Share News

టీటీడీలో తప్పులు చేసిన వారికి శిక్షలు తప్పవు: ఎల్వీ సుబ్రహ్మణ్యం

ABN , Publish Date - Feb 06 , 2026 | 06:44 PM

టీటీడీలో కల్తీ నెయ్యి తరహా తప్పిదాలు భవిష్యత్‌లో జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం సూచించారు. ఇది కేవలం తప్పిదమే కాదు.. అత్యంత దుర్మార్గమని ఆయన అభివర్ణించారు.

టీటీడీలో తప్పులు చేసిన వారికి శిక్షలు తప్పవు: ఎల్వీ సుబ్రహ్మణ్యం
Retd IAS LV Subramanyam

అమరావతి, ఫిబ్రవరి 06: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో తప్పులు చేసిన వారికి శిక్షలు తప్పవని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం హెచ్చరించారు. తాను ఒక సామాన్య భక్తుడిగా కోరుతున్నానని.. తప్పు చేసినవారు అంగప్రదక్షిణ చేస్తారో? కోనేటిలో మునుగుతారో తేల్చుకోవాలని అన్నారు. తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై శుక్రవారం నాడు టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పందించారు. 2024లో లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసినట్లు సీఎం చంద్రబాబు తనకు చెప్పారని గుర్తు చేసుకున్నారు. లడ్డూ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం విచారణ కమిటీ వేసిందన్నారు.


సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ, సిట్‌ దర్యాప్తు చేపట్టిందని వివరించారు ఎల్వీ సుబ్రహ్మణ్యం. భవిష్యత్‌లో ఇలాంటి తప్పిదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఇది కేవలం తప్పిదమే కాదు.. అత్యంత దుర్మార్గమని ఆయన అభివర్ణించారు. వాస్తవాలు త్వరలోనే నిరూపితమవుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్రమార్కులు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ పాపాన్ని ఇప్పటికైనా రాజకీయ కోణంలో ఆలోచించొద్దని నిందితులకు హితవు పలికారు. చేసిన పాపాలను ఒప్పుకోండంటూ ఈ చర్యలకు పాల్పడిన వారికి ఎల్వీ సుబ్రహ్మణ్యం సూచించారు.


తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సన్నిధిలో పని చేసే వారిలో చిత్తశుద్ధి లోపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల ప్రసాదంలో రసాయనాలు కలిపి మహాపాపం చేశారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో అసలు తప్పే జరగలేదన్నట్లు మాట్లాడటం శోచనీయమన్నారు. తప్పు చేసిన వారిలో చిత్తశుద్ధి ఇంకా రావడం లేదని పేర్కొన్నారు. తమకు శిక్షలు పడవనే ధైర్యంతో కొందరు ఉన్నారని ఎల్వీ సుబ్రహ్మణ్యం మండిపడ్డారు.


తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం.. రోజూ 13 నుంచి 18 వేల కిలోల నెయ్యి వినియోగిస్తారని టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం గుర్తు చేశారు. స్వామివారి పవిత్రమైన ప్రసాదాన్ని అపవిత్రం చేశారని మండిపడ్డారు. అన్నప్రసాదాల్లోనూ అదే నెయ్యి వినియోగిస్తారని వివరించారు. నాణ్యత లేదని తెలిసినప్పుడు నెయ్యి ట్యాంకర్లను ఆపేయాల్సి కదా? అని అప్పటి ప్రభుత్వాన్ని ఎల్వీ సుబ్రహ్మణ్యం సూటిగా ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇబ్రహీంపట్నంలో జగన్ అభిమానుల హల్‌చల్

లిక్కర్ స్కామ్ నిందితుడి ఆస్తుల అటాచ్.. ప్రభుత్వం ఆదేశం

Updated Date - Feb 06 , 2026 | 07:15 PM