Share News

తెలంగాణకు 1,087 కోట్ల ‘సాస్కి’ నిధులు

ABN , Publish Date - Nov 19 , 2026 | 05:03 AM

వ్యవసాయ రంగంలో తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

తెలంగాణకు 1,087 కోట్ల ‘సాస్కి’ నిధులు

  • వ్యవసాయ రంగంలో సంస్కరణలకు గాను కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకం

  • ఫార్మర్‌ రిజిస్ట్రీ, ఎరువుల పంపిణీలో సమర్థ విధానాలకు గుర్తింపు: తుమ్మల

హైదరాబాద్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ రంగంలో తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మూలధన పెట్టుబడుల కోసం రాష్ట్రాలకు ప్రత్యేక సహాయ పథకం (ఎస్‌ఏఎ్‌ససీఐ) కింద ప్రత్యేక కేంద్ర ప్రోత్సాహకం (ఎస్‌సీఏ) రూపంలో రూ.1,087.64 కోట్ల నిధులు రాష్ట్రానికి వచ్చినట్లు చెప్పారు. వ్యవసాయరంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, వినూత్న విధానాలు, నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించి సాధించిన పురోగతికి గుర్తింపుగా ఈ నిధులు వచ్చినట్లు బుధవారం ఒక ప్రకటనలో వివరించారు.


ఈ గుర్తింపు పొందిన తొలి రాష్ట్రం తెలంగాణే అని చెప్పారు. 2025- 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ‘ఫార్మర్‌ రిజిస్ట్రీ కార్యక్రమంలో కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలకు మించి ‘ఫార్మర్‌ ఐడీ’లను నమోదు చేసినందుకు రూ.422.64 కోట్లను కేంద్రం ఇటీవల విడుదల చేసిందని మంత్రి తుమ్మల తెలిపారు. 2026- 27 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ ఎరువుల యాప్‌ (ఫెర్టిలైజర్‌ సేల్స్‌ సిస్టమ్‌- ఎఫ్‌ఎస్ఎస్‌) ద్వారా ఎరువుల పంపిణీని విజయవంతంగా నిర్వహించినందుకు రూ.665 కోట్లను మూడు విడతల్లో కేంద్రం ఇచ్చిందని చెప్పారు. మొదటి విడతలో రూ.175 కోట్లు, రెండో విడతలో రూ. 165 కోట్లు, మూడో విడతలో రూ.325 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు.


రెండు ఆర్థిక సంవత్సరాలకు కలిపి మొత్తం రూ.1,087.64 కోట్లు రాష్ట్రానికి కేంద్రం ఇచ్చినట్లు వివరించారు. రాష్ట్రంలో ఎరువుల పంపిణీ వ్యవస్థను మరింత సులభతరం చేసేందుకు మూడు దశల్లో ‘ఎఫ్‌ఎస్ఎస్‌’ విధానాన్ని విజయవంతంగా అమలుచేసినట్లు తెలిపారు. ఫార్మర్‌ రిజిస్ట్రీతో రైతుల వివరాలు పూర్తిగా అందుబాటులోకి రావడంతో వ్యవసాయ సేవలను మరింత సమర్థంగా అందించేందుకు వీలవుతోందని చెప్పారు. రైతులు తమ పంటకు కనీస మద్దతు ధర పొందేందుకు కూడా ఫార్మర్‌ రిజిస్ట్రీ ఐడీ ఉపయోగపడుతుందని వివరించారు. తెలంగాణ సాధించిన ఈ ఘనతలో వ్యవసాయశాఖ అధికారుల సమష్టి కృషి ఉందని కొనియాడారు. ఈ గుర్తింపు రాష్ట్రానికి గర్వకారణమన్నారు. భవిష్యత్తులోనూ వ్యవసాయరంగంలో మరిన్ని సంస్కరణలు చేపడుతూ, రైతులకు మెరుగైన సేవలు అందిస్తామని వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ ఓటర్ల జాబితాపై ఈసీ కీలక నిర్ణయం

బాబా బర్త్‌డే స్పెషల్‌.. బెంగళూరు-ధర్మవరం మధ్య ప్రత్యేక ప్యాసింజరు రైలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 19 , 2026 | 05:04 AM