Share News

నో మైనింగ్‌ జోన్‌గా ఫ్యూచర్‌ సిటీ!

ABN , Publish Date - Oct 02 , 2026 | 05:11 AM

కందుకూరు, ముచ్చర్ల మధ్య దాదాపు 30 వేల ఎకరాల్లో ప్రతిష్ఠాత్మకంగా భారత్‌ ఫ్యూచర్‌ సిటీని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అక్కడ పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేస్తోంది.

నో మైనింగ్‌ జోన్‌గా ఫ్యూచర్‌ సిటీ!
Future City

  • ఎఫ్‌సీడీఏ పరిధిలో లీజుల రెన్యువల్‌ సైతం నిలిపివేత

రంగారెడ్డి అర్బన్‌, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): కందుకూరు, ముచ్చర్ల మధ్య దాదాపు 30 వేల ఎకరాల్లో ప్రతిష్ఠాత్మకంగా భారత్‌ ఫ్యూచర్‌ సిటీని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అక్కడ పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేస్తోంది. పూర్తిగా పర్యావరణహిత విధానాలు, గ్రీన్‌ ఎనర్జీకి ప్రాధాన్యత ఇస్తూ నెట్‌జీరో కార్బన్‌ లక్ష్యంతో ఫోర్త్‌ సిటీని డిజైన్‌ చేస్తోంది. ఫ్యూచర్‌ సిటీ డెవల్‌పమెంట్‌ అథారిటీ (ఎఫ్‌సీడీఏ) పరిధిని ‘నో మైనింగ్‌ జోన్‌ (గనుల తవ్వకాల నిషేధిత ప్రాంతం)’గా ప్రకటించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో కొత్తగా మైనింగ్‌ కార్యకలాపాలు చేపట్టొద్దని జిల్లా యంత్రాంగానికి, ఎఫ్‌సీడీఏకు ఉన్నతాధికారులు సూచించినట్టు సమాచారం. రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో దాదాపు ఫార్చూన్‌ 500 పరిశ్రమలు ఏర్పాటు కానున్న నేపథ్యంలో వాటికి ఎలాంటి ఆటంకాలు రాకూడదని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.


ఎఫ్‌సీడీఏ పరిధి ప్రస్తుతం మహేశ్వరం, కందుకూరు, యాచారం, కడ్తాల్‌, అమన్‌గల్‌ మండలాల్లోని 71 గ్రామాల్లో ఉంది. ఫ్యూచర్‌ సిటీలో మైనింగ్‌ రెన్యువల్‌కు కూడా ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయడం లేదు. జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మినరల్‌ యూనిట్లు చిన్నవి పెద్దవి కలిపి 137 వరకు ఉన్నాయి. వీటిలో మేజర్‌ మినరల్‌.. క్వార్ట్‌జ్‌, ఫెల్డ్‌’సార్‌కు సంబంధించినవి 55 వరకు లీజుకు ఇవ్వగా, మైనర్‌ మినరల్స్‌.. గ్రానైట్‌ 12, స్టోన్‌, మెటల్‌ 67, లాటరైట్‌ 3 వరకు ఉన్నాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి సంవత్సరానికి దాదాపుగా రూ.8 కోట్ల ఆదాయం సమకూరుతోంది. గతంలో ఇచ్చిన మైనింగ్‌ లీజుల్లో ఫ్యూచర్‌ సిటీలో కొనసాగుతున్న గ్రానైట్‌, క్రషర్‌ యూనిట్లు కూడా ఉన్నాయి. కొన్నింటికి మరో రెండు మూడేళ్ల గడువు ఉంది. అయితే ఎఫ్‌సీడీఏ పరిధిలో గడువు పూర్తయిన వాటికి మరోసారి రెన్యువల్‌ చేయొద్దని ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో మైనింగ్‌ అనుమతులు మంజూరుచేయడం లేదని జిల్లా గనులు, భూగర్భ శాఖ అధికారి నర్సిరెడ్డి తెలిపారు.


ఇవి కూడా చదవండి...
సన్నధాన్యం @ రూ.3,400

నెలలో 50వేల మెట్రిక్‌ టన్నుల.. ఆయిల్‌పామ్‌ గెలల క్రషింగ్‌

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 05:11 AM