Share News

గిగ్‌ వర్కర్లు దేశానికి పునాదులు

ABN , Publish Date - Nov 15 , 2026 | 03:46 AM

గిగ్‌ వర్కర్లు దేశానికి అసలైన పునాదులని, వారిని కార్మికులుగా కాకుండా భాగస్వాములుగా గౌరవించడమే కాంగ్రెస్‌ పార్టీ విధానమని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు.

గిగ్‌ వర్కర్లు దేశానికి పునాదులు
Rahul Gandhi

  • వారిని గౌరవించడమే కాంగ్రెస్‌ విధానం

  • గిగ్‌ వర్కర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా,

  • 10లక్షల ఆరోగ్య బీమా అమలు చేసేలా చట్టం

  • ప్రతి డెలివరీ చార్జీలో 1శాతం.. వారి భవిష్యత్తు కోసం

  • ‘గిగ్‌ వర్కర్ల చట్టం’ ప్రారంభోత్సవంలో రాహుల్‌

  • గాంధీ కుటుంబం మాటిస్తే.. అది చట్టంతో సమానం

  • కార్మికులకు అధికారిక గుర్తింపు కార్డులు: రేవంత్‌

  • గిగ్‌ వర్కర్లతో కలిసి రాహుల్‌, రేవంత్‌ బైక్‌ ర్యాలీ

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ/రాయదుర్గం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): గిగ్‌ వర్కర్లు దేశానికి అసలైన పునాదులని, వారిని కార్మికులుగా కాకుండా భాగస్వాములుగా గౌరవించడమే కాంగ్రెస్‌ పార్టీ విధానమని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. గతంలో తెలంగాణ గిగ్‌ వర్కర్లను కలిసినప్పుడు వారి కష్టాలను స్వయంగా విన్నానని, అన్ని రకాలుగా భద్రత కల్పిస్తామని ఆ రోజే వారికి మాట ఇచ్చానని గుర్తు చేశారు. నాడు ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్‌ నేతృత్వంలోని ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ మాదాపూర్‌లోని జయభేరి గ్రౌండ్‌లో శనివారం నిర్వహించిన ‘తెలంగాణ గిగ్‌ వర్కర్ల సామాజిక భద్రత, సంక్షేమ పథకం’ ప్రారంభోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్‌తోపాటు ఇతర నగరాల్లోనూ గిగ్‌ వర్కర్ల కోసం వై-ఫై సౌకర్యంతో కూడిన విశ్రాంతి కేంద్రాలను ప్రభుత్వం నిర్మించనుందని చెప్పారు. అక్కడ వాహనాన్ని పార్కింగ్‌ చేసుకుని, విశ్రాంతి తీసుకోవచ్చన్నారు. ప్రతి గిగ్‌ వర్కర్‌కు రూ.5 లక్షల ప్రమాద బీమా, రూ.10 లక్షల ఆరోగ్య బీమా అందించడానికి ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తోందని వెల్లడించారు.


గిగ్‌ వర్కర్లకూ వారికీ సామాజిక భద్రత ఉండాలని, వారి భవిష్యత్తు కోసం డబ్బు ఆదా కావాలని పేర్కొన్నారు. అందుకే వారు పూర్తి చేసే ప్రతి డెలివరీ, ప్రతి రైడ్‌ చార్జీలో 1శాతం మొత్తాన్ని వారి భవిష్యత్తు భద్రతకు వినియోగిస్తామని, సదరు మొత్తాన్ని ఆయా కంపెనీలు గిగ్‌ వర్కర్స్‌ బోర్డులో జమ చేస్తాయని తెలిపారు. బోర్డు ద్వారా ఆ సొమ్ము నేరుగా గిగ్‌ వర్కర్ల బ్యాంక్‌ ఖాతాలకు చేరుతుందన్నారు. కొత్త చట్టం ప్రకారం వారు చేసే పని, పూర్తి చేసే రైడ్లు, డెలివరీలు, ప్రతి రైడ్‌ లేదా లావాదేవీకి ఎంత డబ్బు చెల్లిస్తున్నారనే పూర్తి సమాచారం వారికి అందుబాటులోకి రానుందని వివరించారు. కార్మికులను కేవలం సేవకులు, బానిసలుగా అణచివేయాలనేది బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ సిద్ధాంతమైతే.. కార్మికులకు భద్రత కల్పించి భాగస్వాములుగా మార్చడమే కాంగ్రెస్‌ భావజాలమని స్పష్టం చేశారు. గిగ్‌ వర్కర్ల కష్ట ఫలితం అంబానీ-అదానీలకు దక్కాలని, ఉబర్‌..ఓలా యాజమాన్యాలకు అందాలని ప్రదాని మోదీ భావిస్తున్నారని ఆరోపించారు. వారికి భద్రత, రక్షణ కల్పించాలని తాము భావిస్తున్నామన్నారు. గిగ్‌ వర్కర్లు భయపడాల్సిన పని లేదని, రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డితోపాటు తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. గిగ్‌ వర్కర్ల కుటుంబాల్లోని పిల్లల విద్య బాధ్యతను తీసుకోవడానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.


