వారంలోగా చెక్కులపై సంతకాలు చేయకుంటే చర్యలు
ABN , Publish Date - Oct 02 , 2026 | 05:16 AM
గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, ఉప సర్పంచుల జాయింట్ ఖాతా.. చెక్కులపై సంతకాల సమస్య కొద్దిరోజులుగా రాజుకుంటోంది. దీనికి చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్‌పై సర్కారు కీలక నిర్ణయం
చర్యలు తీసుకునేందుకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు..
ఉద్దేశపూర్వక జాప్యంగా తేలితే మరో అధికారికి చెక్ పవర్
హైదరాబాద్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, ఉప సర్పంచుల జాయింట్ ఖాతా.. చెక్కులపై సంతకాల సమస్య కొద్దిరోజులుగా రాజుకుంటోంది. దీనికి చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏ కారణం లేకుండా, ఉద్దేశపూర్వకంగా గ్రామ పంచాయతీల చెక్కులపై సంతకం చేయకుండా, డిజిటల్ సిగ్నేచర్ కీ ద్వారా వ్యయాన్ని ఆమోదించకుండా ఉప సర్పంచ్‌లు జాప్యం చేస్తే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణ ఉపాధి కమిషనర్ డి.దివ్య గురువారం ఉత్తర్వులు జారీచేశారు. కొంతమంది ఉప సర్పంచ్‌లు ఎలాంటి కారణం లేకుండానే గ్రామ పంచాయతీల చెక్కులపై సంతకాలు చేయడం లేదని ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు మెమోలో పేర్కొన్నారు. దీనివల్ల పంచాయతీల్లో చెల్లింపులు జాప్యమవుతున్నాయని, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, అభివృద్ధి పనుల అమలుపై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు వెంటనే ఈ అంశంపై దృష్టి సారించి, అవసరమైన చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ స్పష్టం చేసింది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం-2018లోని సెక్షన్ 37ను, 2025లో చేసిన సవరణ చట్టం-2ను ప్రస్తావిస్తూ కీలక సూచనలు చేసింది. సంబంధిత చెక్కు ఉప సర్పంచ్‌కు సమర్పించిన తేదీ నుంచి ఏడు పని దినాల్లోపు ఏ కారణం లేకుండా సంతకం చేయకపోతే, జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించాలన్నారు. సముచిత కారణం లేకుండానే సంతకం చేసేందుకు నిరాకరించినట్లు తేలితే, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఉప సర్పంచ్ తప్పిదం నిర్ధారణ అయితే గ్రామ పంచాయతీ చెక్కుల డ్రాయింగ్ పవర్‌ను మరో చట్టబద్ధమైన అధికారికి అప్పగించే అవకాశం కల్పించారు. పంచాయతీ కార్యదర్శి, ఎంపీవో, ఎంపీడీవో తదితర సంబంధిత అధికారులకు ఈ బాధ్యతను అప్పగించవచ్చని ఉత్తర్వులో వెల్లడించారు. ఇందుకు సంబంధించి కలెక్టర్లకు పూర్తి అధికారాలు కల్పిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
నో మైనింగ్ జోన్‌గా ఫ్యూచర్ సిటీ!
నెలలో 50వేల మెట్రిక్ టన్నుల.. ఆయిల్‌పామ్ గెలల క్రషింగ్
Read Latest Telangana News And Telugu News