డిసెంబరు 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌-2026’ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. భారత్‌ ఫ్యూచర్‌ సిటీలోని యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ ప్రాంగణం వేదికగా మరో 11 రోజుల్లో జరగనున్నఈ సదస్సులో పాల్గొనేందుకు 1059 కంపెనీలు ముందుకొచ్చాయి. అలాగే.. దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, వివిధ రంగాల నిపుణులు అంతా కలిపి 1300 మందికి పైగా ప్రతినిధులు తరలిరానున్నారు. వీరిలో 220 మందికి పైగా అంతర్జాతీయ ప్రతినిధులు. పెద్ద కంపెనీలతో పాటు చిన్న పరిశ్రమలు, స్టార్ట్‌పలకు అంతర్జాతీయ సంస్థలతో వ్యాపార సంబంధాలు ఏర్పరచుకునే అవకాశం ఈ గ్లోబల్‌ సమ్మిట్‌ ద్వారా లభించనుంది. మూడు రోజుల సదస్సులో వివిధ అంశాలపై 77 సమావేశాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించారు.


ప్రధాన ఆకర్షణలు..

రక్షణ రంగానికి సంబంధించి రక్షా ఎక్స్‌పో... యానిమేషన్‌, గేమింగ్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ రంగాలకు సంబంధించి ఇండియా జాయ్‌, యువ పారిశ్రామికవేత్తల ఆవిష్కరణలతో స్టార్టప్‌ ఎరీనా.. ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వీటితో పాటు క్లైమేట్‌ కాన్‌క్లేవ్‌, ఎడ్యుకేషన్‌ కాన్‌క్లేవ్‌, ట్రైబల్‌ సమ్మిట్‌, తెలంగాణ పెవిలియన్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఇక.. కిందటి సంవత్సరం 27,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహించగా, ఈసారి 80 వేల చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఒకే ఎక్స్‌పో హాల్‌ ఉండగా ఈసారి ఆరు భారీ ఎక్స్‌పో హాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రదర్శనశాలల విస్తీర్ణం 3,200 చదరపు మీటర్ల నుంచి 60,600 చదరపు మీటర్లకు పెరిగింది. యూనివర్సిటీ క్యాంపస్‌ వెనుక 10 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రధాన వేదిక సహా 7 వేదికలను ఏర్పాటు చేస్తున్నా రు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, కళలు, పారిశ్రామిక ప్రగతి గురించి ప్రపంచానికి చాటిచెప్పేందుకు ప్రత్యేకంగా తెలంగాణ పెవిలియన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. స్కిల్‌ వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరిస్తారు.


ప్రజల సందర్శనకు అవకాశం..

ఈసారి గ్లోబల్‌ సమ్మిట్‌ను కేవలం పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకే పరిమితం చేయకుండా ప్రజలకు కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబరు 7 నుంచి 9 వరకు సదస్సు జరుగుతుంది. అనంతరం 13 వరకు రక్షా ఎక్స్‌పో, ఇండియాజాయ్‌ ప్రదర్శనలను ప్రజలు సందర్శించే అవకాశం కల్పించనున్నారు.


ఈ వార్తలూ చదవండి

నిధులు ఉన్నా ఖర్చు చేయకపోతే ఎలా? అధికారులపై మంత్రి అడ్లూరి ఆగ్రహం

త్వరలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో వైద్య సేవలు: మంత్రి దామోదర రాజనర్సింహా

Updated Date - Nov 28 , 2026 | 04:37 AM