Share News

తూ.గో. జిల్లాలో పెద్దపులి కలకలం.. రంగంలోకి పుణె రెస్క్యూ టీమ్

ABN , Publish Date - Oct 10 , 2026 | 07:20 PM

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండల పరిధిలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. చాగల్లు- కలవలపల్లి గ్రామాల మధ్య పంట పొలాలు, గ్రామ శివారు ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తుండటంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

తూ.గో. జిల్లాలో పెద్దపులి కలకలం.. రంగంలోకి పుణె రెస్క్యూ టీమ్
Tiger

తూర్పుగోదావరి జిల్లా: కొవ్వూరు నియోజకవర్గంలోని చాగల్లు మండల పరిధిలో పెద్దపులి సంచారం స్థానిక ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. చాగల్లు- కలవలపల్లి గ్రామాల మధ్య పంట పొలాలు, గ్రామ శివారు ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తుండటంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. దానిని సురక్షితంగా బంధించేందుకు పుణెకు చెందిన ప్రత్యేక రెస్క్యూ టీమ్, ఆర్ఆర్ఆర్ బృందాలను రంగంలోకి దించారు. ఈ మేరకు చాగల్లు, కలవలపల్లి గ్రామాల పరిసర ప్రాంతాల్లో పులి కదలికలను గుర్తించేందుకు ఆయా బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా దానిని సురక్షితంగా బంధించడమే లక్ష్యంగా అటవీశాఖ అధికారులు, ప్రత్యేక బృందాల సభ్యులు పనిచేస్తున్నారు.


కాగా, పెద్దపులి సంచారంతో పంట పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. పులి ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉందని తెలిపారు. ఎవరూ ఒంటరిగా పొలాల్లోకి వెళ్లవద్దని, పులి కనిపిస్తే దాని దగ్గరకు వెళ్లడం, వెంబడించడం వంటి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. చాగల్లు మండల పరిధిలోని గ్రామాల ప్రజలను తహసీల్దార్ మెరికమ్మ అప్రమత్తం చేస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలిసేలా ఆయా గ్రామాల్లో చాటింపు వేయిస్తున్నారు. అలాగే, పాడిపశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రెవెన్యూ యంత్రాంగం సూచించింది. పులి సంచారంపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ అధికారుల సూచనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

ఉద్యోగం పేరుతో వైసీపీ వైసీపీ మాజీ కౌన్సిలర్ ఘరానా మోసం

203 ఆస్పత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా: ఎన్టీఆర్ ట్రస్టు చర్యలు

Updated Date - Oct 10 , 2026 | 07:20 PM