రాహుల్‌ ఇచ్చిన హామీని నెరవేర్చాం

‘‘గాంధీ కుటుంబం మాట ఇస్తే.. సువర్ణ అక్షరాలతో లిఖించిన చట్టంతో సమానం.. కొత్త చట్టం ద్వారా గతంలో గిగ్‌వర్కర్లకు రాహల్‌ గాంధీ ఇచ్చిన హామీని నెరవేర్చాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. 2023లో కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు 4000 కిలో మీటర్ల పాదయాత్ర చేపట్టిన రాహుల్‌ గాంధీ.. పేదలు, కార్మికుల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారని గుర్తు చేశారు. నాడు హైదరాబాద్‌కు వచ్చిన సమయంలో గిగ్‌ వర్కర్ల సమస్యలపై స్పందించిన రాహుల్‌గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే ప్రత్యేక చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. నెహ్రూ జన్మదినం సందర్భంగా రాహుల్‌ గాంధీ చేతుల మీదుగానే కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు.


ఆన్‌లైన్‌ డెలివరీలు, క్యాబ్‌, ఆటో సర్వీసులు అందిస్తున్న గిగ్‌ వర్కర్లకు ప్రభుత్వం తరఫున రూ.5లక్షల ప్రమాద బీమా కల్పిస్తున్నామని తెలిపారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10లక్షలకు పెంచి కార్మికుల కుటుంబాలకు ఆరోగ్య భరోసా కల్పించామన్నారు. గిగ్‌ వర్కర్ల సంక్షేమం, వారి హక్కులను కాపాడేందుకు ప్రత్యేకంగా గిగ్‌ వర్కర్స్‌ బోర్డును ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. అర్హులైన ప్రతి కార్మికుడికి అధికారిక గుర్తింపు కార్డులు అందజేస్తామని వెల్లడించారు. ‘రాష్ట్రంలో ఏ కార్మికుడూ అభద్రతాభావంతో బతకాల్సిన అవసరం లేదు. మీ చెమట విలువను గుర్తిస్తూ ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది’ అని భరోసా కల్పించారు. గిగ్‌ వర్కర్ల తరఫున రాహుల్‌గాంధీకి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గిగ్‌ వర్కర్ల సంక్షేమ పథకం అమలు పాలసీ బుక్‌ను ఆవిష్కరించిన రాహుల్‌, సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు.


గిగ్‌ స్టాప్‌లను ప్రారంభించిన రాహుల్‌

గిగ్‌ వర్కర్ల కోసం ఏర్పాటు చేసిన విశ్రాంతి కేంద్రాలను (గిగ్‌ స్టాప్‌లను) సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి రాహుల్‌ గాంధీ ప్రారంభించారు. గిగ్‌ వర్కర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బస్సులో రెస్ట్‌ రూమ్‌లు అందుబాటులో ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో తిరిగే గిగ్‌ వర్కర్లు విశ్రాంతి తీసుకునేలా ఈ బస్సును రూపొందించారు. అలాగే, సైబరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ సౌజన్యంతో తొలుత పటాన్‌చెరు, తెల్లాపూర్‌, చందానగర్‌, భారతీనగర్‌, కొండాపూర్‌ ప్రాంతాల్లో గిగ్‌ స్టాప్‌లను అందుబాటులోకి తెచ్చారు. గిగ్‌ వర్కర్లు ఎవరైనా సరే అందులో కూర్చుని తినవచ్చు. సేద తీరొచ్చు. కాలకృత్యాలను తీర్చుకోవచ్చు. ఈ రంగంలో పని చేస్తున్న దివ్యాంగ గిగ్‌ వర్కర్లకు ఈ గిగ్‌స్టా్‌పలు ఎంతగానో దోహదపడనున్నాయి.


గిగ్‌ వర్కర్లతో రాహుల్‌ బైక్‌ ర్యాలీ

గిగ్‌ వర్కర్లతో కలిసి రాహుల్‌ గాంధీ బైక్‌ ర్యాలీలో పాల్గొన్నారు. తొలుత హైటెక్‌ సిటీలోని శిల్పారామం ముందు ఉన్న ఇందిరాగాంధీ విగ్రహానికి సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌తో కలిసి నివాళులర్పించారు. అనంతరం ర్యాపిడో బైకర్‌ లలిత స్కూటీపై రాహుల్‌ గాంధీ, మరో బైక్‌పై సీఎం రేవంత్‌ ప్రయాణించారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. శిల్పారామం నుంచి జయభేరి గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభ వరకు ర్యాలీ సాగింది.


ఇవి కూడా చదవండి...

చిత్తూరులో రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

శ్రీకాళహస్తి ఆలయంలో స్పై కెమెరా కళ్లజోడు కలకలం

Updated Date - Nov 15 , 2026 | 03:50 AM