భారత చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ వేదిక కావాలి: డిప్యూటీ సీఎం
ABN , Publish Date - Feb 06 , 2026 | 08:01 PM
గద్దర్ పేరు మీద అవార్డులను రెండో ఏడాది ఇస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఉగాది పర్వదినం రోజు.. ఈ అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని తెలిపారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 06: టాలీవుడ్ ఎలాంటి సాయం కోరినా తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. టాలీవుడ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. శుక్రవారం నాడు హైదరాబాద్‌లో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కమిటీ సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత.. గద్దర్ పేరు మీద అవార్డులను రెండో ఏడాది ఇస్తున్నామన్నారు. ఉగాది పర్వదినం రోజు.. ఈ అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని తెలిపారు.
భారతీయ చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ నగరం వేదిక కావాలనే ప్రధాన సంకల్పంతో తమ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. హైదరాబాదుకు ఆ అవకాశం, ఆ వాతావరణం ఉందని తెలిపారు. చిత్ర పరిశ్రమ ద్వారా కమర్షియల్ వనరులు సమకూర్చుకోవచ్చని అన్నారు. ఉపాధి కల్పించవచ్చు.. ప్రపంచాన్ని సైతం ఆకర్షించవచ్చని చెప్పారు. తెలుగు సినిమా ప్రపంచ స్థాయిలో అవార్డులను సొంతం చేసుకుందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి వివరించారు.
ఈ గద్దర్ అవార్డులు విజయవంతం కావాలని.. అందుకు తమ ప్రభుత్వ సహకారం ఉంటుందని తెలిపారు. అయితే సీఎం రేవంత్, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. మున్సిపల్ ఎన్నికల హడావుడిలో ఉన్నారన్నారు. వారి తరఫున ఈ సందేశాన్ని తాను తెలియజేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TGFDC) చైర్మన్.. తన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు.
అవార్డుల ఎంపిక జ్యూరీ చైర్మన్ మణిశర్మ, కమిటీ మెంబర్స్‌తో కలిసి పారదర్శకంగా సినిమాలను ఎంపిక చేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. భారతదేశమంతా మన వైపు చూసేలా భారీగా గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విశ్వాసం వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం ఫిబ్రవరి 19వ తేదీన నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
టీటీడీలో తప్పులు చేసిన వారికి శిక్షలు తప్పవు: ఎల్వీ సుబ్రహ్మణ్యం
లిక్కర్ స్కామ్ నిందితుడి ఆస్తుల అటాచ్.. ప్రభుత్వం ఆదేశం