ఎల్‌నినోపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష.. కొవిడ్ తరహాలో యాక్షన్ ప్లాన్‌కు ఆదేశం..
ABN , Publish Date - Oct 10 , 2026 | 07:45 PM
ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ సంక్షోభాన్ని ముందుగానే గుర్తించి, సమర్థంగా ఎదుర్కొనేందుకు పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో తీవ్రమైన సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ సంక్షోభాన్ని ముందుగానే గుర్తించి, సమర్థంగా ఎదుర్కొనేందుకు పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావంపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది జూన్ వరకు నీరు, వ్యవసాయం, విద్యుత్‌కు సంబంధించిన సమస్యలను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎల్‌నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేయకపోతే భవిష్యత్తులో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొన్న తరహాలోనే ఎల్‌నినోతో తలెత్తే సమస్యలనూ అధిగమించేందుకు పకడ్బందీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. ప్రతి కార్యాచరణలో ప్రజలను భాగస్వాములను చేయాలని రేవంత్ స్పష్టం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ సమస్యలు తీవ్రతరం అయ్యే ప్రమాదం ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు.
అవసరమైతే విద్యుత్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసేందుకైనా సిద్ధంగా ఉందన్నారు ముఖ్యమంత్రి. అయితే మార్కెట్‌లో విద్యుత్ అందుబాటులో లేకపోవడం ఆందోళనకరమైన అంశమని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. విద్యుత్‌పై ఆధారపడే పనులను సాధ్యమైనంత వరకు తాత్కాలికంగా వాయిదా వేసుకునేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో తాగునీరు, సాగునీటి సమస్యలు తీవ్రతరం కాకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. చుక్క నీరు కూడా వృథా కాకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. నీటి లభ్యత, వ్యవసాయ అవసరాలు, విద్యుత్ వినియోగం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
ఎల్‌నినో ప్రభావం, దాని వల్ల ఎదురయ్యే సమస్యలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని రేవంత్ రెడ్డి తెలిపారు. సినిమా, మీడియా, కళాజాతలతో పాటు వివిధ మాధ్యమాలను ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రజలకు అవగాహన కల్పించి నీరు, విద్యుత్ పొదుపులో వారిని భాగస్వాములను చేయాలని దిశానిర్దేశం చేశారు. ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే సవాళ్లను ముందుగానే గుర్తించి, తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రేవంత్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
రంగారెడ్డి జిల్లాలో రూ.2 లక్షల విలువైన ఎండీఎంఏ డ్రగ్స్ పట్టివేత
బేబీ రుక్సానాకు మెరుగైన వైద్యం, ఆమె తల్లికి ఉద్యోగం కల్పిస్తాం: మంత్రి దామోదర